మైలవరం : ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం అందించేలా ప్రభుత్వం మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కలెక్టర్ వి.విజరు రామరాజు పేర్కొన్నారు. బుధవారం స్థానిక స్త్రీ శక్తి భవన్‌లో మండల స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి రాలేని వారి సమస్యలను స్థానికంగానే పరిష్కరించే దిశగా మండల స్థాయిలో ప్రతి బుధ, శుక్ర వారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కో మండలంలో 'జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రభుత్వం ప్రధాన్యత ఇస్తోందన్నారు. గ్రామ స్థాయి సమస్యలు మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అయ్యేలా మండల స్థాయి అధికారులు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ప్రజల సమస్యలకు మెరుగైన, వేగవంతమైన పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. అర్హతలు ఉండి ప్రభుత్వ పథకాలు అందుకోలేని వారు వెంటనే వారి పరిధిలోని సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించి ప్రభుత్వ పథకాల లబ్ది పొందాలన్నారు. ప్రజల అర్జీలకు అధికారులు అందించే పరిష్కార నివేదికలు స్పష్టంగా ఉండాలని ఇందులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జెసి గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జమ్మలమడుగు ఆర్‌డిఒ శ్రీనివాసులు హాజరై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ విజరురామరాజు










