ప్రజాశక్తి - మాచర్ల : పరిపాలనను ప్రజలకు చేరువ చేసి వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకే 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ అన్నారు. స్థానిక మానుకొండ కళ్యాణ మండపంలో మాచర్ల నియోజకవర్గం స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్ర మాన్ని బుధవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం తోపాటు బుధవారం శుక్రవారం కూడా మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం జరుగుతుందన్నారు. వచ్చిన అర్జీలను క్రింది స్థాయిలోనే ఎక్కడికక్కడ పరిష్కరించాలని, లేకుంటే అవి అంచలవారీగా కలెక్టర్ వరకు వస్తున్నాయని అన్నారు. ఫిర్యాదులను సమయానికి అనుగుణంగా పరిష్కరించాలన్నారు. ఇంటి స్థలం కోసం డప్పు కళాకారులు అర్జీలిచ్చారని, వారికి వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ అద్దయ్య, మున్సిపల్ చైర్మన్ ఎం.చినఏసోబు, వైస్ చైర్మన్ పి.నరసింహారావు, కమిషనర్ రమణబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఓటర్ల జాబిత సవరణలపై సమీక్ష
కార్యక్రమం అనంతరం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఓటర్ల జాబితా సవరణల పరిశీలనపై సమీక్షలో మాట్లాడుతూ అవకతవకలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. రాజకీయ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్‌ను ఓటర్ల సవరణలో భాగస్వామ్యం చేయాలని చెప్పారు. వారి నుండి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా క్షేత్ర స్థాయిలో పరిష్కరించేలా చూడాలన్నారు. రాజకీయ నాయకుల ఆరోపణలు లేకుండా ఓటర్ల జాబితా తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో ఇఆర్‌ఒ గబ్రూ నాయక్, జిల్లా సచివాలయల అధికారి మహలక్ష్మీ, ఆర్‌డిఒ అద్దెయ్య, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్, మండల అభివృద్ధి అధికార్లు పాల్గొన్నారు.










