Nov 13,2022 00:15

బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు

ప్రధాని సభకు తరలిన మెజార్టీ ఆర్‌టిసి బస్సులు
గంటల తరబడి రోడ్లపై, బస్‌స్టేషన్లలో పడిగాపులు
మారుమూల, గ్రామీణ ప్రాంతంలో మరీ దారుణం
అదును చూసి ఆటోలు, ప్రైవేటు వాహనదారుల దోపిడి
విశాఖ ఎయు గ్రౌండ్‌లో ప్రధాని మోడీ సభకు ఉమ్మడి విశాఖ జిల్లాల్లోని ఆర్‌టిసి డిపోల నుంచి మెజార్టీ బస్సులను జనసమీకరణకు తరలించడంతో, రాకపోకలకు ప్రజలు నానా ఇక్కట్లు పడ్డారు. గ్రామీణ ప్రాంతంలో అనేక రూట్లలో బస్సులు పూర్తిగా నిలిచిపోగా, రద్దీ ఉన్న రూట్లలో కొద్దిబస్సులే తిరగడంతో గమ్యస్థానాలు చేరుకోవడానికి ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు. ఇదే అదనుగా ఆటోవాలాలు, ప్రయివేటు వాహనదారులు రెట్టింపు మించి ఛార్జీలను వసూలు చేసి ప్రజల జేబులకు చిల్లుపెట్టారు.
(ప్రజాశక్తి విలేకర్ల యంత్రాంగం)
పాడేరు డిపో నుంచి 30 బస్సులు మళ్లింపు
పాడేరు.
: అల్లూరి జిల్లాలో ఏకైక ఆర్‌టిసి బస్సు డిపో పాడేరు నుంచి 30బస్సులను విశాఖలోని ప్రధాని మోడీ సభకు మళ్లించడంతో దాదాపు 90శాతం సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో మన్యవాసులు గంటలకొద్దీ బస్సుల రాక కోసం పడిగాపులు పడుతూనానా అవస్థలు పడ్డారు. పాడేరు నుంచి చింతపల్లి జోలాపుట్టు, అరకు, డొంకరాయి, రాజమండ్రి, కాకినాడ, చోడవరం ప్రాంతాలకు ఒక్కో బస్‌సర్వీసు మాత్రమే నడిచింది. నిత్యం రద్దీగా ఉండే విశాఖపట్నం పాడేరు బస్‌ సర్వీసులు కూడా బాగా తగ్గించి, కేవలం రెండు బస్సులే తిప్పారు. దూర ప్రాంతాలకు బస్సులు తిరగకపోవడంతో ప్రయాణికులు పాడేరు బస్‌ కాంప్లెక్స్‌లోనే గంటల కొద్ది పడిగాపులు పడ్డారు. అరకు, చింతపలి,్ల చోడవరం, పెదబయలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి, అధిక ఛార్జీలను చెల్లించి గమ్యాలను చేరుకున్నారు. ఇక జోలాపుట్‌, మంప, జీకే వీధి, గోమంగి తదితర దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు పూర్తిగా లేకపోవడంతో ప్రయాణికులు పాడేరు బస్‌కాంప్లెక్స్‌లోనే నిరీక్షించారు.మోడీ పర్యటనకు బస్సులన్నీ తరలించి, అవస్థలు పాల్జేసిన ప్రభుత్వం, ఆర్‌టిసి యంత్రాంగంపై ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు.
అనకాపల్లి : విశాఖపట్నంలో ప్రధాని మోడీ బహిరంగ సభకు అనకాపల్లి, నర్సీపట్నం డిపోల పరిధిలోని200బస్సులకు గాను 150 బస్సులను తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మిగిలిన పావు వంతు బస్సులను నర్సీపట్నం, విజయనగరం, చోడవరం తదితర ప్రాంతాలకు తిప్పడంతో మిగిలిన రూట్లలో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. కొన్నిరూట్లలో నాలుగైదు గంటలకుగానీ ఒక బస్సు రాకపోవడంతో ఉదయం నుంచి పిల్లా పాపలతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితితో ఎంక్వైరీ కౌంటర్‌ వద్ద సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.దీంతో ప్రజలు గమ్యస్థానాలను చేరుకునేందుకు తప్పనిసరిగా ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించగా, ఇదే అదనుగా వారు చేతివాటం చూపించారు. ఎపుడూ వసూలు చేసే ఛార్జీల కంటే మూడు,నాలుగు రెట్లు అధికంగా ప్రయాణికుల నుంచి వసూలు చేశారు.
గాజువాక : గాజువాక, విశాఖ స్టీల్‌సిటీ డిపో నుంచి అనేక బస్సులను మోడీ సభకు తరలించడంతో కనీసస్థాయిలో సిటీ బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. గాజువాక 38 బస్టాప్‌, శ్రీనగర్‌, కొత్త గాజువాక, నాతయ్యపాలెం బస్‌స్టాపుల వద్ద ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు పడ్డారు. చివరకు అధిక ఛార్జీలు చెల్లించి ఆటోలను ఆశ్రయించి వెళ్లాల్సి వచ్చింది. గాజువాక, గోపాలపట్నం వరకు రెగ్యులర్‌గా ఆటోలున్నా, అటుగా పెందుర్తి, కొత్తవలస, సింహాచలం వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
నర్సీపట్నం టౌన్‌: నర్సీపట్నం డిపోకు చెందిన 100 బస్సులకు గాను 76 బస్సులు విశాఖపట్నం సభకు తరలించారు. నర్సీపట్నం ప్రాంతం నుండి తుని వెళ్లే అన్ని బస్సులు రద్దయ్యాయి. దీంతో రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన ప్రయాణికులు అవస్థలు పడ్డారు. చోడవరం, అనకాపల్లి బస్సులు రద్దయ్యాయి. ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లి ఒక బస్సు తిరుగుతుండగా కేడీపేట, కొయ్యూరు వైపు ఒక బస్సే తిరిగింది. దీంతో, ప్రయాణికులు అనేక ఇక్కట్లు పడ్డారు. తగ్గించడంతో బస్సుల్లో సీటు మాత్రం దేవుడెరుగు, కనీసం వేలాడైనా గమ్యాలను చేరుకునేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. ఆర్‌టిసి బస్‌స్టేషన్‌లో పిల్లాపాపలతో గంటల తరబడి పడిగాపులు పడి, చివరకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి వెళ్లారు.
తగరపువలస : ప్రధాని సభకు భారీగా బస్సులు తరలిన నేపథ్యంలో విశాఖ, మద్దిలపాలెం తదితర డిపోల ఆర్‌టిసి బస్సులు తగరపువలస రాకపోవడంతో నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధికోసం వచ్చే వందలాది మంది అవస్థలు పడ్డారు. బస్‌పాసులన్నా అధిక మొత్తంలో ఛార్జీలను చెల్లించి అవస్థలు పడ్డారు.
సింహాచలం: ప్రధాన మోడీ బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు వెళ్లిపోవడంతో సింహగిరిపై అప్పన్న దర్శనానికి వచ్చిన భక్తులు పడిగాపులు పడ్డారు. దేవస్థానం బస్సులు పరిమిత సంఖ్యలో ఉండడంతో కొండెక్కి దిగడానికి గంటల తరబడి క్యూలైన్లలో వేచిఉండక తప్పలేదు.
నాలుగు గంటలైనా బస్సు లేదు..
బంధువుల ఇంటికొచ్చి తిరిగి నర్సీపట్నం వెళ్లేందుకు ఉదయం నుంచి కాంప్లెక్స్‌ వద్ద పడిగాపులు పడ్డాం. నాలుగైదు గంటలైనా బస్సు రాలేదు. ఆటో కోసం వెళితే, మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తున్నారు. గత్యంతరం లేక చెల్లించి వెళుతున్నాం.
- కళావతి, ప్రయాణికురాలు, నర్సీపట్నం

ఉన్న బస్సులన్నీ రద్దు చేశారు
రాజాం పల్లె వెలుగు బస్సుల్లో రోజు వెళ్లి వస్తుంటాం. ప్రధాని సభకు బస్సులు తరలించడంతో రాజాం రూటులో బస్సులన్నీ లేకుండా చేశారు. గంటల తరబడి వేచిచూసి, చివరకు వేరే మార్గంలో అధిక ఛార్జీలు చెల్లించి సొంతూరు వెళుతున్నాం.
- సత్తిబాబు, ప్రయాణికుడు, రాజాం.
పిల్లలతో ప్రయాణం కష్టం
రాజమండ్రి వెళ్దామని నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌కి రాగా బస్సులు లేవు.దీంతో తుని వెళ్లి అక్కడ నుండి రైలు లేదా బస్సులు మారాలి. పిల్లలతో బస్సులు మారి వెళ్లడం కష్టమే. అయినా తప్పదు.
-వియ్యపు లక్ష్మి, పోలవరం