- మురికి కూపాలుగా ప్రధాన కాల్వలు
- ప్లాస్టిక్ డంపింగ్ యార్డులుగా మారుతున్న వైనం
- నగరం గుండా ప్రయాణిస్తున్న బందరు, ఏలూరు, రైవస్ కెనాల్స్
- వేస్టును తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం
ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి
విజయవాడ నగరంలో ప్రయాణించే ప్రధాన కాల్వల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. కృష్ణా డెల్టా సాగునీటి నిమిత్తం ఏర్పాటు చేసిన ఈ కెనాల్స్ మురుగు కంపు కొడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంగా నేడు ప్లాస్టిక్ డంప్ కేంద్రాలుగా మారిపోయాయి. మూడు ప్రధాన నీటిపారుదల కాలువలు ఇప్పుడు టన్నుల కొద్దీ చెత్తతో నిండి పోయాయి. కాలుష్య ప్రమాదం పొంచి ఉండటంతో నగర వాసులు ఆందోళనలకు గురవుతున్నారు. అయితే కాల్వల కాలుష్యం కారణంగా ఏర్పడే పర్యావరణ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపిపిసిబి) ఇది వరకే విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లా అధికారులను హెచ్చరించింది. ఇప్పటికే విజయవాడ నగరంలో గాలి, శబ్ధ కాలుష్యం బాగా పెరిగిందని, ఈ నేపథ్యంలో సామూహిక క్లీనింగ్ డ్రైవ్‌లను నిర్వహించి ఎప్పటికప్పుడు వీటిని పరిశుభ్రంగా ఉంచుతూ కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ నగరానికి మూడు కాల్వలు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ వెనిస్ నగరంగా పిలువబడే విజయవాడ నగరం భౌగోళికంగా ఏలూరు కాలువ, బందర్ కాలువ, రైవ్స్ కాలువల మధ్య ఉంది. రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ కాలువలపై దాదాపు 20 వంతెనలు నిర్మించారు.
వర్షా కాలంలో నీటి ప్రవాహంతో ఆహ్లాదకర వాతావరణం అందించే కాలువలు వేసవిలో డంప్ సైట్‌లుగా మారుతున్నాయి. దీనికి తోడు నీటిపారుదల అధికారులు నీటిని విడుదల చేయక పోతుండటంతో ఎక్కడి చెత్త అక్కడ పేరొకొని పోతోంది. గతేడాది వేసవిలో ఏలూరు లాకుల వద్ద సుమారు 45 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించినట్లు విఎంసి అధికారులు చెబుతున్నా ఈ ఏడాది మాత్రం అలాంటి చర్యలు చేపట్టలేదని పలువురు ఆక్షేపిస్తున్నారు. కృష్ణా డెల్టా ప్రాంతానికి ఇవి ప్రధాన నీటి వనరులు. బ్రిటీష్ కాలంలో వీటిని తవ్వించారు. 57.70కిమీల మేర రైవస్ కాలువ ప్రయాణిస్తుంది. దాదాపు 1.75వేల ఎకరాలకు నీటిని అందించే విధంగా నాడు దీనిని డిజైన్ చేశారు. సాగు, తాగు నీటిని సరఫరా చేస్తాయి. గుడివాడ, మచిలీపట్నం, కైకలూరు, ఏలూరు ప్రాంతాలకు నీటని అందిస్తాయి. ఏలూరు కాలువ రైల్వేస్టేషన్ జంక్షన్, హనుమాన్‌పేట, అయోధ్యనగర్, మధురానగర్, గుణదల మీదుగా ప్రయాణిస్తుంది. బందరు కాలువ కింద 1.51లక్షల ఎకరాలు సేద్యం చేస్తున్నారు. అవనిగడ్డవైపు 1.37లక్షల ఎకరాలు సాగులో ఉంది. మొత్తం 60 చెరువులకు దీని ద్వారా నీటిని నింపుతున్నారు. ప్రస్తుతం రైవస్, ఏలూరు కాలువల కింద 3.33లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయి. అంతేకాకుండా ప్రకాశం బ్యారేజీ నుంచి వెళ్లే మూడు ప్రధాన కాలువల కింద జిల్లాలో దాదాపు 383 చెరువులను నింపడం ద్వారా 500 గ్రామాలకు పైగా తాగునీటిని అందిస్తున్నారు. మురుగు నీరుగా మారుతుండటంతో ఈ నీటిని వినియోగించలేమని గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. విజయవాడలో రోజుకు దాదాపు 550 టన్నుల చెత్త వెలువడుతుంటే ఇందులో కనీసం 20శాతం కాలువల్లో పడవేస్తున్నారు. కాలువలన్నీ ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలతో నిండి పోతున్నాయి. ఇలా మురికి కూపాలుగా మారిన కాల్వలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. అంతేకాకుండా దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు ప్రమాదకరంగా ఉంటుందని జనాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.










