కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ వార్డులు/ డివిజన్లలో ఏకగ్రీవ ఎన్నిక జరగడం ఆశ్చర్యాన్ని కలిగించడమేగాక ఆందోళనకరంగానూ అనిపిస్తోంది. రాష్ట్రం లోని 2,794 వార్డులు/ డివిజన్లలో 578 ఏకగ్రీవమైనాయని ప్రకటించారు. ఆ 578లో 571 అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారంటే ఈ ప్రక్రియ ఎంత ఏకపక్షంగా జరిగిందో తేటతెల్లమవుతోంది. ఏకగ్రీవ ఎన్నిక అంటే నిజంగా ఏకాభిప్రాయ సాధన ద్వారా జరిగిందా? అంటే అవును అని గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పే పరిస్థితి వేళ్ల మీద లెక్కపెట్టగల చోట్ల మాత్రమే ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల ముగ్ధులైన ప్రజలు వైసిపికి నీరాజనాలు పలికారన్న ఆ పార్టీ నాయకుల ప్రకటనలు చదివిన, విన్నవారు ఆంధ్ర ప్రదేశ్‌లోని పట్టణ ప్రజల మధ్య ఇంతలా ఏకాభిప్రాయ సాధన ఎలా సాధ్యమైందని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకుముందరి ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా ప్రలోభాలు పెట్టడం, ఒత్తిడి చేయడం, బెదిరించడం, అప్పటికీ దారికి రాకపోతే కిడ్నాప్ లేదా ఇతర దండోపాయాలను ప్రయోగించడం ద్వారానే ఉపసంహరణలు జరిగాయని రాష్ట్రం కోడై కూస్తోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొన్ని చోట్ల ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు రహస్య ప్రదేశాలకు పోవడంతో వారి ప్రతిపాదకులపై ఇటువంటి అస్త్రాలనే ప్రయోగించింది. అభ్యర్థికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు వారితో లేఖ రాయించి ప్రత్యర్థులను బరిలో నుంచి తప్పించారంటే దీన్నేమనాలి? కొన్ని చోట్ల ఫోర్జరీ సంతకాలతో కూడా ఈ తంతు సాగించడంతో అధికారులు సైతం నిస్సహాయులుగా మిగిలిపోయారన్న వార్తలు గగుర్పాటు కలిగిస్తున్నాయి.
చిత్తూరు కార్పొరేషన్‌లో పూర్తి స్థాయి మెజార్టీని, తిరుపతి, కడప కార్పొరేషన్లలో దాదాపు సగం డివిజన్లు పోలింగ్ జరగకుండానే అధికార పార్టీ ఖాతాలో పడ్డాయి. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాల్టీల్లో అన్ని వార్డుల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులే ఏకగ్రీవం కావడం చిత్రమైన విషయం. ఇక మరో ఎనిమిది మున్సిపాల్టీల్లో సగం కంటె ఎక్కువ వార్డులు అధికార పార్టీకే దక్కాయట. చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లోనూ పల్నాడు ప్రాంతంలో 'ఏకగ్రీవాల' సంఖ్య ఎక్కువగా వుంది. సూళ్లూరుపేట, కొవ్వూరు, తుని వంటి చోట్ల కూడా అధిక సంఖ్యలో ఏకగ్రీవమయ్యాయంటే మిగిలిన జిల్లాల్లో కూడా ఈ సంస్కృతి విస్తరించిందని విదితమవుతోంది. ఎలాగైనా అధికార పార్టీయే గెలవాలన్న యావతో పార్టీ ఫిరాయింపులను విచ్చలవిడిగా ప్రోత్సహించింది. పాలక పార్టీ అభ్యర్థులకు పోటీగా నిలిచిన టిడిపి, వామపక్షాల అభ్యర్థులను, వారి ప్రతిపాదకులనూ మాత్రమేగాక వైసిపి తిరుగుబాటుదార్లనూ కొన్ని చోట్ల ఇబ్బందులపాల్జేశారు. సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శిని సైతం అధికారపార్టీ అనుయాయులు కిడ్నాప్ చేయడం వారి బరితెగింపునకు పరాకాష్ట.
ఇటువంటి బలవంతపు ఏకగ్రీవాలు ఇప్పుడేనా? ఇంతకు ముందు కూడా జరిగాయి కదా అని కొందరంటారు. అయితే, ఇంత ఎక్కువగా (20.5 శాతం) ఎప్పుడైనా జరిగాయా? అంటే లేదన్నదే వారి సమాధానం. తప్పుడు పద్ధతులు పాతవే కాని వాటి తీవ్రత, విస్తృతి పెరిగింది. అలాగే గతంతో పోల్చితే డబ్బు చేతులు మారడం పెరిగిందనీ, ఆ మొత్తాలు కూడా ఊహించనంత ఎక్కువగా ఉన్నాయన్నది జనవాక్యం. ప్రచార కార్యక్రమ 'నిర్వహణ', పోలింగ్ ముందు రోజు 'ఖర్చు'లతో పోల్చుకుంటే ఈ మొత్తం తక్కువేనని అభ్యర్థులు, వారి ఫైనాన్సియర్లూ సర్ది చెప్పుకుంటున్నారు.
తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పాలన తీరు తమను గెలిపిస్తాయని వైసిపి నేతలు పదేపదే ప్రకటిస్తున్నారు. అంతటి ప్రజాభిమానం ఉన్నదన్న నమ్మకం నిజంగా ఆ పార్టీ నాయకులకుంటే ఈ బలవంతపు ఏకగ్రీవాలెందుకు? బెదిరింపులు, కిడ్నాపులు ఎందుకు? డబ్బు వరదలా పారించడం ఎందుకు? తమ పార్టీ తప్ప వేరొకరు ఉనికిలో ఉండకూడదన్న ఆరాటమే ఈ ఏకగ్రీవాల వెనుక వినిపించే అసలు స్వరం. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రమూ పొసగని ధోరణి. రాజకీయ పార్టీ అంటేనే ప్రజాస్వామ్య వ్యవస్థతో ముడిపడి ఉండేది. ప్రజాస్వామ్యాన్ని తోసి రాజంటే ఎలా చెల్లుతుంది? గెలుచుకోవాల్సింది సీట్లు కాదు. నిజమైన ప్రజాభిమానం. దానికి తగ్గట్టు పద్ధతులు మార్చుకోవడం క్షేమదాయకం.










