May 22,2021 07:36

   విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షణీయం. ప్రయివేటు కబంధ హస్తాల నుంచి విశాఖ ఉక్కును పరిరక్షించేందుకు ఉద్యోగులు, కార్మికులు, ప్రజా సంఘాలు చేపట్టిన ఉద్యమం నూరు రోజులు పూర్తి చేసుకుంటున్న తరుణంలో అసెంబ్లీలో చేసిన తీర్మానం ఈ ఉద్యమానికి మరింత ప్రోద్బలం ఇస్తుందనడంలో సందేహం లేదు.
   దేశమంతటా నేడు ఆక్సిజన్‌ కొరతతో కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్‌ ఉత్పత్తికి నడుం బిగించింది విశాఖ ఉక్కే కదా? ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రయివేటురంగంలోని ఏ కంపెనీ అయినా ఇంతటి స్ఫూర్తిని కనబర్చిందా? లాభాల కంటే ప్రజా ప్రయోజనాలే మిన్నగా భావించి విశాఖ ఉక్కు అండగా నిలుస్తోంది. వేలాది మందికి ఊపిరిపోస్తోంది. ఆంధ్రులకు ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి విశాఖ ఉక్కు కొండంత అండ. ప్రకృత్తి విపత్తులొచ్చినా, మంచినీటికి ఇక్కట్లు కలిగినా విశాఖ ఉక్కే ఆదుకుంది. భరోసాగా నిలిచింది. సామాజిక బాధ్యతతో దేశ ప్రజానీకానికి సేవలందిస్తున్న విశాఖ ఉక్కును కాపాడుకోవడం మనందరి బాధ్యత.
   సొంత గనులు ఉండి వుంటే నష్టాల మాటే వుండేది కాదు. సొంత గనుల ప్రాధాన్యతను కార్మిక సంఘాలు, వామపక్షాలు పదేపదే గుర్తు చేస్తున్నా పాలకులు పెడ చెవినపెట్టారు. ప్రయివేటీకరణ యత్నాలు చాపకింద నీరులా సాగిపోతున్నా.. నాడు టిడిపి ప్రభుత్వం, నేడు వైసిపి ప్రభుత్వం ఈ విషయంలో మీనమేషాలు లెక్కించాయి.
   అసెంబ్లీలో తీర్మానం చేసేసి చేతులు దులిపేసుకోకుండా ప్రత్యక్ష పోరాటంలోనూ భాగస్వామ్యమై విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు కేంద్రంపై పోరుకు అధికార వైసిపి ముందుకు రావలసిన అవసరముంది.
   కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో గాని, రాష్ట్రానికి నిధుల కేటాయింపులో గాని, కోవిడ్‌ వ్యాక్సిన్‌ల విషయంలో గాని వివక్షత చూపుతున్నా మోడీకి సహకరించాలన్న మాట తప్ప రాష్ట్రం హక్కుల కోసం అవసరమైతే కేంద్రంతో తలపడతామన్న మాట ముఖ్యమంత్రి నోటి వెంట రావడం లేదు. విశాఖ ఉక్కుపై తీర్మానం సందర్భంగా కూడా విజ్ఞప్తులు, వేడికోళ్లే కానీ తెలుగువాడి వాడి, వేడి కనపడలేదు.
   అసాధారణ పరిస్థితుల్లో కేవలం ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడంపైనా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనాతో ప్రజలు విలవిల్లాడిపోతున్న తరుణంలో కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ప్రతిపక్షాలను కలుపుకొని వైరస్‌ కట్టడికి కృషి చేస్తుంటే వైసిపి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాలను సాధ్యమైనంత దూరంగా ఉంచాలనుకోవడం సరికాదు. శాసనసభను కేవలం చట్టాలు చేసే సభగానో, బడ్జెట్‌ పద్దులను ఆమోదించుకునే వేదికగానో చూడటం సబబు కాదు. అది ప్రజా ప్రతినిధుల సభ. యావత్‌ రాష్ట్ర ప్రజల మనోభీష్టాలను ప్రతిబింబించే రాజ్యాంగ దేవాలయం. అలాంటి వేదికపై ప్రతిపక్ష గళాలకు ఆస్కారమివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలదే. విపత్కర పరిస్థితుల్లో సమాలోచనలకు, సలహాలకు చట్ట సభల సమావేశాలు ఎంతో దోహదం చేస్తాయి. అలాంటి అవకాశాలను విడనాడి రాష్ట్రానికి ఒక ఏడాది పాటు దిశానిర్దేశం చేసే బడ్జెట్‌ సమావేశాలను ఒక తంతుగా ముగించడం ఏమాత్రమూ మంచిది కాదు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా సమావేశాలకు హాజరై విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను విరమించుకోవాలని ఏకగ్రీవ తీర్మానం చేసివుంటే దానికి మరింత ప్రాధాన్యత దక్కివుండేది కదా. వైసిపిని ఆడిపోసుకోవడమే తప్ప కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా టిడిపి కూడా జాగ్రత్త పడుతోంది. ఈ రెండు ప్రధాన పార్టీల మెతక వైఖరితో రాష్ట్రం కేంద్రానికి మరింత అలుసైపోతోంది.
   వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పరిహారంతో సహా రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలను ఎగ్గొట్టిన కేంద్ర ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకొని ఈ ఏడాది బడ్జెట్‌కు రూపకల్పన చేయడం మబ్బులని చూసి ముంతలోని నీటిని వొలకబోయడమే. వనరులను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే ప్రయత్నాలేవీ చేయకుండా కేవలం అప్పులు చేసి పప్పు కూడు తిన్న చందంగా సంక్షేమ గొప్పలతో కాలం వెళ్లబుచ్చాలనుకోవడం సరికాదు. వాస్తవ స్థితిగతుల ఆధారంగానే పాలకుల ప్రణాళికలున్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది.
   రాష్ట్రంలో కరోనా ఉధృతి ఇంకా పెరిగే దిశలోనే కొనసాగుతోంది. పైగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. దానికి బ్లాక్‌ ఫంగస్‌ తోడైంది. ఇది రాష్ట్రాన్ని ఆవరించిన పెను విపత్తు. ప్రజల ముందు వాస్తవాలను ఉంచి అన్ని పక్షాల సహకారాన్నీ అభ్యర్థించి అందరినీ కలుపుకుని ఉమ్మడి పోరాటం చేయడానికి అసెంబ్లీ సమావేశాన్ని ఒక వేదికగా ఉపయోగించుకోవడంలో, తద్వారా ప్రజలలో ఒక విశ్వాసాన్ని పాదుకొల్పడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ప్రజలను కరోనా విపత్తు నుండి కాపాడడం కన్నా గొప్ప సంక్షేమం వేరే ఏదీ లేదన్న సత్యాన్ని ప్రభుత్వం విస్మరించడం శోచనీయం.