Dec 05,2021 12:49

'ఛ... రోజు రోజుకీ ఇల్లు నరకంలా మారుతోంది..' అంటూ పెరటిలో భార్య పక్కన కూర్చుంటూ విసుక్కున్నాడు దశరథరామయ్య..
'మళ్లీ ఏమైందండీ...? మళ్లీ గొడవ పడుతున్నారా వాళ్లు..!' అంటూ కంగారుతో అడిగింది జానకమ్మ.
'హా.. గొడవేగా.. రోజూ ఉండేదే.. ఒకరికి అహం.. ఇంకొకరికి ముక్కు మీద కోపం.. ఎవ్వరూ సర్దుకుపోరు..' అంటూ తమ కొడుకు, కోడలి గురించి మాట్లాడుకుంటున్నారు ఆ వృద్ధ దంపతులు.
'శ్రీరామ్‌, లక్ష్మి చూడచక్కనైన జంట.!' పెళ్లికొచ్చిన వారందరి నోటా ఇదే మాట.
దృష్టి దోషమో లేక కలవని మనసుల దోషమో, ఫలితం రోజూ ఇంట రణరంగం..
శ్రీరామ్‌ గుణవంతుడు అయినా.. పురుష సహజమైన అహం కూడినవాడు.
లక్ష్మి మహాలక్ష్మిలా ఉన్నా, ముక్కు మీద కోపం ఎక్కువ. మాటంటే పడదు.
పెళ్లి అయిన సంవత్సరం తర్వాత నుంచి పూల దగ్గరి నుంచి మొదలుకుని, డబ్బు వరకూ అన్ని విషయాల్లోనూ రోజూ యుద్ధాలే చేస్తున్నారు.
వారి మధ్య రాజీ కుదిర్చి, వారి వివాహ బంధాన్ని నిలపడంలో ఈ పెద్దవాళ్లు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంకో శుభోదయాన.. చిన్న గొడవ చిలికి చిలికి, గాలి వానయ్యింది. రణరంగం మళ్లీ మొదలయ్యింది.
శ్రీరామ్‌ : ఏంటీ.. కార్డు ఎందుకు ఇవ్వవు? చూశావా నాన్నా.. ఏమంటోందో నీ కోడలు!
లక్ష్మి : ఎందుకివ్వాలి..? వద్దన్నా ఉద్యోగం మాన్పించి, నాకంటూ సంపాదన లేకుండా చేశారు. ఇప్పుడు పూలకీ, పౌడర్‌కీ కూడా మిమ్మల్నే దేబిరించాలా? అదీ మీరు భిక్షం వేస్తే.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆ కాస్త పుట్టింటి డబ్బు మీకిచ్చేస్తే, నేనేం చేయాలి? మీరే చెప్పండి అత్తయ్యా..!
శ్రీరామ్‌ : పుట్టింటి డబ్బా..? నా ఇంట్లో ఉంటూ, నేను పెట్టేది తింటూ, నా డబ్బు అంటావా..? అంటూ భార్య మీద చేయి చేసుకున్నాడు.
జానకమ్మ : రేరు ఏంటిది..? అమ్మాయి మీద చేయిచేసుకుంటావా..? అమ్మాయి అన్నదాంట్లో తప్పేముందిరా..?
శ్రీరామ్‌ : అంతేలేమ్మా.. ఎంతైనా మీ పుట్టింటి తరపు బంధువుగా! అలాగే వెనకేసుకొస్తావ్‌. అంటూ కోపంగా వెళ్లిపోయాడు.
దశరథరామయ్య : ఏమ్మా లక్ష్మీ! చదువుకున్న దానివి. నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా..? ఆడపిల్లవి నువ్వే సర్దుకుపోవాలి!
లక్ష్మి : అంతేలెండి మావయ్యగారు.. ఎప్పుడూ నేనే సర్దుకుపోవాలి. ఇంత చేసినా మీ అబ్బాయిని మాత్రం, ఒక్కమాట కూడా అనలేదు! అంటూ ఏడుస్తూ వెళ్లిపోయింది.
'ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు మొత్తానికి ఇద్దరూ గొడవపడి మనమీద అలిగి వెళ్లారేంటి..?' అనుకుంటూ ఇద్దరూ విస్తుపోయారు.
అలకలు, పస్తులు, శోకాలతో ఆ రోజు గడిచిపోయింది.
ఆ రాత్రి ఇద్దరికీ ఎంతకీ నిద్రపట్టలేదు.
దశరథరామయ్య : ఏంటీ పిల్లలు.. రోజూ ఏదో ఒక విషయం మీద కీచులాడుకుంటున్నారు. పెళ్లయ్యి రెండేళ్లు కాలేదు. అప్పుడే అపార్థాలు.. గొడవలు. ఏం తక్కువైంది వాళ్లకి? డబ్బు, హోదా, సొంత ఇల్లు, కారు, సకల సౌకర్యాలు, అండగా తలపండిన మనం. ఇన్ని ఉన్నా గొడవలెందుకు? ఎలా వీరి మధ్య సఖ్యత పెంచేది?
జానకమ్మ : మరే.. మన పెళ్లి నాటికి మన పరిస్థితి ఏంటి..? అరకొర జీతంతో, పేదరికంతో ఏమున్నా, లేకపోయినా ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం. ఇద్దరి తరపునా పెద్దవాళ్లు కూడా ఆస్తి పేరుతో, అంతస్తు పేరుతో మనల్ని దూరం పెడితే, ఆ బాధ పంటి బిగువన పెట్టుకుని, ఒకరికొకరమై తోడున్నాం. ఎన్ని కష్టాలయినా కలిసి పంచుకున్నాం. ఏనాడూ అది లేదు, ఇది లేదు అనుకోలేదు. గొడవపడిన జ్ఞాపకమే లేదు. అంటూ కళ్లు తుడుచుకుంటూ గతాన్ని గుర్తుచేసుకుంది.
దశరథరామయ్య : అవును.. ఆనాడు మన పెద్దవాళ్లెవరూ మనకు తోడులేరు. మనిద్దరం ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ.. సమస్య వస్తే ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉన్నాం.
జానకమ్మ : అవును.. మనం మన పిల్లలకి ఇంతలా ప్రతి విషయంలోనూ తోడుండి నడిపిస్తున్నా, ఎందుకిలా జరుగుతోంది..
దశరథరామయ్య : అదే మనం చేస్తున్న తప్పు..
జానకమ్మ : అదేంటి.. !!!???
దశరథరామయ్య : అవును..
ప్రతి విషయం మనమే సాల్వ్‌ చేస్తే, వాళ్లిద్దరూ ఒకరినొకరు సంప్రదించుకునేదెలా.. ఒకరినొకరు అర్థం చేసుకునేదెలా..
జానకమ్మ : నిజమే.. మరి ఏం చేయాలి ఇప్పుడు?
దశరథరామయ్య : ఏకాంతం...
పిల్లల్ని వాళ్ల మానాన వాళ్లని వదిలేయాలి..
మనం కొన్నాళ్లు దూరంగా ఉందాం వాళ్లకి..
ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఇవ్వాలి..
జానకమ్మ : అంటే మనం వాళ్లకి అడ్డమంటారా..!!??
దశరథరామయ్య : అడ్డం కాదు జానకి.. మహావృక్షం నీడలో చిరు మొక్కలు ఎదగలేవు.. అలాగే మనం ఎప్పుడూ వాళ్లని సమస్యలకు ఎదురీదకుండా కాపాడుతూ ఉంటే వాళ్లు ఎదగలేరు.. అందుకే కష్టమైనా కొన్నాళ్లు దూరంగా ఉంటే సమస్యలే వారి సమస్యకి సమాధానం చెప్తాయి.
జానకమ్మ : ఎలాగండి.. వాడికా మీరు లేకుండా ఏ నిర్ణయమూ తీసుకోలేడు.. ఆ అమ్మాయి చిన్నదే.. ఏదన్నా సమస్య వస్తే.. దెబ్బతింటారేమో.. ఇంక మన అనుభవం అంతా బూడిదలో పోసిన పన్నీరే..
దశరథరామయ్య : ఒకసారి దెబ్బతింటారు.. రెండోసారి అనుభవం అవుతుంది.. అప్పుడే ఒకరి మీద ఒకరు ఆధారపడతారు.. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు.. ఈ ప్రయత్నంలోనే సఖ్యత కూడా పెరుగుతుంది.. అనుభవాలే అన్నీ నేర్పిస్తాయి జానకి.. ఏమంటావ్‌..?
జానకమ్మ : మీ ఇష్టం.. పిల్లలు బావుండడమేగా కావాల్సింది.. సరే..
మర్నాడు ఉదయం 7:00గంటలకు
దశరథరామయ్య : శ్రీరామ్‌.. అమ్మా లక్ష్మీ!
శ్రీరామ్‌ : ఏంటి నాన్నా.. పొద్దున్నే లగేజీతో ఎక్కడికి..?
దశరథరామయ్య : మేము తీర్థయాత్రలకు వెళ్తున్నమురా.. అటు నుంచి మీ మేనమామ ఇంటికి, అక్కడే ఉంటున్న చిన్నాన్న ఇంటికి వెళ్లాలనుకుంటున్నాం. ఓ ఆర్నెల్ల వరకూ రాము.. ఇల్లు, మీరు జాగ్రత్త.. మాటిమాటికీ మాకు ఫోన్‌చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి.
శ్రీరామ్‌ : మరీ ఆర్నెల్లు ఏంటి నాన్నా..!!
జానకమ్మ : చుట్టాలందరినీ కలవాలని.. ఇంకెప్పుడు కుదురుతుంది.
అందుకే.. వెళ్లొస్తాం.. అమ్మా లక్ష్మి.. ఇల్లు జాగ్రత్త.. అంటూ కోడలికి జాగ్రత్తలు చెప్పి బయల్దేరారు.
ఓ రెండు రోజులు మౌన యుద్ధమే జరిగింది ఇంట్లో..
'అమ్మంత కాకపోయినా వంట బాగానే చేస్తోంది లక్ష్మి' అనుకున్నాడు శ్రీరామ్‌.
సమయానికి అన్నీ అందిస్తూ, లేట్‌ నైట్‌ అయినా ఇదివరకిటిలా సాధించకుండా శ్రీరామ్‌ కోసం వెయిట్‌ చేస్తోంది.
ఒంట్లో బాగోకపోతే అమ్మలా చూసుకొంటోంది.
తనలో వస్తున్న మార్పుని గమనిస్తూ, తను కూడా మారుతున్నాడు.
ఓరోజు పొద్దున్నే పుస్తకాలు, క్యాలిక్యులేటర్‌తో కుస్తీ పడుతున్నాడు శ్రీరామ్‌..
లక్ష్మి : ఏంటండీ.. మ్యాథ్స్‌ ఎగ్జామ్‌ ఏమైనా ఉందా అని అడిగింది కొంటెగా.. చిరు కోపంతో తనని చూసి, ఏమీ సమాధానం చెప్పకుండా పని చేసుకుంటున్నాడు శ్రీరామ్‌.
దగ్గరికెళ్లి చూస్తే ఏవో పాలసీ బిల్స్‌, ఇంకేవో బిల్స్‌, అకౌంట్‌ బుక్స్‌ ఉన్నాయి. ఏమైందండీ.. ఏదైనా లెక్క తేలట్లేదా అనడిగింది.
శ్రీరామ్‌ : హా.. అవును అన్నాడు అసహనంగా..
వెంటనే అకౌంట్‌ బుక్‌ తీస్కుని, క్యాలిక్యులేటర్‌తో ఫాస్ట్‌గా రెండు నిమిషాల్లో లెక్క తేల్చి చెప్పింది.
శ్రీరామ్‌ : అదేంటీ.. ఇంత బాగా ఎలా చేశావ్‌.. అనడిగాడు ఆశ్చర్యంగా..
లక్ష్మి : ఎకనామిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ నేను, అంది చిరునవ్వుతో..
శ్రీరామ్‌ : మరి ఇన్నాళ్లూ.. చెప్పలేదు..?
లక్ష్మి : అలాంటి సందర్భం ఎప్పుడూ మన మధ్య రాలేదు..
శ్రీరామ్‌ : ఓకే.. ఇక నుంచి అకౌంట్స్‌ అన్నీ నువ్వే చూసుకో.. అన్నాడు మెచ్చుకోలుగా..
లక్ష్మి తనకో గుర్తింపు దొరికినందుకు ఎంతో ఆనందించింది.
ఓ రోజు సడన్‌గా ఇంటికి కొందరు బంధువులు వచ్చారు. 'మా భోజనాలు ఇక్కడే.. చూద్దాం.. మా వదిన కోడలు ఏమాత్రం వంట చేస్తుందో' అంటూ సాగదీసింది శ్రీరామ్‌ మేనత్త.
లక్ష్మి గుండెల్లో రాయి పడింది.. ఏదో ముగ్గురో నలుగురో అయితే చేయగలదు. కానీ వచ్చింది మొత్తం పదిమంది. ఎప్పుడూ అత్తగారికి వంట సాయం చేయడమేగానీ, తను స్వయంగా ఇంతమందికి వండి వార్చాలంటే లక్ష్మికి కాళ్లు చేతులూ ఆడలేదు. వంటింట్లో కంగారుగా ఉన్న లక్ష్మిని చూసి, విషయం ఏంటని అడిగాడు శ్రీరామ్‌.
విషయం విని 'ఓస్‌.. ఇంతేనా.. నువ్వేం కంగారుపడకు. నువ్వు వంట అద్భుతంగా చేస్తావ్‌.. నేను నీకు సాయంచేస్తా' అంటూ చుట్టాలందరినీ పెరటిలో కూర్చోబెట్టి, తన బ్యాచిలర్‌ అనుభవంతో వంటలో సాయం అందించాడు.
వచ్చినవాళ్లు లొట్టలేసుకుని తిని, లక్ష్మిని ఎంతో అభినందించారు. లక్ష్మి ప్రేమగా శ్రీరామ్‌ని చూసి కృతజ్ఞతలు తెలిపింది.
దశరథరామయ్య, జానకమ్మ అప్పుడప్పుడూ ఫోన్‌ చేసి, ఎలా ఉన్నారో కనుక్కుని రెండో మాటకి ఆస్కారం లేకుండా పెట్టేస్తున్నారు.
ఓ రోజు ఫోన్‌ పట్టుకుని, ఎవరెవరికో ఫోన్‌ చేస్తూ టెన్షన్‌గా తిరుగుతున్నాడు శ్రీరామ్‌.
లక్ష్మి : ఏమైందండీ అలా ఉన్నారు.
శ్రీరామ్‌ : హా.. ఏం లేదు.. చిన్న బిజినెస్‌ ప్రాబ్లెమ్‌..
లక్ష్మి : ఏంటి ఆ ప్రాబ్లెమ్‌..!!??
శ్రీరామ్‌ : ఏం లేదులే లక్ష్మి.. నీకెందుకులే ఈ టెన్షన్స్‌ అన్నీ..
లక్ష్మి: పర్వాలేదు చెప్పండి.. అంది ప్రేమగా
శ్రీరామ్‌: నా ఫ్రెండ్‌కి ఐదు లక్షలు షూరిటీ ఇచ్చాను.. రేపే కట్టాల్సిన తేదీ.. వాడేమో ఇప్పుడే కట్టలేను, చాలా ఇబ్బందిలో ఉన్నా అంటున్నాడు.. షూరిటీ ఇచ్చింది నేనే కాబట్టి, ఇప్పుడు నేనే కట్టాలి. అంత డబ్బు ప్రస్తుతానికి నా దగ్గర లేదు. అందుకే, అప్పు కోసం ట్రై చేస్తున్నా.. ఇంత సడన్‌గా అనేసరికి ఎవరూ ఇవ్వట్లేదు.
లక్ష్మి: అవునా..! అంది సాలోచనగా
ఇంట్లోకి వెళ్లి ఓ బ్యాగుతో తిరిగి వచ్చింది.
లక్ష్మి: ఇదిగోండి.. ఇవి తీసుకోండి
శ్రీరామ్‌: ఏంటిది..? అన్నాడు ఆశ్చర్యంగా..
లక్ష్మి: ఇవి నా నగలు.. మొత్తం అమ్మినా పర్వాలేదు.
శ్రీరామ్‌: ఛ.. ఛ.. నీ నగలు అమ్మడమేంటి లక్ష్మి.. నేను వేరే చోట ట్రై చేస్తాను.. తీసుకెళ్లి లోపలపెట్టు.
లక్ష్మి: అదేంటండీ..అవసరానికి ఆదుకోపోతే, ఈ వస్తువులెందుకు.. నేనెందుకు..??
శ్రీరామ్‌: అది కాదు లక్ష్మి.. అవి మీ పుట్టింటి వాళ్లు పెట్టినవి.. అవెందుకు.. బాగోదు.
లక్ష్మి: పుట్టింటి వాళ్లిచ్చినా నావేగా ఇప్పుడు.. నా భర్తకేగా ఇస్తున్నా.. మీకు నలుగురిలో పరువుపోతే నాకూ అవమానమేగా..
మీరింకా పాత విషయాలు మర్చిపోయినట్టులేరు.. అప్పుడేదో కోపంగా అన్నా.. సారీ అందుకు.. అంది చెవులు పట్టుకుని..
ఆమె అంత ప్రేమని చూపించేసరికి శ్రీరామ్‌ మనసు ఎన్నో రోజుల తర్వాత సంతోషంతో నిండిపోయింది.
ఆమె నుదిటిమీద చిన్న ముద్దు పెట్టి, బ్యాగ్‌ తీసుకున్నాడు.
అలా పాల బిల్లు దగ్గర్నుంచి, పాలసీ బిల్లు వరకూ, పెరటిలో పెంచే మొక్క నుంచి ఇంట్లోకి కొనే వస్తువుల వరకూ.. అన్ని విషయాల్లోనూ ఒకరినొకరు సంప్రదించుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూ సంసారం సాగిస్తున్నారు.
ఇంకా ఎన్నో కీలక విషయాల్లో లక్ష్మి తన అభిప్రాయాలతో సహకరిస్తోంది. తెలియని విషయాలు తెలుసుకుంటోంది.
ఓ రోజు లక్ష్మి అటకపైన సామాను కోసం, స్టూల్‌ ఎక్కి తీయబోతూ కింద పడింది. చేతికి చిన్న ఫ్రాక్చర్‌ అయ్యి, ఓ వారం రెస్ట్‌ తీసుకోమన్నారు డాక్టర్‌.
ఆ వారం రోజులూ లక్ష్మిని చిన్న పాపాయిలా చూసుకున్నాడు.
తను మిస్‌ అయిన పాత శ్రీరామ్‌ మళ్లీ కనిపించాడు. అన్నం తినిపించడం, బట్టలు, జడ అన్నీ తనే దగ్గరుండి చూసుకున్నాడు.
ఇంకొక్క ముద్ద అంటూ గోరుముద్దలు తినిపిస్తుంటే లక్ష్మి కళ్ల వెంట ఆనంద భాష్పాలు రాలాయి.
తనకి దెబ్బ తగిలి, తనకి మంచి జరిగిందనుకుంది. ఇన్ని రోజులూ ఏం మిస్‌ అవుతున్నారో తెలిసింది వాళ్లిద్దరికీ.. వారం తర్వాత లక్ష్మి పూర్తిగా కోలుకుంది.
శ్రీరామ్‌ ఇంట్లో చిన్న చిన్న సహాయాలు చేయడం మొదలుపెట్టాడు. తనకోసం ఇంత చేసిన భర్త కోసం స్పెషల్‌ డిన్నర్‌ రెడీ చేసింది.
త్వరగా ఇంటికి రమ్మని, తమ కోడ్‌ లాంగ్వేజ్‌లో మెసేజ్‌ పెట్టి ముసి ముసిగా నవ్వుకుంది.
మెసేజ్‌ చూసి, శ్రీరామ్‌ కూడా ఆఫీస్‌ నుంచి ఎంతో హుషారుగా బయల్దేరాడు. దారిలో మల్లెపూలు కనిపిస్తే ఆగి, 'పాపం ఎన్నిసార్లు మల్లెపూలు తెమ్మని అడిగిందో.. నేనే ప్రతిసారీ విసుక్కునేవాణ్ణి..' అంటూ బుట్టెడు మల్లెలు తీసుకున్నాడు.
ఇంటికి వెళ్లేసరికి, చిలక ఆకుపచ్చ రంగు చీర, గులాబీ రంగు బ్లౌజ్‌తో కొత్త పెళ్లికూతురిలా తయారయ్యింది. ఆమెని అలా చూస్తూనే ఉండిపోయాడు.
'ఏవండోరు శ్రీవారు.. ఇంట్లోకి వచ్చేది ఉందా..?' అంటూ కొంటెగా నవ్వింది.
'వెళ్లి ఫ్రెష్‌ అయ్యి రండి భోజనం వడ్డిస్తా..' ఒకరికొకరు గోరుముద్దలు తినిపించుకుని అన్నాళ్టి వారి దూరానికి తెరదించారు. చంద్రుడు కూడా వారికి ఏకాంతాన్ని కలిగిస్తూ మబ్బుల చాటుకెళ్లాడు..
ఆర్నెల్లు అనుకున్న పని, నాలుగు నెలల్లోనే పూర్తయ్యి, మనవడు పుట్టబోతున్నాడనే శుభవార్త చేరగానే రెక్కలు కట్టుకుని వచ్చారు దశరథరామయ్య, జానకమ్మ.
నెలకోసారి వారికి ఓ వారం రోజులు ఏకాంతం కల్పిస్తూ.. వారి దాంపత్యాన్ని దృఢం చేస్తున్నారు.
భార్యా భర్తల సఖ్యతకు ఇటువంటి ఏకాంతాలు ఎన్నో అవసరం.. అంటే దీనర్థం పెద్దవాళ్లు/ ఇంకెవరైనా కుటుంబసభ్యులు అడ్డమని కాదు.
భార్యాభర్తల ప్రతీ విషయంలో జోక్యం చేసుకోకుండా, కొన్ని వారికే వదిలేస్తూ, కొన్నిసార్లు వారి పెద్దరికాన్ని ఉపయోగిస్తూ.. భార్యాభర్తల బంధాన్ని దృఢం చేయాలి.
భార్యాభర్తలు కూడా ప్రతీ చిన్న విషయాన్నీ, గొడవనీ పెద్దల వరకూ తీసుకెళ్లకుండా వారే పరిష్కరించుకోవాలి.
దాంపత్యంలో పెద్దల జోక్యం లేకపోతే, సంసారం చుక్కాని లేని నావలా తయారవుతుంది. అదే అతిగా జోక్యం చేసుకుంటే, భార్యాభర్తల మధ్య అవగాహన లోపిస్తుందని, దశరథరామయ్య, జానకమ్మ మరోసారి గుర్తుచేసుకున్నారు.

వేదాంతం భావన
bhavanav.pharma@gmail.com