
పార్వతీపురం: జిల్లాలో పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని, మిగిలిన 12 మండలాల్లో పంట నష్టపోయిన ప్రతి పంచాయతీనీ కరువుగా ప్రకటించాలని సిపిఎం నాయకులు జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావుకు సోమవారం వినతిని అందజేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ ఇటీవల సిపిఎం బృందం పార్వతీపురం మండలంలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిందన్నారు. వర్షాభావంతో ఎండిపోయిన వరిని పొట్టదశకు వచ్చిన పంట మొత్తం పూర్తిగా నీరులేక ఎండిపోయిందన్నారు. ఈ ప్రాంతంలో వర్షాధారంతో వరి నాట్లు వేయడం తప్ప కాలువ సౌకర్యం లేదని, దీంతో మండలంలో సుమారు 70శాతం వరి నాట్లు పంట దశకు వచ్చి దెబ్బ తిన్నాయని, తీవ్రంగా నష్టపోయామని రైతులు తమ వద్ద వాపోయారని తెలిపారు. అలాగే గుమ్మ లక్ష్మీపురం, కురుపాం మండలాలోని తమ పర్యటనలో 90శాతం భూమిలో వరి నాట్లు పడలేదని, నాట్లు వేసినవి కూడా వర్షాలు పడక పంటలు పూర్తిగా ఎండిపోయి తీవ్ర కరువుకు గురయ్యాయని అన్నారు. కావున ఈ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే భామిని, సీతంపేట, వీరఘట్టం, పాలకొండ, సీతానగరం, గరుగుబిల్లి, కొమరాడ, సాలూరు, బలిజిపేట తదితర మండలాల్లో పంచాయతీ స్థాయిలో వర్షాభావంతో వరి నాటుమల్లు దెబ్బతిన్నాయని, కావున పంచాయతీల వారి కరువు ప్రాంతాలుగా ప్రభు త్వం ప్రకటించి రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని, ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని. జిల్లాలో సాగునీటి సౌకర్యం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, జంఝావతి పూర్తి చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో మినీ రిజర్వాయర్లు, చెక్ డ్యాములు నిర్మించి, సాగునీటి వనరులకు నిధులు కేటాయించాలని డిమాండ్ డిమాండ్ చేశారు. అలాగే పై ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించే వరకు సిపిఎం పోరాడుతుందని, జిల్లా రైతులంతా ఆందోళన పోరాటం చేపట్టాలని వేణు పిలుపునిచ్చారు. వినతిని అందజేసిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు వి.ఇందిర, జిల్లా కమిటీ సభ్యులు కె.రామస్వామి, జి.వెంకటరమణ, బి.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘం వినతి
జిల్లాలో వర్షాలు సకాలంలో పడకపోవ డంతో వరి పంటకు పూర్తిగా నష్టం వాటిల్లిందని, కావును జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి, బంటు దాసు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావంతో కాలువల చివర, వర్షాధార భూముల్లో వరి పూర్తిగా దెబ్బతిందన్నారు. కొమరాడ మండలంలో పత్తి కూడా పోయిందని, ఇప్పటివరకు వ్యవసాయ శాఖ అధికారులు ఎలాంటి సర్వే చేయలేదన్నారు. ఇప్పటికైనా నష్టపోయిన పంట భూములను సర్వే చేసి రైతులకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జెసిలను కోరారు.
దళితు భూములను దళితులకే అప్పజెప్పాలి
గరుగుబిల్లి మండలం శివాం గ్రామ దళితులకు వారి భూములను వారికే అప్పజెప్పాలని కలెక్టర్‌కు మరో వినతి పత్రాన్ని అందించారు. 1970లో శివం గ్రామ దళితులకు ప్రభుత్వ భూముల్లో డి పట్టాలిచ్చారన్నారు. తరువాత భూస్వాములు అధికారుల అండతో దళితుల భూములను ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని వాటిని వెంటనే భూ సర్వే చేసి దళితులకు ఆ భూములను అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివం దళితులు, రైతు సంఘం సభ్యులు పాల్గొన్నారు.
తహశీల్దార్‌కు వినతి
గుమ్మలక్ష్మీపురం : మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ స్థానిక తహశీల్దార్ జె.రాములమ్మకు సిపిఎం నాయకులు సోమవారం వినతిని అందించారు. సకాలంలో వర్షాల్లేక 50 శాతం మాత్రమే వరి నాట్లు పడ్డాయని, అయినా వర్షాలు కురవక పోవడంతో వేసిన పంట పూర్తిగా ఎండిపోయిందని అన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కరువు మండలంగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కోలక అవినాష్, జిల్లా కమిటీ సభ్యులు మండంగి రమణ, నాయకులు బిడ్డిక శంకరరావు, సన్యాసిరావు, సర్పంచి బి.రాజారావు ఉన్నారు.