Dec 06,2022 23:41

లంపీస్కిన్‌ వ్యాధితో కిండ్ర కాలనీలో మృతి చెందిన పడ్డపెయ్య

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
రంపచోడవరం ఏజెన్సీలో లంపీ స్కిన్‌ వ్యాధి శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో పశువులు మృత్యువాత చెందగా, అనేక పశువులు వ్యాధి బారిన పడ్డాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజవొమ్మంగి మండలంలోని 19 పంచాయతీల్లో సుమారు 8వేలు ఆవులు, 2వేలు గేదెలు ఉన్నాయి. వీటిల్లో తెల్లజాతి ఆవులకు ఎక్కువగా లంపీ స్కిన్‌ వ్యాధి సోకుతుంది. ఇది సోకిన ఆవులకు తొలిత జ్వరం వస్తుంది. అనంతరం పెద్ద, పెద్ద మచ్చలు, బొబ్బెలు ఏర్పడి చర్మం అంద వికారంగా తయారవుతుంది. ఈ వైరస్‌ నుండి కొన్ని తెల్లజాతి పశువులు తేరుకోగా కొన్ని మృతి చెందుతున్నాయి. మండలంలోని రాజవొమ్మంగి, కిండ్ర, లాగరాయి, వాతంగి తదితర పంచాయతీల్లో నెలరోజుల వ్యవధిలో సుమారు పదికి పైగా పశువులు మరణించాయి. ఏజెన్సీలో వందలాది పశువులు ఈ వ్యాధి బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నాయి. కిండ్ర కాలనీ గ్రామంలో సోమవారం లంపీ స్క్రీన్‌తో రెండు పశువులు మృత్యువాత పడగా, కొన్ని పశువులు వ్యాధితో బాధపడుతున్నాయి. ఈ వైరస్‌ సోకకుండా తొలిత పశు వైద్యాధికారులు నివారణ టీకాలు వేసినప్పటికీ వైరస్‌ ప్రభావం ఇంకా ఏజెన్సీలో కొనసాగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు వ్యవసాయ సీజన్‌లో దుక్కులకు, బండ్లకు ఉపయోగపడే తెల్లజాతి ఎద్దులు సైతం ఈ వైరస్‌ బారినపడి మత్యువాత పడుతున్నాయని, దీంతో లక్షలాది రూపాయలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి లంపీ స్కిన్‌ వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు.
వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి
తెల్లజాతి పశువులకు లంపీ స్కిన్‌ వ్యాధి సోకి మృత్యువాత పడుతున్నాయి. ఉన్నతాధికారులు వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి. మిగతా పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి.
- గంటిమళ్ళ అచ్చిపాత్రుడు, కిండ్ర కాలనీ గ్రామం.
రైతులను ఆదుకోవాలి
లంపీ స్కిన్‌ వ్యాధితో మండలంలోని అనేక మంది రైతులకు చెందిన పశువులు మరణించడంతో లక్షలాది రూపాయలు నష్టపోతున్నాం. పశువులను కోల్పోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
- గంపా నాగరాజు, కిండ్ర కాలనీ గ్రామం
రైతులు జాగ్రత్తలు పాటించాలి
తెల్లజాతి పశువులకు లంపీ స్కిన్‌ వ్యాధి వల్ల మృత్యువాత పడడంతో పాటు, చాలా పశువులు ఈ వైరస్‌ నుంచి కోలుకుంటున్నాయి. ప్రస్తుత సీజన్‌లో పశువులకు గాలిగుంటు వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ప్రస్తుతం పశువులకు బ్రుసెల్లా టీకా వేయడం జరుగుతుంది. రైతులు జాగ్రత్తలు పాటించాలి.
- తరుణ్‌, పశువైద్యాధికారి, రాజవొమ్మంగి.