ప్రజాశక్తి-పాడేరు:ఏజెన్సీలో సమగ్ర భూ సర్వే చేయాలని జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ ఆదేశించారు.కలెక్టరు కార్యాలయంలో భూముల రీ సర్వే ఏజెన్సీలతో సోమవారం చర్చించారు. డిజిపిఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) యంత్ర పరికరాలను పరిశీలించారు. నెట్ వర్క్ సదుపాయాలు లేని ప్రాంతాలలో డిజిపిఎస్ పరికరాలు సర్వేకు ఉపయోగపడతాయని వివరించారు.పాడేరు రెవిన్యూ డివిజన్ పరిధిలో 11 మండలాల్లో 2,969, రంపచోడవరం పరిధిలో 308 గ్రామాలలో రీ సర్వే నిర్వహించాలన్నారు. ఆయా సర్వే సంస్థలకు మండల సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శలు, విఆర్‌ఓలు సహకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్వే సహాయ సంచాలకులు వై. మోహనరావు, ప్రతినిధులు పి.కృష్ణ ప్రసాద్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
రీసర్వే పై జెసి పరిశీలన
ప్రజాశక్తి-డుంబ్రిగూడ:జగనన్న శాశ్వత భూహక్కు పథకంలో భాగంగా మండలంలోని నందివలసలో స్థానిక రెవెన్యూ అధికారులు చేపడుతున్న భూముల సర్వే పై అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ సోమవారం మండలంలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ భూముల రీ సర్వేను ప్రతి ఒక్క రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రెవెన్యూ అధికారులు రైతులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఎప్పటికప్పుడు రీ సర్వేను వేగవంతంగా చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి తహశీల్దార్, ఆర్‌ఐ పాల్గొన్నారు.










