ప్రజాశక్తి -సీలేరు
గిరిజన ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణానికి అటవీశాఖ అధికారులు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి, గాలికొండ ఎంపీటీసీ అంపరంగి బుజ్జిబాబు డిమాండ్ చేశారు. అనుమతులు ఇవ్వకపోవడమంటే గిరిజన ప్రాంత అభివృద్ధిని అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడమే అవుతుందన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ గిరిజనులు పూర్వం నుండి ప్రధాన రహదారులకు 10 నుండి 30 కిలోమీటర్ల దూరంలో అడవుల్లో పొడి వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తూ వస్తున్నారని తెలిపారు. వారు నిత్యవసర సరుకులు కొనుక్కోవాలంటే రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల ప్రభావం ఉండడం వలన మారుమూల ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణాలు చేయలేకపోయామని గత ప్రభుత్వాలు చెప్పుకొచ్చాయని తెలిపారు. రహదారులు నిర్మిస్తే అడవులు నష్టపోతాయని ఇప్పుడు అటవీ శాఖ డిఎఫ్‌ఓ చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఏజెన్సీలోని అడవులు నష్టపోకుండా మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అధికారులు అడ్డంకుల వల్ల మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయాయని తెలిపారు. ఎప్పటికైనా అటవీశాఖ అధికారులు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలని, లేకుంటే గిరిజన ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.










