Sep 13,2023 17:13

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
    ఏజెన్సీలో పాడైపోయిన రోడ్లను తక్షణమే నిర్మించి, రోడ్లకు పైన ప్రవహిస్తున్న కొండవాగులపై ఎతైన బ్రిడ్జిలు నిర్మించాలని ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో కెఆర్‌ పురం ఐటిడిఎ ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ప్రగతిశీల యువజన సంఘం డివిజన్‌ కార్యదర్శి, సహాయ కార్యదర్శి గురుగుంట్ల ప్రసాద్‌ రెడ్డి, తగరం బాబురావు మాట్లాడుతూ టిడిపి హాయాంలో రోడ్ల దుస్థితి ఏవిధంగా వుందో, వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రోడ్ల పరిస్థితి మెరుగుపడలేదన్నారు. ప్రజలు ఈరోడ్లపై ప్రయాణించడానికి భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. రోడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని చిందర వందరగా పాడైపోయి, పెద్ద పెద్ద గోతులతో ఉన్నాయన్నారు. వర్షం వస్తే వర్షపు నీరు గోతులలో చేరి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ఏజెన్సీలో ఆదివాసీ గ్రామాలకు వెళ్లే రోడ్లు రోడ్లకుపైన ప్రవహిస్తున్న కొండవాగులు ఉదృతికి గతంలో నిర్మించిన సపటాలు, వంతెనలు పూర్తిగా పాడైపోయాయన్నారు. బుట్టాయగూడెం నుంచి కొన్ని గిరిజన గ్రామాల ప్రజలు జంగారెడ్డిగూడెం, ఆస్పత్రులకు, కోర్టులకు, ఆఫీసులో పనిమీద వెళ్లాలన్నా జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టినపాలెం గ్రామం దగ్గర జల్లేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు పూర్తి చేయాలన్నారు. బ్రిడ్జి పనులు ఆగిపోయి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వం, పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షాకాలం వస్తే జల్లేరు వాగు పొంగి పట్టినపాలెం దగ్గర ఎంతోమంది ప్రజలు వాగులో కొట్టుకుపోయి, ప్రాణాలు విడుస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఇటు పోలవరం నియోజకవర్గం ఎంఎల్‌ఎ, అటు చింతలపూడి నియోజకవర్గ ఎంఎల్‌ఎ స్పందించి తక్షణమే పట్టెనపాలెం దగ్గర నిలిచిపోయిన బ్రిడ్జిని పూర్తి చేసి, ప్రజలకు న్యాయం చేయాలన్నారు. అలాగే దొరమామిడి నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గోతులమయమై ప్రయాణానికి ప్రమాదంగా మారిందని, ఈ రోడ్డుని వెంటనే నిర్మాణం చేపట్టాలన్నారు. జీలుగుమిల్లి నుంచి కామయ్యపాలెం మీదుగా రాసినగూడెం, పోచికపాడు, అంకన్నగూడెం మీదుగా దిబ్బగూడెం వరకూ రోడ్డు నిర్మించాలన్నారు. చింతకొండ దగ్గర ఉన్న కొండవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ కమిటీ సభ్యులు కట్టం నాగేశ్వరరావు, నడపాల మొక్కరెడ్డి, కరకాల నడిపి రాజు, పూనెం రాముడు, మామిడి మురళీ, గురుగుంట్ల బాబురావు, కురసం యేసు, పిడిఎస్‌యు నాయకులు బంన్నె వినోద్‌, వివిధ గ్రామాల నుంచి యువత పెద్ద ఎత్తులో పాల్గొన్నారు.