ప్రజాశక్తి - కురుపాం : ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో వర్ష ప్రభావం సరిగ్గా లేక కొన్ని గ్రామాల్లో పూర్తిగా వరి నాట్లు పడలేదని కరువు సహాయక చర్యలు ప్రభుత్వం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలో గుజ్జువాయి పంచాయతీలో డి.బారామణి, కాలనీగూడా తదితర గిరిజన గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ష ప్రభావం సరిగ్గా లేక ఆకు మడలతో ఉండిపోయావని, సుమారు వంద ఎకరాలు వరినాట్లు పడలేదని అన్నారు. ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టి గిరిజనులను ఆదుకోవాలని కోరారు. అనంతరం ఉదయపురం పంచాయతీలో గల జాకరగూడ, సంజువాయి, కాకితాడ, మొండెంఖల్ గల పంచాయతీలో గల ఇచ్ఛాపురం గ్రామాలను సందర్శించి అక్కడ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు గడప గడపకు నిధులతో కొంత వరకు సిసి రోడ్లై అయ్యాయని,ఇంకా చాలావరకు రహదారులు శంకుస్థాపనలు జరిగాయి కానీ పనులు ఇంకా జరగలేదని అన్నారు. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజన గ్రామాల్లో అన్ని రహదారి పనులు పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆరిక మన్మధరావు, ఎ.కృష్ణారావు, శ్రీనివాస్, టి.శంకరరావు, కె.వైకుంఠం, మండంగి కృష్ణారావు, రంగారావు, మండంగి ఇండియా, వాసు, బి.అనీల్ పాల్గొన్నారు.










