ప్రజాశక్తి-విఆర్.పురం
ఏజెన్సీలోని క్రీడాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని ఎంపిపి కారం లక్ష్మి అన్నారు. మండలంంలోని రేకపల్లి పంచాయతీ పరిధిలోని క్రికెట్ గ్రౌండ్లో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను ఎంపీపీ కారం లక్ష్మి, స్థానిక సర్పంచ్ పూనెం సరోజిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నమెంట్‌లో 65 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.30వేలు, ద్వితీయ బహుమతిగా రూ.20వేలు, తృతీయ బహుమతిగా రూ.10వేలు అందజేయనున్నట్లు చెప్పారు. ఇందులో పాల్గొన్న ఎస్‌డిఎస్ ప్రాజెక్ట్ అధికారి గాంధీబాబు, విఆర్ పురం ఎస్సై దుర్గాప్రసాద్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఆటలు ద్వారా యువతకు మంచి మార్గం అలవడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, చిన్నమటపల్లి ఎంపీటీసీ ప్రదీప్ కుమార్, పెద్దమటపల్లి సర్పంచ్ వెట్టి లక్ష్మి, శ్రీరామగిరి సర్పంచ్ పులి సంతోష్ కుమార్, సిపిఎం నాయకులు వడ్లాది రమేష్, కుంజ నాగిరెడ్డి, ప్రకాష్, టోర్నమెంట్ నిర్వాహకులు, వివిధ మండలాల క్రీడాకారులు పాల్గొన్నారు.










