సీతంపేట: గిరిజన ప్రాంతంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. అడలి వ్యూ పాయింట్ (పర్యాటక సర్క్యూట్)ను ఐటిడిఎ పిఒ కల్పనా కుమారితో కలిసి పరిశీలించారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా పర్యాటకుల సందర్శన కోసం క్యాంపింగ్ టెంట్లు, ఫుడ్ కోర్టు, ఫోటో సెషన్‌కు అనువుగా వ్యూ పాయింట్ ఏర్పాటుకు పనులకు సంబంధించి సూచనలు చేశారు. సెప్టెంబర్ నెలాఖరులోగా పర్యాటక అభివృద్ధి పనులను పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ ఇఇ ఎస్. సింహాచలంను ఆదేశించారు. రూ.కోటీ 60 లక్షలతో ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియంను పరిశీలించారు. ఐటిడిఎ నిర్మిస్తున్న పర్యాటక సర్క్యూట్‌లో భాగంగా రెస్టారెంట్, ఫుడ్ కోర్టు, లంచ్ పాయింట్, వాణిజ్య దుకాణాలు నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం స్థానిక ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. రూ.19.07కోట్లతో చేపడుతున్న 100 పడకల భవన పనులను పరిశీలించారు. గైనకాలజీ , ఓపి విభాగం ఫ్లోర్లను నిశితంగా పరిశీలించారు. ఆగస్ట్ 15 నాటికి ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేసి అప్పజెప్పాలని గుత్తేదారును ఆదేశించారు. రూ.49.26 కోట్లతో చేపడుతున్న మల్టీస్పెషల్టి ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. బ్లాకుల నిర్మాణం, నిధుల చెల్లింపు విషయాలను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ నాటికి ఆసుపత్రిని సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అనంతరం మండలంలోని కిండంగిలోని నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్, గ్రామ సచివాలయం భవనాన్ని, సోమగండిలోని రైతు భరోసా కేంద్రాన్ని, గ్రామ సచివాలయం భవనాన్ని పరిశీలించారు. అనంతరం హడ్డుబంగిలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలను సందర్శించారు. నాడు-నేడు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు జగనన్న గోరు ముద్ద క్రింద అందిస్తున్న మెనూపై ఆరా తీశారు. రన్నింగ్ వాటర్ సౌకర్యం, పిల్లల భోజన గదిని పరిశీలిం చారు. ఆర్‌ఒ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూతికవలస నుండి ద్వారబంధం వరకు సుమారు 3 కిలో మీటర్ల మేరకు నిర్మించిన తారు రోడ్డును పరిశీలించారు. పనుల వివరాలను పంచాయితీ రాజ్ ఇఇ ఎస్.రాధా రాణి కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట పంచాయతీ రాజ్ డిఇ లోకనాధం, ఎఇ పి.కిరణ్ కుమార్, ఎపిఎంఐఎస్ ఎఇ ఇంద్రసేనారెడ్డి, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ బి శ్రీనివాసరావు, డిడి ఎం.శ్రీనివాసరావు, ఉప విద్యా శాఖ అధికారి ఎ.లిల్లీ రాణి, ఎంఇఒలు డి.సూర్యచంద్రరావు, ఆనందరావు హడ్డుబంగి హెచ్‌ఎం తదితరులు పాల్గొన్నారు.
బి.ఉమావాణి ఉపాధ్యాయులు, గ్రామ సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










