ప్రజాశక్తి - రంపచోడవరం
ఏజెన్సీలోని ప్రమాదకర గర్భిణులపై వైద్యాధికారులు, ఎఎన్‌ఎంలు ప్రత్యేక దష్టి పెట్టాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. రంపచోడవరం డివిజన్ పరిధి ఏడు మండలాల్లోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, హెల్త్ సూపర్‌వైజర్లతో సోమవారం కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యాధికారులు ఇంటింటికి వెళ్లి గర్భిణుల ఆరోగ్య సమస్యలు తెలుసుకొని ఎవరికైనా రక్తహీనత ఉంటే దానిని నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శీతాకాలంలో పిల్లలకు ట్రాన్సిల్స్ వచ్చే అవకాశం ఉన్నందున వారికి వైద్యం, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు అందించాలని సూచించారు. అనంతరం గంగవరం మండలం, వాడపల్లి పిహెచ్‌సి వైద్యాధికారిగా పని చేసి విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్‌కి మైక్రో బయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రమోషన్‌పై వెళుతున్న మొగలపూడి సత్యతేజను ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే, డిఎంహెచ్‌ఓ జమీల్ బాషా, ఎడిఎంహెచ్‌ఓ డాక్టర్ అనూష, పిహెచ్‌సి వైద్యాధికారులు అభినందించారు.
అగ్రి విద్యార్థులకు వ్యవసాయం, మార్కెటింగ్‌పై అవగాహన
మండలంలోని జాగరంపల్లి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ విద్యార్థులకు వ్యవసాయం, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం జాగరంపల్లి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్‌ను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఎడ్యుకేషన్ లోన్లు అందించే విధంగా ఎల్డీఎంలతో సంప్రదించాలన్నారు. ఈ పాలిటెక్నిక్ కాలేజీకి రావాలంటే చాలా దూరంగా ఉందని, కొద్దిగా ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు తెలియజేయగా, కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అనంతరం జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కళాశాలకు తాగునీరు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.
యువకులకు పోలీస్ శాఖలో ఉద్యోగాలు
చదువుకొని ఉన్న యువతీ యువకులకు పోలీస్ శాఖలో ఉద్యోగాలు పొందే విధంగా తగు చర్యలు తీసుకొంటున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మండలంలోని పందిరిమామిడి యూత్ ట్రైనింగ్ సెంటర్లో పోలీస్ శాఖలో ఉద్యోగాల కొరకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 257 మంది పురుషులు, 84 మంది మహిళా అభ్యర్థులు పోలీసు ఉద్యోగాల కొరకు శిక్షణ పొందుతున్నారని, వారికి భోజనం, వసతి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లా ఎస్‌పి సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వారికి రంపచోడవరం వైటీసీలో శిక్షణ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే, డ్రగ్ కంట్రోల్ అధికారి రవిశంకర్ అన్నయర్, ఏఎస్పి ఆదిరాజ్ సింగ్ రాణా, కమాండెంట్ పి.కిషోర్. సుధీర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీధర్ చక్రవర్తి, సిఐ సురేష్ బాబు, రాజు పాల్గొన్నారు.










