ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా ఏజెన్సీ ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సాగును నిర్మూలించేందుకు రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ఉక్కు పాదం మోపుతోంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో విస్తృతంగా గంజాయి సాగుతున్నట్లు గుర్తించిన అల్లూరి జిల్లా పోలీస్ శాఖ ఈ ప్రాంతంలో సమూలంగా గంజాయి నిర్మూలనకు ఒడిస్సా పోలీస్‌లతో సమన్వయ కార్యాచరణకు సిద్ధమవు తోంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు గంజాయి తోటల పెంపకం ఎగుమతుల ప్రక్రియను పూర్తిగా నియంత్రించాలనే భావంతో పోలీస్ శాఖ కదులుతోంది. ఇప్పటికే అల్లూరి ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలనకు పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది.
జి.మాడుగుల, జీకే వీధి, పాడేరు మండలాల్లో గంజాయి తోటలను గుర్తించి ధ్వంసం చేసి పలువురిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. ఇక మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగు సమాచారం రాబట్టేందుకు పోలీస్ శాఖ నిర్దిష్టమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల నుంచి రహస్య సమాచారం సేకరించేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. అక్రమ గంజాయి రవాణా, సాగుకు కు సంబంధించి జిల్లా పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో (ఎన్‌డిపిఎస్‌ఎల్) గంజాయి నివారణ విభాగం ఏర్పాటు చేశారు.
గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు...
గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టామని ఇందులో భాగంగా గ్రామాల్లో గంజాయి సాగు పై సమాచారం ఇవ్వడంలో విఫలమైతే సాగు భూముల యజమానులు, గ్రామస్థాయి అధికారులపై కూడా ఎన్‌డిపిఎస్ (1985 సెక్షన్ 46)చట్ట ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానా వంటి చర్యలు ఉంటాయని అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. గంజాయి నిర్మూలనకు పలు విధాలుగా పటిష్టంగా చేపడుతున్న చర్యలను ఆయన విలేకరుల సమావేశంలో వివరించారు.గంజాయి సాగు పైన రవాణా పైన సమాచారాన్ని ఈ నెంబర్ 9381123100కు ఎవరైనా తెలియ చేయవచ్చునని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.గంజాయి నిర్మూలన కోసం పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ తమకు ఉందని వారు సమాచార అందించినప్పుడు తగిన పారితోషికాలు ఇస్తున్నామని ఇకపై కూడా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
పండ్ల తోటల పెంపకానికి తోడ్పాటు
ఏజెన్సీలో గంజాయి సాగును నిర్మూలించే చర్యలో భాగంగా పండ్ల తోటల పెంపకానికి తోడ్పాటు అందించేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. ఈ మేరకు 2023 సంవత్సరంలో సాగు నిమిత్తం ప్రభుత్వం, పోలీసు శాఖ సహకారంతో 7896 ఎకరాలలో జీడిపప్పు, సీతాఫలాలు, స్వీట్ ఆరెంజ్, యాసిడ్ లైమ్, జామ, కొబ్బరి, సపోటా, చింతపండు, మొరింగ, మామిడి, అవకాడో, నూనె మొక్కలు, డ్రాగన్ ఫ్రూట్స్, దానిమ్మ, జామన్, జాఫ్రా, కాపీ, రాజమా మొదలైన పంటల మొక్కలు సరఫరా చేసి సాగుకు తోడ్పాటు అందించినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలలో ప్రధాన పంట సిల్వర్ వోక్ మొక్కలను 1516.5 ఎకరాలకుగాను 10,62,061 మొక్కలను ఈ ఏడాది పంపిణీ చేసినట్లు తెలిపారు. యువత గంజాయికు బానిస కాకుండా ఉండేందుకు గాను, కాలేజీల్లోనూ, స్కూళ్లలోనూ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరివర్తన కార్యక్రమంలో ద్వారా చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా అల్లూరి జిల్లాలో జరిగే సంతల్లో కళాజాతాల ద్వారా గిరిజన ప్రజలను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్) పి.అనిల్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్‌పి వేణుగోపాల్, సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి పాల్గొన్నారు.










