Oct 13,2023 21:35

గుమ్మలక్ష్మీపురంలో గిరిజన గర్భిణులతో మాట్లాడుతున్న చైర్మన్‌ డివిజి శంకర్రావు

ప్రజాశక్తి - కురుపాం/గుమ్మలక్ష్మీపురం :  కురుపాం మండలం పొలంగూడలో పంచకామర్లతో ఇటీవల మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డివిజి శంకరరావు పరామర్శించారు. చిన్నారుల కుటుంబానికి ధైర్యం చెప్పారు. చిన్నారుల మృతి పట్ల సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. అనంతరం అదే గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. వైద్య శిబిరంలో స్వయంగా వైద్య పరీక్షలు చేశారు. అనంతరం గుమ్మలక్ష్మీపురంలోని భద్రగిరి 50 పడకల ఆసుపత్రిని సందర్శించిన చైర్మన్‌ రోగులతో మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రిలో గల ఎస్‌ఎన్‌సియును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల్లో ప్రజలకు అందుబాటులో స్పెషలిస్ట్‌ వైద్యుల చికిత్స లభిస్తుందన్నారు. బిపి, మధుమేహం వంటి వ్యాధులు వస్తున్నాయని, వీటిని ముందుగా గుర్తించడం ద్వారా అవసరమగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం వైద్యం, విద్యపై దృష్టి సారించడం సంతోషదాయకమన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని, ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుందని చెప్పారు. ఏనుగుల సమస్యపైన, తాగునీరు, రహదారులు వంటి మౌళిక సదుపాయాలు పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కె.శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలపై చైర్మన్‌కు వినతి
మన్యంలో పర్యటనకు వచ్చిన ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కురుపాం మండలం పి.లేవిడి వద్ద టిడిపి అరకు పార్లమెంట్‌ ప్రతినిధి ఎన్‌.కృష్ణబాబు, గిరిజన సంఘం నాయకులు పి.లక్ష్మయ్య, ఆర్‌.లోవరాజు గిరిజనుల సమస్యలపై వినతి పత్రం అందించారు. బోయ వాల్మీకి బెంతు, ఒరియాలను గిరిజన జాబితాలో చేరుస్తూ రాష్ట్రమంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం నిలిపివేయాలని, గిరి శిఖరాలకు రవాణా సౌకర్యం కల్పించాలని, జీవో 3ను పునరుద్ధరించాలని, గిరిజన సంస్కృతి, సాంప్రదాయాల రక్షణకు గుమ్మలక్ష్మీపురంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఏనుగులు గత ఐదేళ్లుగా పంటలు నాశనం చేయడమే కాక 10మంది ప్రాణాలు పోయావని, కావున వాటిని దూర ప్రాంతాలకు తరలించాలని వినతిని అందజేశారు. గుమ్మలక్ష్మీపురం మండలం డుమ్మంగిలో గిరిజన సంక్షేమ పాఠశాలను మంజూరు చేయాలని, గతంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎఎన్‌ఎంలు ఉండేవారని వారిని తీసివేశారని, తిరిగి వారిని నియమించి గిరిజన విద్యార్థుల ఆరోగ్యం కాపాడాలని వినతిని అందజేశారు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రానికి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం మంజూరైనా ఇంకా శిక్షణా కేంద్రం ప్రారంభం కాలేదని, వెంటనే దాన్ని ప్రారంభించాలని వినతి అందజేశారు. పై సమస్యలన్నింటికీ ఆయన సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
గర్భిణుల వసతిగృహం పరిశీలన
గుమ్మలక్ష్మీపురంలో గల గిరిజన గర్భిణుల వసతి గృహాన్ని చైర్మన్‌ పరిశీలించారు. గర్భిణులకు పౌష్టికాహారం, వైద్య సేవలు అందుతున్నదీ, లేనిదీ పరిశీలించారు. ఈ కేంద్రానికి జనరేటర్‌ ఏర్పాటు చేయాలని గర్భిణులు విజ్ఞప్తి చేశారు. అనంతరం భద్రగిరి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులతో సమావేశమై రోగులకు సేవలు అందుతున్నదీ లేనిదీ నూతన భవన నిర్మాణం చిన్నపిల్లల కేంద్రం పనితీరు తదితర అంశాలను చర్చించారు. అనంతరం రోగులతో మాట్లాడే వైద్య సేవలపై ఆరా తీశారు. చివరగా గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం మంచి పాఠశాలలను ఏర్పాటు చేసిందని, వీటిని సద్వినియోగం చేసుకొని మీ పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పలు గిరిజనుల సంఘాల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. ఆయన వెంట ఎటిడబ్ల్యూఒలు చంద్రమోహన్‌, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌లో యుగంధర్‌, పెంటయ్య, ఎలిమెంట్పేట సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐ షణ్ముఖరావు, ఉద్యోగులు, గిరిజన సంఘాల ప్రతినిధులు ఉన్నారు.