ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ఏజెన్సీలోని ప్రభుత్వ, ప్రైవేట్ భూములు అన్నింటికీ పక్కాగా రీ సర్వే చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. దేవీపట్నం మండలం దేవారం, శరభవరం గ్రామాల్లో శనివారం జెసి పర్యటించారు. భూముల రీసర్వే ఏవిధంగా జరుగుతుందో పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూహక్కు. భూరక్ష పథకం ద్వారా సర్వే చేసిన భూములు అన్నింటికీ రైతులకు హక్కు పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు. సర్వే చేసే సమయంలో ముందుగా రైతులకు నోటీసులు అందజేయాలని, సర్వే చేసే సమయంలో భూములకు హద్దులు చూపించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యాన్ని విక్రయించే విధంగా, దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి లారీలలో లోడు చేసిన వెంటనే సంబంధిత రైతులకు రసీదులు ఇవ్వాలని, సంబంధిత రైస్ మిల్లర్లతో ఎప్పటికప్పుడు సిబ్బంది మాట్లాడాలని సూచించారు. అనంతరం రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్ని మండలాలకు సంబంధించిన సచివాలయాల సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. భూహక్కు భూరక్ష రీసర్వే ద్వారా కొరిలేషన్ డేటా ఎంట్రీని ఏ విధంగా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. సర్వేలో సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిఎం కె.గణేష్ కుమార్, డివిజనల్ సివిల్ సప్లై అధికారి సి.శ్రీహరి, వీఆర్వోలు శివకుమార్, ఆనంద్, సీనియర్ అసిస్టెంట్ త్రిమూర్తులు, మండల సర్వేయర్ కుమారి తదితరులు పాల్గొన్నారు.










