Jan 18,2023 22:43

ఎపి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అర్జున్‌ దొర

ప్రజాశక్తి -ఎటపాక
1/70 చట్టానికి విరుద్ధంగా మండలంలోని రామగోపాలపురం రెవెన్యూ పరిధిలో యథేచ్ఛగా భూ ఆక్రమణలు జరుగుతున్నాయని, వాటిని రెవెన్యూ అధికారులు వెంటనే ఆపాలని ఎపి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కాకా అర్జున్‌ దొర డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ రామగోపాలపురం రెవెన్యూ పరిధిలో 2ఎ భూములను అనేక సంవత్సరాలుగా గిరిజనేతరులు ఆక్రమణలో ఉంచుకొని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన గిరిజనేతరులు కోనుగోలు చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీల నిర్మాణానికి, భూమికి భూమి కోసం అనేక సందర్భాల్లో అధికారులను అడిగితే ఎక్కడా 2ఎ భూముల లేవని చెప్పారని గుర్తు చేశారు. రామగోపాలపురం, లకీëపురం రెవెన్యూల పరిధిలో వందల ఎకరాల భూమి గిరిజనేతరుల ఆక్రమణలో ఉందని, ఆ భూమిని గుర్తించి, సేకరించి పోలవరం నిర్వాసితులైన వేలాది గిరిజన కుటుంబాలకి కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏజెన్సీలో భూ బదలాయింపు నిరోధక చట్టం ఉన్నప్పటికీ గిరిజనేతరులు చట్టాన్ని గౌరవించకుండా యథేచ్ఛగా అమ్మకాలు, కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణలు చేయడం లేదన్నారు. ఆన్‌లైన్‌ విధానం వచ్చిన తర్వాత ఒకరి భూమిని మరొకరికి ట్రాన్స్‌ఫర్‌ చేసే క్రమంలో అనేక అవకతవకలు జరుతున్నాయని, వీటిని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. గిరిజనేతరుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోకుంటే ఆ భూమిని అర్హులైన గిరిజనులకి ఇచ్చేదానికోసం ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.