Jul 09,2023 23:51

పాడేరులో ధర్నా చేపడుతున్న అంగన్‌వాడీలు (ఫైల్‌ పొటొ)

ప్రజాశక్తి -పాడేరు: ఏజెన్సీలో అంగన్‌వాడీలు పలు సమస్యలతో సతమతం అవుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ఆందోళన చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో, ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పిలుపు మేరకు..పాడేరు ఏజెన్సీలోని అన్ని మండలాల అంగన్వాడి వర్కర్లు ఈనెల 10, 11 సోమ, మంగళవారాల్లో 36 గంటలు ( పగలు, రాత్రి) అల్లూరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నారు. ఐసిడిఎస్‌ పరిరక్షణ, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్‌, పిఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ అమలు తదితర సమస్యలపై అంగన్వాడీలు కొన్నేళ్లుగా నిరంతర పోరాటం సాగిస్తూనే ఉన్నారు. గత 48 ఏళ్ల నుంచి గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అనేక సేవలందిస్తున్న అంగన్వాడీలకు కనీసం ఉద్యోగభద్రత కల్పించకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా ఈనెల 10,11 తేదీలలో 36 గంటల పాటు ధర్నా చేపట్టాలని రాష్ట్ర కమిటి నిర్ణయించింది. ఈ మేరకు చేపడుతున్న ధర్నాలో జిల్లాలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా కమిటీ పిలుపునిచ్చింది.
అంగన్వాడీల ప్రధాన డిమాండ్స్‌ :
అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి. ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలి. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ 5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలి. హెల్పర్ల ప్రమోషన్లకు వయో పరిమితి 50 సంవత్సరాలకు పెంచాలి. ప్రమోషన్లో రాజకీయ జోక్యం అరికట్టాలి. 300 జనాబా దాటిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి. వర్కర్లతో సమానంగా వేతనాలు, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలి. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి. గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలి. 2017 నుండి పెండింగ్లో ఉన్న టిఎ బిల్లులు వెంటనే ఇవ్వాలి. సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, భీమా అమలు చేయాలి. సెంటర్లలో మౌలిక వసతులు కల్పించి, సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి. సూపర్‌ వైజర్‌ పోస్టులకు వయోపరిమితి తొలగించాలి.
సమస్యల వలయంలో అంగన్వాడీలు
పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఎన్నో వ్యయ ప్రయాసలు, అవస్థల నడుమ విధులు నిర్వర్తిస్తున్నారు గిరిజన ప్రాంతంలో భౌగోళికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఎగువన కొండలపై చాలా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడి కేంద్రాల వరకు సరుకులు చేరవు. సొంత ఖర్చుతో అంగన్వాడి వర్కర్లే వాటిని బైకులపై మోయుంచుకొని తీసుకొని వెళ్లాల్సిన వస్తోంది. అంగన్వాడి కేంద్రాలకు గుడ్లు కుళ్ళినవి, చిన్నవి సరఫరా చేస్తున్నారు.కరోనా తర్వాత అంగన్వాడీలకు టీఏ, డీఏలు ఇవ్వలేదు. ఏజెన్సీలో అంగన్వాడి వర్కర్లు పని ఒత్తిడిని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.