Nov 18,2022 22:29

చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం వినతి
ప్రజాశక్తి - బుట్టాయగూడెం

            ఏజెన్సీలో అక్రమ లేఅవుట్లలో నిర్మాణాలు చట్ట విరుద్ధమని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలు చేసి గిరిజన చట్టాలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి జె.కిరణ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఇళ్ల స్థలాలు (లేఅవుట్‌) ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎపి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ మండల కేంద్రంలోని కట్రెడ్డి వరలక్ష్మికి చెందిన సర్వే నెంబర్‌ 605లో 73 సెంట్లు, కట్రెడ్డి మురళీకృష్ణకు చెందిన సర్వే నెంబర్‌ 605/1లో 27 సెంట్లు మొత్తం ఒక ఎకరం భూమిని ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేశారన్నారు. ఈ భూమిని జంగారెడ్డిగూడెంలో అధికార పార్టీకి చెందిన ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గిరిజన చట్టాలకు విరుద్ధంగా రూ.32 లక్షలకు కొనుగోలు చేశారని ఆరోపించారు. గిరిజనులను కాపాడాల్సిన మండల ప్రజాప్రతినిధులే ఇళ్ల నిర్మాణానికి మెటీరియల్‌ కాంట్రాక్టు, వాల్యూయేషన్‌, ఇళ్ల స్థలాల కోసం సంప్రదించాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అక్రమంగా లేఅవుట్‌ నిర్మాణాలపై తహశీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే తమకు ఎటువంటి అధికారాలూ లేవని, అన్నీ సచివాలయ సిబ్బందికి ఉన్నాయని తెలిపారని అన్నారు. ఎవరికి వారు తమకు అధికారం లేదని తప్పించుకుంటే సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గిరిజన చట్టాల ఆధారంగా అక్రమంగా లేఅవుట్‌ వేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, ఆయనకు బినామీలుగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇళ్ల నిర్మాణం చేపడితే గిరిజన సంఘంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు కె.భాస్కర్‌, కార్యదర్శి పోలోజు నాగేశ్వరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు తామా ముత్యాలమ్మ పాల్గొన్నారు.