ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: కువైట్ వంటి ఇతర దేశాలకు వెళ్లి డబ్బు సంపాదించాలనే మోజుతో గుడ్డిగా ఏజన్సీలను నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రజలకు సూచించారు. సోమవారం ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఎస్పీ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 'స్పందన' కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిధిలోని ప్రజలు నేరుగా వచ్చి కలిసి వారి సమస్యలు గురించి ఎస్పీకి రాతపూర్వక అర్జీల రూపంలో తెలిపారు. ఈ స్పందన కార్యక్రమంలో ఎక్కువగా కుటుంబ కలహాలు, భర్త, అత్తారింటి వేధివంపులు, భూ వివాదాలు, జాబ్ మోసాలు మరియు ఇతర సమస్యల గురించి 59 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ స్పందన ఫిర్యాదులకు ప్రాముఖ్యతనిచ్చి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రజలు కువైట్ వంటి ఇతరదేశలకు వెళ్లి డబ్బు సంపాదించాలనే మోజుతో గుడ్డిగా ఏజెన్సీలను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఎవరైనా జీవనోపాధి కోసం కువైట్ వంటి అరబ్బు దేశాలకు వలస వెళ్లేటప్పుడు ఏజన్సీల మాయలో పడి మోసపోకుండా సమగ్రంగా విచారించుకొని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రజలను మోసం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ స్పందన కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ పి మహేష్, స్పందన సెల్ ఇన్‌స్పెక్టర్ వి మాలకొండయ్య, సిబ్బంది పాల్గొన్నారు.










