ఐటిడిఎ వద్ద ధర్నాలో ఎంఎల్‌సి షేక్ సాబ్జీ
ప్రజాశక్తి బుట్టాయగూడెం
ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం బాధాకరమని, దీనికోసం తన వంతు కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్ సాబ్జీ అన్నారు. కెఆర్‌పురంలోని ఐటిడిఎ వద్ద ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్, ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బుధవారం ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సాబ్జీ మాట్లాడుతూ 2020 జూన్ 18న టిఎసి తీర్మానం మేరకు ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేయాలని నిర్ణయించినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. దీనికోసం గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాతినిధ్యం చేస్తామన్నారు. ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జలగం రాంబాబు మాట్లాడుతూ పండిట్ పోస్టులను జిల్లా పరిషత్‌లు వర్గోన్నతి చేసి రెండు సంవత్సరాలైనా కావస్తున్నా గిరిజన సంక్షేమ శాఖలో ఇంతవరకు వర్గోన్నతి చేయకపోవడం బాధాకరమన్నారు. దీనికి సంబంధించిన ఫైలు ఎక్కడ పెండింగులో ఉందో అధికారులు గమనించి వెంటనే వర్గోన్నతికి సంబంధించిన ఉత్తర్వులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కెఆర్‌పురం ఐటిడిఎ ఉప విద్యా శాఖ అధికారి పోస్టుకు గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులను నియమించేందుకు సిద్దం చేసిన సీనియార్టీ జాబితాపై ఈ నెల 24వ తేదీలోపు అభ్యంతరాలు స్వీకరించి అర్హుడిని డివైఇఒగా నియమించాలన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలకు మాత్రమే హక్కు ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం కోసం కలిసొచ్చే ఆదివాసీ సంఘాలతో ఐక్య పోరాటం చేస్తామన్నారు. ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఛైర్మన్ మొడియం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆదివాసీలకు ఉన్న హక్కులను కాపాడడానికి ఆదివాసీలంతా సంఘటితం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెల్లం రాంబాబు, ఎటిఎ జిల్లా అధ్యక్షులు సోడియం రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేశ్వరరావు, నేతలు దేవరాజు, పి.రమేష్, కోరం రమేష్, ఉయికే ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.










