Sep 27,2023 21:25

ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకునే స్థలం లేక మురుగు కాల్వ గట్టుపై పడుకున్న రోగుల బంధువులు

ఏహెచ్‌లో 'విశ్రాంతి'కి చోటేది..?
మందుల గోదాంగా విశ్రాంతి భవనం
సేద తీరే దారి లేక రోగి బంధువుల అవస్థలు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
పేరుకు పెద్దాస్పత్రి. తూర్పు మండలాల ప్రజలకు ప్రధాన దిక్కు. సంపూర్ణ కోవిడ్‌ కేర్‌ కేంద్రంగానూ రూపుదిద్దుకుంటోంది. త్వరలో 150 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందనుంది. ఆసుపత్రికి అనుబంధంగా నెఫ్రో ప్లస్‌ ఉచిత డయాలసిస్‌ కేంద్రంగా నడుస్తోంది. అయితే ఇన్ని ఉన్నా ఆసుపత్రిలో ఇన్‌ పేషెంట్లుగా ఉండే రోగులకు అటెండర్లుగా వస్తున్న బంధువులకు తగిన విశ్రాంతి గదులు మాత్రం అందుబాటులోని లేని వైనం. దీంతో సేద తీరేందుకు సరైన వసతి లేక రోగుల బంధువుల అవస్థలు వర్ణణాతీతం. ఐదేళ్ల కిందట ఆసుపత్రి ఆవరణలో ఓ విశ్రాంతి భవనాన్ని నిర్మించినా అది దుర్వినియోగం కావడంతో రోగుల బంధువులకు ఇబ్బందుల తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకోకూడదంటూ ఓ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపేయడంతో ఆసుపత్రి ముందున్న డ్రైయినేజీ కల్వర్టుపై నిద్రిస్తూ మురుగుకాలువలో పడి మృతి చెందిన సంఘటన రెండు రోజుల కిందట చోటు చేసుకుంది. విశ్రాంతి గదులు అందుబాటులో ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని రోగి బంధువులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
మందుల గోదాంగా విశ్రాంతి భవనం
తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, కేవీబీపురం, సత్యవేడు, బుచ్చినాయుడుకండ్రిగ, వరదయ్యపాళెం, పెళ్లకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట తదితర మండలాల గ్రామాల పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలన్న గొప్ప ఆశయంతో ఆనాటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలోని అయ్యలనాడు చెరువులో 1996 జూలై 7వ తేదీన 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాదాపు 3 కోట్లా 87 లక్షల 70 నిధులతో వందపడకల ఆసుపత్రి నిర్మాణం జరిగింది. రెండేళ్ల కిందట ఆసుపత్రి సిల్వర్‌ జూబ్లి వేడకలు సైతం జరుపుకుంది. అయితే ఆసుపత్రికి వస్తున్న రోగుల తాకిడి దృష్ట్యా 100 నుంచి 150 పడలకు పెంచాలని ప్రతిపాదన చేశారు.ఈ క్రమంలోనే ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులు ఇబ్బందులు పడకుండా 2019లో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో సుమారు రూ.50 లక్షల వ్యయంతో రెండు గదులతోటి ఓ విశ్రాంతి భవనాన్ని నిర్మించారు. అయితే భవనాన్ని నిర్మించి నాలుగేళ్లు కూడా కాకముందే దాన్ని మందుల గోదాముగా మార్చేశారు ఆసుపత్రి అధికారులు.
విస్తరణ పనుల్లో జాప్యమే కారణమా..!
వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టాక ప్రస్తుత ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆసుపత్రి దినదినాభివృద్ది చెందుతోంది. ఆసుపత్రికి గ్రేడ్‌-ఏ గుర్తింపు తీసుకు రావడంలోనూ ఆయన కృషి మరువలేనిది. ప్రస్తుతం రూ.12 కోట్ల వ్యయంతో ఆసుపత్రి విస్తరణ పనులు జరుగుతున్నాయి. 2021లో ప్రారంభమైన ఈ పనులు ఇంకనూ సాగుతుండటంతో ఆసుపత్రిలో మందులను నిల్వ చేసుకునే వీలులేక విశ్రాంతి భవనాన్ని మందుల గోదాముగా మార్చారన్న విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్‌కు అధికార పార్టీ మధ్య ఏర్పడ్డ తగాదా కారణంగా విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.
విస్తరణ పనుల వల్లే: డాక్టర్‌ విజయలక్ష్మి, సూపరింటెండెంట్‌
ఆసుపత్రిలో జరుగుతున్న విస్తరణ పనుల వల్ల మందుల నిల్వకు గదుల కొరత ఏర్పడింది. అందుకే గతంలో ఉన్న వైద్యాధికారులు విశ్రాంతి భవనాన్ని మందుల నిల్వకు వినియోగించారు. ప్రస్తుతం పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో త్వరలోనే విశ్రాంతి భవనాన్ని పూర్తి స్థాయిలో రోగుల బంధువుల కోసం అందుబాటులోకి తెస్తాం.
ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకునే స్థలం లేక మురుగు కాల్వ గట్టుపై పడుకున్న రోగుల బంధువులు