Jul 23,2021 16:00

అమరావతి : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఎపిలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జలాశయాలు నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. దీంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ మొత్తం నిల్వ సామర్థ్యం 3.07 టిఎంసిలు కాగా.. ప్రస్తుతం ఇన్‌ ఫ్లో 61,311 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 10 గేట్లను 2 అడుగుల మేర, మరో 60 గేట్లను అడుగు మేర ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఔట్‌ ఫ్లో 59,750 క్యూసెక్కులుగా ఉంది. గేట్లను ఎత్తినందువల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.