Feb 26,2023 20:16

ధ్వజరోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దృశ్యం

ఎగువ అహోబిలంలో వైభవంగా ధ్వజారోహణ
దిగువలో అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ

        ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఆదివారం ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అహౌబిల మఠం 46వ జీయర్‌ రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి ఆధ్వర్యంలో మఠం ప్రతినిధి సంపత్‌, మేనేజర్‌ శ్రీనివాసన్‌ సమక్షంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం ధ్వజస్తంభం వద్ద గరుడాద్రి నృసింహుడు చిత్రపటాన్ని కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ధ్వజపటాన్ని ఎగురవేశారు. ప్రధాన అర్చకులు కీడాంబీ వేణుగోపాలన్‌ స్వామివారి మహిమలను కొనియాడారు. సాయంత్రం ఉత్సవమూర్తులైన జ్వాల నరసింహ స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి భేరి పూజ నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తి జ్వాల నరసింహస్వామిని ప్రత్యేకంగా అలంకరించి సింహ వాహనంపై కొలువుంచి మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.
దిగువ అహోబిలంలో :
దిగువ అహోబిలంలో సాయంత్రం పీఠాధిపతి సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, అర్చక బృందం లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. విశ్వక్సేనున్ని ఆలయం నుండి ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకొచ్చి పుట్టమన్ను పాలికలలో పోసి నవధాన్యాలను అందులో వేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.