Jan 16,2023 22:27

జామాయిల్‌ రైతుల పెదవివిరుపు
కమీషన్‌దారులకు మాత్రం లాభాల పంట
ప్రభుత్వ పర్యవేక్షణా లోపమే కారణం
ప్రజాశక్తి - బుట్టాయగూడెం

               ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో జామాయిల్‌ సాగు అధికం. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలంలో ఈ పంట వేల ఎకరాల్లో జామాయిల్‌ సాగవుతోంది. బుట్టాయగూడెం మండల కేంద్రంలో శివాలయం సమీపంలో వేబ్రిడ్జి కాటా సమీపంలో జామాయిల్‌ స్టాకు పాయింట్లు రెండు ఉన్నాయి. ఈ రెండు పాయింట్లు జంగారెడ్డిగూడెంలోని స్టాక్‌ పాయింట్‌కు అనుసంధానమై ఉన్నాయి. ఈ జామాయిల్‌ స్టాక్‌ పాయింట్ల ద్వారా సంవత్సరానికి మూడు వేల టన్నుల జామాయిల్‌ కర్రలు ఎగుమతి అవుతున్నాయి. ఇవి లారీల ద్వారా గుజరాత్‌, మహారాష్ట్ర, ఒడిశ్శా తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం జామాయిల్‌ టన్ను రూ.5200 ఉండగా రైతులకు మాత్రం రూ.3800 మాత్రమే లభిస్తోంది. ప్రధానంగా ఈ జామాయిల్‌ కర్ర వ్యాపారంలో కమీషన్‌దారులే బాగా లాభపడుతున్నట్లు సమాచారం. జామాయిల్‌ సాగు చేసి కర్ర విక్రయించే వరకూ అష్టకష్టాలు పడి పెట్టుబడులు పెట్టే రైతులకు ప్రతి సంవత్సరం నిరాశే మిగులుతోంది. అయితే కమీషన్‌దారులు మాత్రం ప్రాసెసింగ్‌ పేరిట ధర దిగ్గోసి కొనుగోలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ఎగుమతుల పేరిట తక్కువ ధరకు జామాయిల్‌ కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. జామాయిల్‌ కర్రలను ఆయా రాష్ట్రాల్లో సెంట్రింగ్‌కు వాడతామని, అందుకే వీటి ధర బాగుంటుందని తెలిపారు. ఏమైనా ధర ప్రభుత్వమే నిర్ణయించి రైతు కష్టానికి ప్రతిఫలం దక్కేలా నిర్ణయించాలని అంతా కోరుతున్నారు.