Dec 26,2022 22:27

ఏడాది భారీగా పెరిగిన అగ్నిప్రమాదాలు
అనుమతుల్లేని ఫ్యాక్టరీలపై చర్యలు శూన్యం
ప్రమాదం జరిగితే గానీ స్పందించరా?
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

పచ్చని పశ్చిమగోదావరి గడచిన మూడేళ్ల కాలంలో అగ్నికీలల్లో చిక్కుకున్నట్లయింది.. ఎటు చూసినా పచ్చదనంతో కనిపించే పశ్చిమగోదావరి జిల్లాలో మునుపెన్నడూ లేనివిధమైన భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం జిల్లావాసులను కలవరపాటుకు గురిచేసింది. దీనికితోడు ఎంతోమంది మృత్యువాత పడటం అగ్నిమాపకశాఖలోని డొల్లతనాన్ని కూడా బయటపెట్టింది. కరోనా ఆరంభమైన తర్వాత అడపాడదపా అక్కడక్కడ చిన్నపాటి ప్రమాదాలు జరిగినా ఇటీవల కాలంలో తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం కడియద్ద గ్రామంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలవడం అందరినీ కలవరపాటుకు గురిచేసింది. దాంతో పాటుగా పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు సమీపంలోని ఫుడ్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిగోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో పెట్రోల్‌ బంక్‌ పక్కన గల కాంప్లెక్స్‌లో గోపాలకష్ణ ఆటోమొబైల్‌ షాపులో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. పెట్రోల్‌ బంక్‌ పక్కన ఉండటంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. షాపులోని గల స్పేర్‌ పార్ట్‌లు కాలిపోయాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇలా చూసుకుంటూ పోతే చిన్నాచితక ప్రమాదాలు సంఖ్య అయితే చెప్పనవసరం లేదు. ఏలూరు నగరంలోనే ఓ ఎలక్ట్రిక్‌ బైక్‌ల దుకాణంలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అనేక వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే అగ్నిమాపకశాఖ అధికారులు పర్యవేక్షణా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిబంధనలు పాతర..!
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 120 పైచిలుకు ఫ్యాక్టరీలున్నట్లు అగ్నిమాపకశాఖ అధికారుల వద్ద సమాచారం ఉంది. వీటికితోడు మరికొన్ని అనుమతుల్లేని ఫ్యాక్టరీలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీల్లో ఎక్కువగా తణుకు ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రిసైక్లింగ్‌ చేసే ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. అందులో పనిచేసే కార్మికులకు కనీస భద్రత కూడా ఉండడం లేదు. ఎక్కువశాతం బీహార్‌, ఒడిషా వంటి ప్రాంతాలకు చెందిన కార్మికులను ఈ ఫ్యాక్టరీల్లో కార్మికులుగా పెట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఈ తరహా ఫ్యాక్టరీల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే సుమారు 17 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అలాంటిది జరగలేదు కానీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల్లోనూ సుమారు 80 వరకు మాత్రమే అగ్నిమాపకశాఖ దగ్గర తిరిగి తమ అనుమతులను రెన్యూవల్‌ చేసుకోగా, మిగిలిన ఫ్యాక్టరీలు రెన్యూవల్‌ చేసుకోకుండా నడుస్తున్నట్లు సమాచారం. వీటితో పాటుగా జిల్లాలో చాలావరకూ భవంతులకు, ఆసుపత్రుల్లో అగ్నిమాపక వస్తువులు కూడా ఉండడం లేదు. ఏదో అగ్నిమాపక వారోత్సవాల సమయంలో అధికారులు తూతూ మంత్రంగా అవగాహన కల్పిస్తున్నారే తప్ప వారిపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తీవ్రమైన ప్రమాద సంఘటనలు..
ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని ఫోరస్‌ (పారాసిట్మల్‌ కెమికల్‌ పౌడర్‌ తయారీ) కంపెనీలో అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యూనిట్‌-4లో రియాక్టర్‌ పెలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్యాక్టరీలో సుమారు వెయ్యి మంది కార్మికులు మూడు షిఫ్టులో ఎనిమిది గంటల చొప్పున పనిచేస్తున్నారు. ఆఖరిదైన మూడో షిఫ్టు రాత్రి పది గంటలకు ప్రారంభమైంది. ఈ షిప్టులో మొత్తం 150 మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. మొత్తం నాలుగు బ్లాకుల్లో వీరంతా పనిచేస్తున్న సమయంలో నాలుగో బ్లాకులోని రియాక్టర్‌ ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ సమయంలో అక్కడ మొత్తం 18 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారు పెంటపాడు సమీపంలోని ఫుడ్‌ ప్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫుడ్‌ ఫ్యాట్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ ప్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం కారణంగా ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఆయిల్‌లో మిక్స్‌చేసే కెమికల్‌ సాల్వెంట్‌ అయిల్‌ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా బాయిలర్‌ పేలుడు సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఎగిసిపడిన సమయంలో అక్కడ ఉన్న ఎనిమిది మంది కార్మికుల్లో జగన్నాథపురానికి చెందిన మల్లి అనే వ్యక్తి సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది హుటాహూటిన ఘటనా స్థలానికి వెళ్లి మంటలు అదుపు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం కడియద్దలో గుట్టుచప్పుడు కాకుండా అన్నవరం అనే వ్యక్తి నిర్వహిస్తున్న దీపావళి మందుగుండు తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఇందులో పనిచేసేందుకు చుట్టుపక్కల గ్రామాలైన ఊనగట్ల, జగ్గన్నపేట, కడియద్దకు చెందిన నిరుపేదలు ప్రాణాలు కోల్పోయారు. రాత్రి సమయంలోకూడా బాణసంచా తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో బాణసంచా మందుగుండు సామగ్రి తీవ్రతకు షెడ్డు గోడలు పగిలిపోయి పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ పనిచేస్తున్న కూలీలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. మృతుల శరీర భాగాలు చుట్టుపక్కల ముక్కలుముక్కలుగా పడ్డాయి. సుమారు కిలోమీటరు దూరంలో పడ్డాయంటే పేలుడు ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లుసైతం కంపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. చుట్టుపక్కల ఇళ్ల గోడలు సైతం నెరలు తీశాయి. ఈ ఘటనతో స్థానికులు, చట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం ఉలిక్కిపడ్డారు.