
'అసలు విషయమేంట్రా? ఎందుకిలా మూడీగా ఉన్నావ్? చెప్తావా, లేదా?' తన రూమ్ కొచ్చిన రెండు రోజుల్నుంచి బాధగా, అన్యమనస్కంగా ఏదో ఆలోచిస్తూ, బయటకు కూడా రాకుండా రూములోనే ఒంటరిగా కూర్చున్న స్నేహితుణ్ణి గద్దించాడు రమణ.
ఆశ్రయమివ్వమంటూ వచ్చిన స్నేహితున్ని కాదనలేక, ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఆశ్రయమిచ్చాడు. కాని, రంజిత్ పరిస్థితి చూస్తుంటేనే జరగరానిదేదో జరిగుంటుందని అర్థమవుతూనే ఉంది. రెండు మూడు సార్లడిగినా, అతడి నుంచి సమాధానం కరువైంది. స్నేహితుడలా ముభావంగా ఉండడంతో తట్టుకోలేకపోయాడు రమణ. ఈసారందుకే గట్టిగా అడిగాడు. చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టాడు.
'నన్ను వెలేశార్రా. ఆ అమ్మాయెవరో నాకు తెలీదని చెప్పినా పట్టించుకోలేదు. అంతా కట్టకట్టుకుని చేసిన నిర్వాకమే!' ఒక్కసారిగా బావురమన్నాడు రంజిత్. నొక్కిపెట్టి ఉంచిన స్ప్రింగ్‌ను వదిలేస్తే ఒక్కసారిగా విదిలించుకున్నట్లు, గతాన్నంతా తన మనసులోనే నొక్కిపెట్టి, ఇప్పుడు విదిలించాడు రంజిత్.
'ఓకే, ఓకే, కామ్‌డౌన్! ఏమయ్యిందో చెప్పరా...!' అంటూ అతనికి దగ్గరగా జరిగి ఓదార్చాడు రమణ.
అదో చిన్నరూమ్. ఆ రూమును చూస్తుంటే ఇంట్లో తన గదే గుర్తుకొస్తుంది రంజిత్‌కు. చిన్న చిన్న కబోర్డులలో పేపర్లు వేసి, బట్టలు సర్దుకున్నారు. ఇంకోవైపు దేవుడి పటాలు పెట్టి ఉన్నాయి. పక్కనే చిన్న బల్లమీద ఎలక్ట్రిక్ కుక్కర్ పెట్టుకున్నారు. దానిపక్కనే చాప మీద గోడకానుకొని కూర్చున్నారు. కిటికీ దగ్గరున్న మినరల్ వాటర్ బాటిల్ నుండి గ్లాసులో మంచినీళ్ళు పట్టి తాగమని ఇచ్చాడు రమణ.
'బయట నుంచి అప్పుడే ఇంటికొచ్చిన నన్ను చూస్తూ ప్రణతి ఎవరని తీక్షణంగా నాన్నగారడిగార్రా. వెంటనే నాకొకమ్మాయి గుర్తుకొచ్చింది. ఎప్పుడూ నా వంక చూసి నవ్వుతుండేది. ఆమె పేరు తెలీదు. బహుశా ఆమే అయ్యుంటుందనుకున్నా. ఆమో కాదో తెలీదు కాబట్టి నాకు తెలీదని, ఎవరని అడిగాను.
''ఆకతాయిలా తిరుగుతావని తెలిసినా తప్పు చేయవనే నమ్మకంతో ఇన్నాళ్ళు నిన్నేం అనలేదురా. కాని, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావని ఆ పిల్ల ఫోన్ చేసేసరికి తెలిసింది. నువ్వు చేసిన నిర్వాకమంతా చెప్పింది. ఆ అమ్మాయిని ప్రేమించావని, పెళ్లి చేసుకుంటానని నమ్మించావని చెప్పింది. నువ్విలా చేస్తావని నేనస్సలనుకోలేదు'' అంటూ నాపై సీరియసయ్యారు. ఆ అమ్మాయి ఎందుకలా చెప్పిందో అర్థం కాలేదురా. ఏదైనా ఉంటే నన్నడగాలి కదా!' మంచినీళ్ళు తాగి, గ్లాసును పక్కన పెడుతూ చెప్పాడు రంజిత్.
'నిన్ను చూసి నవ్వుతున్న ఆ అమ్మాయి గురించి చెప్పావా?' గ్లాసు తీసుకుని కిటికీ దగ్గర పెడుతూ అడిగాడు రమణ.
'ఏమని చెప్పన్రా! ఆమో కాదో తెలీకుండా ఎలా చెప్పమంటావ్? ఎవరో కావాలని చేసిందిది. ప్రణతి ఎవరో ఏమిటో నాకస్సలు తెలీదని, ఆమెకు నాకూ ఏ సంబంధమూ లేదని చెప్పా. నేనెంత సర్ది చెబుతున్నా ఇంట్లో ఎవ్వరూ నమ్మలేదు సరికదా, నేనేదో నేరం చేశాననే అన్నార్రా. నిజానిజాలు అడగలేదు. నా మాటెవ్వరూ పట్టించుకోలేదు. నాన్నగారేం అన్నారో తెలుసా..
''నా జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాన్రా, ఎన్నో సమస్యల్ని పరిష్కరించాను. నీ విషయంలో మాత్రం ఎప్పుడూ ఫెయిలవుతూనే ఉన్నాను. నేనెన్నిసార్లు చెప్పినా నువ్వినలేదు. నీ గురించి ఆఫీస్లో అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నా. ఇక్కడే ఉంటే ఇంకేం చేస్తావోనని భయంగా ఉంది. ఎప్పుడూ మాటలు చెప్పడం కాదురా, ఎప్పుడైనా వాటి మీద నిలబడడానికి ప్రయత్నించు. నేనింక భరించలేనురా! తక్షణమే ఇక్కణ్ణుంచి వెళ్ళిపో. నా నిర్ణయాన్నెవరైనా ఎదిరిస్తే వాళ్ళకీ ఇదే గతి!'' అంటూ సీరియస్‌గా తన గదిలోకి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయిని నేనేదో చేశానంటుంటే చాలా బాధేసిందిరా. గుండెను పిండేసింది.
''సరే, ఇప్పుడు మీరు చెప్పిన అబద్ధమే నిజమనుకుందాం! నేను ఉద్యోగం చేస్తే నా మీద పడిన మచ్చ చెరిగిపోతుందా? అసలు తప్పొప్పులు ఆరా తీయరా?'' అని గట్టిగా అరిచినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ముద్దాయిని తన గురించి చెప్పుకోవడానికి జడ్జిగారు అవకాశం ఇచ్చినట్లైనా, ఏం జరిగిందని నన్నడగలేదు. ఏడుపొచ్చేసిందనుకో! కన్నీళ్ళ బాధదేముందిలే, తోడున్నామంటూ గుర్తుచేస్తాయి. కానీ తోడుండి నడిపించలేవు కదానిపించింది ఆ క్షణంలో!
అమ్మ, అక్కలు కూడా నా మాట నమ్మలేదు. ''ఇంకెవరి ఆడవారి జీవితాల్తో ఆడుకోవద్దు!'' అని ముక్తసరిగా అన్నారు.
చచ్చిన పామును ఇంకా చంపడమంటే ఇదేనేమో! ఎప్పుడూ నన్ను అనుమానించని వాళ్ళు కూడా అనుమానిస్తున్నారని గుర్తుకొస్తుంటే లోపల్నుంచి బాధ లావాలా తన్నుకొస్తుందిరా. లైఫ్‌లో సెటిలవ్వడమంటే చదువవ్వగానే ఏదో ఒక ఉద్యోగం చేయడమేనా? నా భవిష్యత్‌ను నాకు నచ్చినట్లు నేను డిజైన్ చేసుకోకూడదా! నాకంటూ కొన్ని కలలూ, ఆశలూ, కోరికలు ఉండవా?'' తన మనసులో గూడుకట్టుకున్న బాధావేశాలను బయటపెట్టాడు రంజిత్.
'నిజమా? అంత జరిగిందా? మీ అమ్మ నీకే సపోర్ట్ చేస్తుందే! ఇంతకీ ఏమన్నారు?' ఆశ్చర్యపోతూ అడిగాడు రమణ.
'నాన్నగారి గురించి నీకు తెలిసిందే కదరా! ఆయనంత సీరియస్‌గా చెప్తే వినాల్సిందే! ఆ అమ్మాయిని అడిగితే నా మెడకే చుట్టుకోవచ్చు. ఈ రోజుల్లో మామూలుగా మాట్లాడినా పెడర్థాలు తీస్తున్నారు. నా దారులన్నీ మూసుకుపోవడంతో ఏం చేయాలో తోచక ఇలా లగేజి సర్దుకొని, నీ దగ్గరికి వచ్చేశానురా! నేను జాబ్ లేకుండా తిరుగుతున్నానే కదా ఇలా ఈజీగా అభాండాలు వేశారు! అదే పెద్ద జాబ్ చేస్తుంటే ఎంతమంది ఫోన్ చేసి, చెడుగా చెప్పినా పట్టించుకునేవారు కాదు కదా! ఈరోజుల్లో ఉద్యోగం చేస్తేనే మనిషిగా గౌరవమిస్తారనని తెలిసొచ్చిందిరా. అసలు నేనెంటో చేసి చూపిస్తా!' అంటూ బాధా బరువును దించుకున్నాడు రంజిత్.
సాలోచనగా మిత్రుడివైపే చూస్తూ ఉండిపోయాడు రమణ.
'ఇప్పుడు చెప్పరా! నాదే తప్పా?' సూటిగా రమణ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు రంజిత్, కళ్ళను తుడుచుకుంటూ.
'జాబ్ చేయకుండా, ఫ్రెండ్స్‌తో జాలీగా తిరుగుతుంటే ఏ తండ్రికైనా బాధగానే ఉంటుందిరా. కొడుకు సెటిలవ్వాలనే కోరుకుంటాడు. గవర్నమెంట్ జాబ్ తప్ప, ప్రైవేటు జాబ్ చేయనని మొండికేసి కూర్చున్నావ్! సరే దానికైనా ప్రిపేర్ అవుతున్నావా? లేదే! మరి మీ నాన్నకు కోపం రాక ఏమొస్తుంది చెప్పు! ఇక ప్రణతి సంగతికొస్తే, అసలా అమ్మాయెవరో తెలీదంటున్నావ్, లవ్ చేయలేదంటున్నావ్ కాబట్టి అబద్ధమే అనుకుందాం. మన వెంకట్ గాడికి చెప్పి ఆ అమ్మాయితో ఒకసారి మాట్లాడమని చెప్దాం. విషయమేంటో తెలుసుకుందాం. నువ్వేం కంగారుపడకురా' మొత్తం విన్నాక అనునయంగా చెప్పాడు రమణ.
'నాకే ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదురా!' నిట్టూర్చాడు రంజిత్.
'ఒరేరు! ఒక సమస్య సృష్టించబడినప్పుడు, ఆ సమస్యకు కాలమే సమాధానం చెప్పాలిరా! రకరకాల ఋతువులొచ్చి వెళ్తున్నట్లే రకరకాల మనుషులు, రకరకాల సమస్యలను దాటుకుంటూ వెళ్లిపోతుంటారు. సాధించలేని వాళ్ళు మాత్రం ''నాకే ఎందుకిలా జరిగిందని'' బాధపడుతుంటారు. ఒకటి గుర్తు పెట్టుకో, కొన్నాళ్ళు నువ్వు ఊరికి దూరంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయని అలా మాట్లాడుండొచ్చు. బాధపడకు! మొన్న వెంకట్ నుంచి మిస్డ్‌కాల్స్ ఉన్నాయి. ఆఫీస్ హడావుడిలో మాట్లాడడమే మర్చిపోయా. ఏంటో కనుక్కుని నేను మాట్లాడతాలే' అంటూ ధైర్యం చెప్పి, పైకి లేచాడు రమణ.
'ఇన్ని సంవత్సరాలు పెంచిన కొడుకుపై నమ్మకం లేకుండా ఎవరో చెప్పిన ఒక అబద్ధాన్ని పట్టుకొని నాన్నగారలా తొందరపడడం...' విషయాన్ని తేలిగ్గా వదల్లేకపోయాడు రంజిత్, చేతిలోనున్న టవల్ తీసి దండెంపై వేస్తూ.
'ఇంకా సాగదీయక ఆ సంగతి వదిలేరు రా! నువ్వు సెటిలయ్యితే చూడాలనుకుంటున్నారు. దానిమీదే దృష్టి పెట్టు! ఏ అఘాయిత్యం చేసుకోకుండా సరాసరి నాదగ్గరికొచ్చి మంచిపనే చేశావ్. ప్రైవేటు జాబ్స్ చేయడం నీకిష్టం లేదు కాబట్టి రేపు ఐ.బి.పి.ఎస్.కు అప్లై చేద్దువుగాని. రూరల్ బ్యాంకులకు కూడా నోటిఫికేషన్ రాబోతుందంట. నీకున్న టాలెంటుకివి పెద్ద కష్టం కాదులే. జాయినింగ్ లెటర్ తీసుకొని ఇంటికెళ్తే రావొద్దని చెప్పరుగా!' అంటూ తదుపరి కార్యాచరణను చెప్పి, గతం నుంచి భవిష్యత్ వైపు రంజిత్ ఆలోచనను మరల్చాడు రమణ. అతను చెప్పినదాంట్లో కూడా నిజముందని గ్రహించాడు రంజిత్.
'సరేరా, ఒకసారి వెంకట్‌తో మాట్లాడు. నేనిక్కడికి వచ్చానని, ఇంట్లో ఇలా జరిగిందని చెప్పొద్దు. త్వరగా జాబ్ కొట్టి ఇంటికి గర్వంగా వెళ్తా' సాధించాలన్న బలమైన నమ్మకంతో అన్నాడు రంజిత్.
'అదిరా! అలా పట్టుదలగా ఉండాలి. కృషితో నాస్తి దుర్భిక్షమని అందుకే అన్నారు!' స్నేహితుణ్ణి ప్రోత్సహించాడు రమణ.
ఆఫీసుకెళ్ళాలని హడావుడిగా రెడీ అవుతున్నాడు రమణ. విషయాన్నెలా అడగాలో సంకోచిస్తున్నాడు రంజిత్.
సమయం అయిపోయిందని బ్యాగ్ అందుకున్నాడు రమణ. 'ఒరేరు రంజిత్! డబ్బులు కావాలంటే అక్కడ దేవుడి పటాల కింద ఉంటారు. తీసుకో సరేనాఊ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి జాబ్ కొట్టడం మీద దృష్టి పెట్టు. పరీక్షకు తయారవు. సాయంత్రం మెటీరీయల్ తీసుకువస్తాను. సరేనా!' రంజిత్ మనసు అర్థం చేసుకున్నవాడిలా మాటిచ్చాడు రమణ.
కాలేజీ రోజుల్లో అడక్కుండానే రమణకు రంజిత్ సాయం చేసిన సందర్భాలెన్నో. ఆ ఋణమెలా తీర్చుకోవాలోనని ఆలోచిస్తున్న రమణ, వచ్చినవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు. అతని ముందుచూపుకు మనస్సులోనే కృతజ్ఞతలు తెలిపాడు రంజిత్. ఆఫీసుకెళ్ళాక వెంకట్‌తో మాట్లాడాడు రమణ. జరిగినది తెలుసుకుని విస్తుపోయాడు. రంజిత్‌తో ఆ విషయాలేవీ మాట్లాడదలచుకోలేదు అతను. రమణకు చేయూత అందింది.
***
ఈ ఆరు నెలల కాలమెలా గడిచిందోనని ఆలోచించడం కన్నా, జాయినింగ్ లెటర్ తీసుకుని ఇంటికెళ్తున్న విషయానికే రంజిత్ మనసెక్కువ ప్రాధాన్యతనిస్తోంది. విజయం సాధించిన తన తల తనకు తెలియకుండానే ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ పైకి లేస్తోంది. భుజాలు నిటారుగా పెట్టి హుందాగా నడవటంలో, చక్కని ధీమా, మానసిక బలం తెలుస్తున్నాయి. విషయం తెలుసుకున్న నాన్నెలా భుజం తడతాడో, అమ్మ కంట్లో ఆనందభాష్పాలెలా వస్తాయో, ప్రయోజకుడైనందుకు అక్కాబావలెలా ప్రశంసిస్తారోనని ఊహించుకుంటున్నాడు. ఇన్నిరోజులూ ఎవ్వరూ ఎప్పుడూ చూడడానికి రాలేదు. ఫోన్ చేసినా మాట్లాడలేదు. వాళ్ళూ ఫోన్ చేయలేదు. తన బాగోగుల గురించి పట్టించుకోని వారిప్పుడు తనని తానుగా స్వీకరిస్తారో లేదోనని ప్రశ్నించుకుంటున్నాడు. సమాధానం చెప్పుకుంటున్నాడు. తన అంతరాత్మతో సంభాషించుకుంటున్నాడు. సాధారణ వ్యక్తిప్పుడు పరిపూర్ణ వ్యక్తిలా ఆలోచిస్తున్నాడు.
మనల్ని మనమే ప్రశ్నించుకుని, మనల్ని మనమే సరిదిద్దుకోవడమంటే ఇదేనేమో! ఎంతమందెన్ని చెప్పినా వినిపించుకోలేదు. ఒకవేళ వినుంటే వాళ్ల ప్రేమకు దూరమయ్యేవాడినే కాదు. వాళ్ళ దగ్గరున్నప్పుడు తెలుసుకోలేకపోయాను. ఏ బంధం గొప్పతనమైనా దూరమైతేనే తెలుస్తుంది. రమణ చెప్పినట్లు సూక్తులు, సుప్రభాతాలు ఎవ్వరికీ పనికి రావు. వినరు కూడా. అవి పుస్తకాల్లోనే ఉంటాయి. మన మనస్సుల్లో కాదు. మనిషిని అవసరాలు, దాని ద్వారా వచ్చే అనుభవాలే గుణపాఠాన్ని నేర్పిస్తాయి. మనలోనున్న ఆత్మాభిమానాన్ని గుర్తు చేసి తడిమి చూసుకునేట్లు చేస్తాయి.. ఆలోచిస్తున్న రంజిత్ బస్సు హారనుతో ఈ లోకంలోకొచ్చాడు. కళ్ళు తెరచి చూస్తే తన ఊరు! తను పుట్టి పెరిగిన ఊరు!
దూరమైంది కొన్ని నెలలే అయినా ఎంతో మార్పొచ్చినట్లనిపిస్తోంది. కొత్త బంగారు లోకంలా తోస్తూ ఒక వింతైన అనుభవానికి గురిచేస్తోంది. పల్లె స్పర్శకు దూరమయ్యి, ఇప్పుడు దగ్గరయ్యేసరికి పరవశం పొంగింది. లోపలున్న అలజడులన్నీ కమ్ముకొచ్చి పాదాల్లోనే నిలయమయ్యాయి. అడుగులు వణుకుతూ పడుతున్నాయి. ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, అనుమానాన్ని, అర్థవంతమైన జీవితాన్ని కళ్ళ నిండా నింపుకుని, ఇంటిముందు కాసేపాగి లోపలికెళ్ళాడు రంజిత్.
'అమ్మా! తమ్ముడొచ్చేశాడే! హారతి పట్టుకొని త్వరగా రా!' అంటూ సంబరంగా తల్లిని పిలిచింది సరళ, కళ్ళల్లో దీపావళి నిండగా...
'ఏరా తమ్ముడూ! ఎలా ఉన్నావ్? ఏంటిరా అలాగే చూస్తుండిపోయావ్! నీలో చాలా మార్పొచ్చినట్లుందే! లోపలికొచ్చి హారతి తీసుకో' గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతోంది. అక్క వంక చూస్తూ చిరునవ్వు నవ్వాడు రంజిత్.
తనొస్తున్న సంగతి వీళ్ళకెలా తెలుసోననుకుంటూ అక్కడేం జరుగుతుందో అర్థంకాక ఓ క్షణం ఆగిపోయాడు రంజిత్. ఎదురుగా హారతి పళ్ళెంతో తల్లి లీలావతి, ఆమె పక్కనే తండ్రి రామేశ్వరరావు ఉన్నారు.
'ఇదేమిటి? నేను వీళ్ళకు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే వీళ్ళే నాకు సర్ప్రైజ్ ఇస్తున్నారేంటి? అసలేంటి ఈ అయోమయం?' అంటూ తెగ ఆలోచించసాగాడు రంజిత్. కానీ తొందరపడలేదు.
'రారా! ఏంటలా చూస్తున్నావ్! మేమేం చేసినా నీ మంచికేరా! నువ్వు దూరంగా ఉన్నా మా కళ్లెప్పుడూ నీ మీదనే ఉంటాయి. నువ్వెలా ఉన్నావో, ఏం చేస్తున్నావో, ఎలా కష్టపడుతున్నావో మాకంతా తెలుసు. నీలో మేం కోరుకునేది ఆ తపనే! కన్నపేగు కనిపించకుండా రక్షణనిస్తూనే ఉంటుంది. రా! వచ్చి హారతి తీసుకో!' సాదరంగా ఆహ్వానించాడు తండ్రి.
కొడుక్కి హారతి ఇచ్చింది తల్లి. హారతి తీసుకుని లోపలికెళ్ళాడు రంజిత్. చాలా రోజులు తర్వాత తనకే సొంతమైన తన గదిని చూస్తూ, ఎంతో ఆనందపడిపోయి లగేజి మొత్తం అక్కడ పెట్టాడు. ఒకప్పటిలా అతనిలో హడావుడితనం లేదు. ఎంతో హుందాగా మారిపోయాడు.
'అమ్మా! నా మీద కోపం తగ్గిందా?' కాఫీ ఇచ్చిన తల్లి చేయిని పట్టుకుని, ఆర్ద్రంగా అడిగాడు రంజిత్.
'అలాంటిదేం లేదురా. నువ్వంటే మాకెప్పుడూ ప్రేమే! నీ భవిష్యత్ గురించే మా బెంగంతా! ఇప్పుడా సమస్య కూడా లేకుండా చేశావ్' కన్నీళ్ళతో చెప్పింది లీలావతి.
'నేనేదో తప్పు చేశానని చాలా కోప్పడి నన్ను దూరం చేశారు కదమ్మా' అన్నాడు కాఫీ తాగుతూ, విషయం గుర్తు చేస్తూ.
'ఓ అదా! తప్పలేదురా! నువ్వు బాగుపడాలనే!' అంటూ చిరునవ్వుతో కాఫీ కప్పుని తీసుకుని తండ్రి దగ్గరికి పంపించింది. వెళ్లి మౌనంగా నుంచున్నాడు రంజిత్. తండ్రినేం అడగలేదు. అడిగే ఉద్దేశ్యం కూడా అతనికి లేదు.
'ఇంట్లోంచి పంపించేశానని నా మీద కోపంగా ఉందని నాకు తెలుసు. నీ భవిష్యత్ బాగుండాలనే మా కోరిక. నువ్వేం పట్టించుకోకుండా తిరుగుతుంటే ఏం చేయాలో తెలియలేదు. ఇనుమును వంచాలంటే కాల్చి తీరాలి. అందుకే తప్పనిసరై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది' కొడుకు మొహాన్ని మునిపటిలా ధైర్యంగా చూసే సాహసం చేయకుండా, తన మనసులో మాట చెప్పాడు రామేశ్వరరావు.
'నేను మీ రక్తాన్ని నాన్నగారూ, మీరు నాకు సంజాయిషీ ఇవ్వనక్కరలేదు' వదలగానే ధనుస్సు నుండి బాణం వచ్చినంత వేగంగా, సూటిగా రంజిత్ నోటి వెంట మాటొచ్చింది. అది ఆర్ద్రతతో కూడుకున్నదని రామేశ్వరరావుకు అర్థమైంది.
'గూడు దాటి బయటకి వెళ్ళనంతవరకు పక్షి పిల్లకి లోకం పోకడ తెలీదు. తన ఆహారాన్ని తాను సంపాదించుకోవడానికి ఎగరాల్సిందే! జీవన పోరాటంలో నిలిచి గెలిచేవాడినే ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుందిరా. అర్థం చేసుకున్నావ్, ఆచరించి నిలబడ్డావు. ఇక నీ ప్రగతినెవ్వరూ ఆపలేరు. గ్లాడ్ బ్లెస్ యూ నాన్నా...!' అంటూ రంజిత్ తల నిమిరి, సరాసరి బయటకు దారితీశాడు రామేశ్వరరావు.
తన భవిష్యత్ గురించి వాళ్ళు పడిన నరకం తండ్రి మాటల్లో, దాన్ని నెరవేర్చడానికి పడిన మనోవేదన ఆయన ముఖంలో స్పష్టంగా గోచరించగా ''అయామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్!'' అనుకున్నాడు గర్వంగా రంజిత్. అప్పుడే ఆనందభాష్పమనే కన్నీటిపొర పురుడు పోసుకుంది అతనిలో.
దొండపాటి కృష్ణ
90523 26864