Aug 13,2023 19:35

ప్రజాశక్తి - పాలకొల్లు
          పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్‌ బి ప్లస్‌ గ్రేడ్‌ లభించింది. 2017లో నాక్‌ బి గ్రేడ్‌ ఉండగా ఇప్పుడు అత్యుత్తమ పనితీరు, మెరుగైన వసతుల కల్పన విద్యాబోధనలతో బి ప్లస్‌ గ్రేడ్‌ సొంతమైంది. 55 సంవత్సరాల చరిత్ర కలిగి జిల్లాలోని ఏకైక ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన కళాశాలగా గుర్తింపు పొంది నాక్‌ బి ప్లస్‌ గ్రేడ్‌ గుర్తింపు రావడంపై కళాశాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టాత్మక కళాశాలలో మారుతున్న కాలానుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వసతులు కల్పించారు. వర్చువల్‌ క్లాస్‌ రూమ్‌లతో, సీసీ కెమెరాలు అత్యాధునిక ల్యాబ్స్‌, లైబ్రరీలను ఏర్పాటు చేశారు. కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో ఇటీవల జరిగిన నాక్‌ పర్యటనలో బి ప్లస్‌ గ్రేడ్‌ లభించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టి.రాజరాజేశ్వరి మాట్లాడుతూ నాక్‌ బి ప్లస్‌ గ్రేడ్‌ సాధించడానికి సహాయపడిన అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం అందరికి ధన్యవాదాలు తెలిపారు.