Mar 15,2023 23:41

సోషల్‌ వెల్ఫేర్‌ అధికారులతో మాట్లాడుతున్న కోర్టు అధికారులు

ప్రజాశక్తి- అనకాపల్లి
వసతి గృహం నిర్వహించిన భవనానికి నష్టపరిహారం, అద్దె చెల్లించకపోవడంతో అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ కార్యాలయాన్ని జప్తు చేయాలని అనకాపల్లి జిల్లా కోర్టు బుధవారం ఆదేశంచింది. దీంతో కోర్టు అధికారులు జప్తు చేసేందుకు వెళ్లారు. హైకోర్టులో స్టే ఆర్డర్‌ కోసం దరఖాస్తు చేశామని, జప్తును నిలుపుదల చేయాలని సోషల్‌ వెల్ఫేర్‌ అధికారులు కోరడంతో కోర్టు అధికారులు వెనుదిరుగారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
మండలంలోని మార్టూరు గ్రామంలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఎస్సీ బార్సు హాస్టల్‌ నిర్వహణకు ఆ గ్రామానికి చెందిన పప్పు సత్యనారాయణ ఇంటిని 1994లో అద్దెకు తీసుకున్నారు. కొంతకాలం తరువాత స్పెషల్‌ హాస్టల్‌ కోసం అదనపు గదులు కావాలని అధికారులు కోరడంతో ఇంటి యజమాని నిర్మించి ఇచ్చారు. 2005లో అకస్మాత్తుగా భవన యజమానికి తెలియకుండా హాస్టల్‌ను ఖాళీ చేసి వేరే భవనంలోకి మారారు. అప్పటికే పాత భవనంలోని ఫర్నిచర్‌, విద్యుత్తు వైరింగ్‌, ప్రహరీ, మోటారు ధ్వంసం కావడంతో నష్ట పరిహారం ఇవ్వాలని భవన యజమాని హాస్టల్‌ అధికారులను కోరారు. వారు పట్టించుకోకపోవడంతో 2006లో భవన యజమాని జిల్లా కలెక్టర్‌, సోషల్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, వసతిగృహం వార్డెన్‌పై కోర్టులో కేసు వేశారు. దీనిపై కింద కోర్టు 2018లో తీర్పు ఇస్తూ రూ.4.20 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాన్ని సైతం సోషల్‌ వెల్ఫేర్‌ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో భవన యజమాని జిల్లా కోర్టును ఆశ్రయించారు. అసలు, వడ్డీతో కలిపి సుమారు రూ.9.40 లక్షలు చెల్లించకపోవడంతో కోర్టు ఉల్లంఘన కింద పట్టణంలోని విజయరామరాజుపేటలో ఉన్న అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి కార్యాలయాన్ని జప్తు చేయాలని ఈ నెల 15న బుధవారం జిల్లా కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టు అధికారులు జప్తు చేసేందుకు వెళ్లారు. దీనిపై స్టే కోసం హైకోర్టులో దరఖాస్తు చేస్తున్నందున జప్తు ఆపాలని కోరడంతో కోర్టు సిబ్బంది ఈ విషయాన్ని నివేదిక ద్వారా కోర్టుకు తెలియజేస్తామని చెప్పి వెనుతిరిగారు.