
ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నూతన పాలక మండలి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ హోదాలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్ హోలో గుంటూరు ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ కళాశాల డాక్టర్ విఆర్ జోత్స్నకుమారి, వర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ కేటగిరిలో ప్రొఫెసర్ ఎం.జగదీష్ నాయక్, ప్రొఫెసర్ కె. సుమంత్ కుమార్, అనుబంధ కళాశాల అధ్యాపకుల హోదాలో మరోసారి గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలు డాక్టర్ సాహెద అక్తర్‌ను పాలక మండలి సభ్యులుగా నియమించారు. వీరితోపాటు పారిశ్రామికవేత్త సిహెచ్ ఏపీ రామేశ్వరరావు, సామాజిక కార్యకర్త ఇండ్ల రాధా, వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు విన్నకోట వెంకటేశ్వర్లు, గుంటూరు ప్రోవిన్సీ హెల్త్ అండ్ సోషల్ మిషన్ కో-ఆర్డినేటర్ క్లేతస్ డైసీలను పాలకమండలి సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రిన్సిపాల్ సెక్రటరీ జై శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా మూడేళ్లపాటు పాలక మండలి సభ్యులుగా కొనసాగనున్నారు.