Jul 27,2021 09:12

అమరావతి : ప్రపంచవ్యాప్తంగా 99 దేశాల్లో 11.33 లక్షల మంది భారతీయులు చదువుకుంటున్నారు. అయితే ఎక్కువగా విదేశీ చదువులకు భారతీయ విద్యార్థులు ఎక్కడికి వెళతారు అంటే.. వెంటనే ఎవరైనా అమెరికా అని చెప్పేస్తారు. గతంలో అగ్రరాజ్యమే ఆ స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని కెనడా ఆక్రమించింది. భారత విద్యార్థుల ఆలోచన మారిందా ? అంటే అవుననే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకూ అమెరికాలో భారతీయ విద్యార్థులు 2,11,930 మంది ఉంటే.. కెనడాలో మాత్రం ఆ సంఖ్య 2,15,720 గా ఉన్నట్లు తెలిపారు.

ఇవే కారణం..
అమెరికా దేశానికి 2017 లో అధ్యక్షుడిగా ట్రంప్‌ రావడంతోనే భారతీయ విద్యార్థుల అభిప్రాయంలో మార్పు వచ్చింది. భారతదేశ విద్యార్థులపై అమెరికా పోలీసుల నిఘా, వీసాల జారీ కఠినతరం చేయడం, హెచ్‌ 1 బి వీసాలు లాంటి వాటిల్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టే ఆలోచనలు చేయడం, తదితర కారణాలతో విద్యార్థులు కెనడా, యుకె, ఆస్ట్రేలియా, తదితర దేశాల వైపు మొగ్గుచూపారని విశ్లేషకులు చెబుతున్నారు.

కెనడా వైపు మొగ్గు..
వాస్తవానికి అమెరికాలో చైనా తర్వాత అత్యధిక మంది విదేశీ విద్యార్థులు భారతీయులే. అమెరికాలో ఆంక్షలు బిగుసుకుంటున్న వేళ.. పలు దేశాలు విదేశీ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా ఆ దేశాలు భారత్‌పై దఅష్టి పెట్టాయి. కెనడా అయితే వీసాల జారీని సులభతరం చేసింది. ఒక్క ఏడాది కోర్సుకు కూడా రెండేళ్ల వర్క్‌ పర్మిట్‌ ఇస్తోంది. రెండేళ్ల పీజీ కోర్సుకు మూడేళ్లపాటు వర్క్‌ పర్మిట్‌ జారీ చేస్తున్నారు. ఆ దేశంలో శాశ్వత స్థిర నివాసం (పర్మినెంట్‌ రెసిడెంట్‌) కోసం దరఖాస్తు చేసుకున్న రెండు, మూడేళ్లలోనే వస్తోంది. ఆ అనుభవంతో సిటిజన్‌షిప్‌ (ఆ దేశ పౌరసత్వం) కోసం దరఖాస్తు చేసుకుంటే అయిదేళ్లలో ఇస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం తొలి నాలుగు నెలల్లో లక్ష వీసాలిచ్చామని ఢిల్లీలోని కెనడా హైకమిషన్‌ తెలిపింది. కెనడా కల్పించిన సులభతర సౌకర్యాలకు భారత విద్యార్థులు కెనడావైపే మొగ్గు చూపిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున ఆసక్తి..
బ్రిటన్‌ తరహాలోనే కెనడాలోనూ ఒక్క ఏడాదిలో మాస్టర్‌ విద్య పూర్తిచేసి రెండేళ్లపాటు కొలువు చేసుకోవచ్చు. అంతేకాకుండా అమెరికా కంటే 30 శాతం వరకు ఫీజులు, ఖర్చులు తక్కువగా ఉంటాయి. గుజరాత్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల నుంచి చాలా మంది డిప్లొమా కోర్సులు చేయడానికి కూడా వెళ్తున్నారు. టూరిజం, మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ఎక్కువగా చేరుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా గత మూడు నాలుగేళ్ల నుంచి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఈ సారి వీసాలు ఇస్తున్నా.. ట్రావెల్‌ నిషేధం మరికొద్ది రోజులపాటు ఉండనుంది. త్వరలోనే దాన్ని తొలగించే అవకాశం ఉంది.
                                     - వేములపాటి అజరుకుమార్‌, సంచాలకుడు, ఐఎంఎఫ్‌ఎస్‌ కన్సల్టెన్సీ
 

భారత విద్యార్థులు ఎక్కువగా వెళుతున్న దేశాలు.. సంఖ్య..

కెనడా                    2,15,720
అమెరికా                 2,11,930
ఆస్ట్రేలియా                   92,383
యుకె                        55,465
న్యూజిలాండ్‌               30,000
చైనా                         23,000

ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థులు...

సంవత్సరం                      సంఖ్య
2017                          5,53,400
2018                          7,52,725
2021 వరకు                11,33,749

కెనడాలో భారతీయ విద్యార్థులు

సంవత్సరం                     సంఖ్య
2017                        82,990
2018                     1,07,175
2019                     1,39,740
2021 వరకు            2,15,720