Jun 09,2021 07:01

   కుల రిజర్వేషన్‌ ద్వారా ఉద్యోగం పొంది, ఆ తరువాత మతం మార్చుకుంటే ఆ ఉద్యోగం నుంచి తొలగించాలని మద్రాసు హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు సామాజిక న్యాయానికి, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేదిగా ఉంది. భవిష్యత్తులో దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. భారతీయార్‌ యూనివర్సిటీలో అక్రమ నియామకాలకు సంబంధించిన కేసును విచారించిన జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ నేతృత్వంలోని ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన ఈ వివాదాస్పద తీర్పు హిందూత్వ శక్తులకు మరింత ఊతమిచ్చేలా ఉంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్‌కు సంబంధించిన ఒక కేసు ఇప్పటికే సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. సున్నితమైన ఇటువంటి అంశంపై సుప్రీం తీర్పు వచ్చేవరకు వేచి చూడకుండా మద్రాసు హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ తొందరపడి చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత మాత్రం సమర్థనీయం కావు.
    భారతీయార్‌ వర్సిటీ అక్రమ నియామకాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం వరకే తీర్పు పరిమితమైతే ఎవరికీ అభ్యంతరం లేదు. ఒక కులం ఆధారంగా రిజర్వేషన్ల కోటా కింద ఉద్యోగం పొందిన వ్యక్తి, తరువాత మత మార్పిడి చేసుకుంటే ఆ ఉద్యోగంలో కొనసాగే హక్కు కోల్పోతారన్న న్యాయమూర్తి వ్యాఖ్యలు సరికొత్త వివాదాన్ని రేపాయి. న్యాయమూర్తి తన తీర్పుకు ఆధారంగా 1950 ఆగస్టులో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా వెలువడిన రాజ్యాంగ ఆర్డరులోని మూడవ పేరాగ్రాఫ్‌ను ఉటంకించారు. ఆ పేరాగ్రాఫ్‌లో హిందూ మతంలో దళితులకు మాత్రమే ఎస్సీ కోటా వర్తిస్తుందని పేర్కొన్నారు. దీనిపై గత డెబ్బయ్యేళ్లుగా వివాదం రగులుతూనే ఉంది. 1956లో సిక్కుల్లో దళితులకు, 1990లో బౌద్ధులలో దళితులకు ఎస్సీ కోటా వర్తింపజేస్తూ రాజ్యాంగ ఆర్డర్‌లో మార్పులు తెచ్చారు. సిక్కులు, బౌద్ధులకు వర్తింపజేసినప్పుడు క్రిస్టియన్‌, ముస్లింలలో దళితులకు ఎందుకు వర్తింపజేయరనే ప్రశ్న సహజంగానే ముందుకొచ్చింది. క్రైస్తవం, ఇస్లాం ఈ దేశంలో పుట్టినవి కావు గనుక వీటికి వర్తింపజేయలేమని ప్రభుత్వం చెబుతోంది. ఈ రెండు మతాల మూలాలు ఈ దేశంలో చాలా కాలం నుంచి బలంగా ఉన్నాయని, కాబట్టి వీటిని ఎలా తిరస్కరిస్తారని దేశ్‌పాండే వంటి సామాజిక వేత్తలు, ప్రగతి శీలవాదులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది జనవరిలో ఇందుకు సంబంధించిన ఒక పిటిషన్‌ సుప్రీం కోర్టు ముందుకు రాగా, పరిశీలనార్హమైన అంశమేనంటూ సర్వోన్నత న్యాయస్థానం దీనిని విచారణకు స్వీకరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ వివరణను కోరింది. అయినా కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు.
   దళితులు, గిరిజనులు ఏ మతంలో ఉన్నా వారి సామాజిక, ఆర్థిక వెనుకబాటు తనంలో పెద్దగా మార్పేమీ లేదని పలు అధ్యయన సంస్థలు పేర్కొన్నాయి. సచార్‌ కమిటీ, జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా కమిటీలు క్రైస్తవం, ఇస్లాంలోని దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తింపజేయాల్సిన ఆవశ్యకత గురించి గట్టిగా నొక్కి చెప్పాయి. పట్టణ ప్రాంతాల్లో 47 శాతం మంది ముస్లిం దళితులు, 32 శాతం మంది దళిత క్రిస్టియన్లు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని, అన్ని రకాల దోపిడీకి, సామాజిక వివక్షకు గురవుతున్నారని జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ పేర్కొంది. తమిళనాడులో దళిత క్రిస్టియన్ల పరిస్థితి ఆది ద్రావిడుల పరిస్థితి కన్నా భిన్నంగా ఏమీ లేదని ఇదే మద్రాసు హైకోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పులో పేర్కొంది. రాష్ట్రపతి ఉత్తర్వును ఇప్పటికే రెండు సార్లు సవరించారు. దళిత క్రిస్టియన్లు, దళిత ముస్లింల కోసం మరోసారి రాజ్యాంగ ఆర్డర్‌ను ఎందుకు సవరించకూడదు? కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే ఈ సమస్యను చిటికెలో పరిష్కరించవచ్చు. కేంద్ర ప్రభుత్వ మనువాద దృక్పథం గతేడాది ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో స్పష్టంగానే కనపడుతుంది. హిందువులతో సహా అత్యధిక దళిత, బడుగు, బలహీన వర్గాల పిల్లలను మూడవ తరగతి నుండే ప్రధాన స్రవంతి విద్య నుండి పక్కకు తప్పించి వారందరినీ చౌకగా పనిచేసే కూలీలుగా దిగజార్చే కుట్ర అందులో ఉంది. కాని, ఇంకోపక్క ఆ పేదలలోనే చీలికలు సృష్టించడానికి క్రైస్తవ, ముస్లిం మతాల దళితులకు రిజర్వేషన్లు వర్తించకూడదన్న ప్రచారం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో సుప్రీం కోర్టు చొరవ తీసుకుని ఈ వివాదానికి తెర దించాలి. కుల ఆధారిత రిజర్వేషన్లకు, మతానికి లింక్‌ పెట్టే పద్ధతికి స్వస్తి పలకాలి.