May 30,2021 08:04

   దైనా ఒక నమ్మకం పూర్తిగా వ్యక్తిగతం అయినప్పుడు దాంతో ఎవరికీ ఏ పేచీ ఉండక్కర్లేదు. అదే నమ్మకం మరొకరి జీవితంపైనో, జీవనం పైనో ప్రభావం చూపించేదిగా మారినప్పుడు మాత్రం- దానిని ప్రశ్నించే అవసరం, అవకాశం, హక్కూ సమాజానికి సహజంగానే సంప్రాప్తిస్తాయి. మా నమ్మకం మాది అని కొందరు సంకుచితంగా అనుకున్నట్టుగానే...మా ప్రశ్న మనందరి కోసం అని మరికొందరు విశాల దృక్పథంతో అనుకోవొచ్చు. ప్రశ్న అనేది ప్రకృతిసిద్ధమైనది, చాలా సహజాతి సహజమైనది. అందుచేతనే అది రాజ్యాంగబద్ధమైనది కూడా! ప్రశ్న ఎంత సహజసిద్ధమైందో తెలియాలంటే- మీ ఇంట్లో ఉన్న పసిపిల్లలను కదిపి చూడండి! మీరు విసుగెత్తి కసిరి నోరు మూయించనంతసేపూ వారి జిజ్ఞాసా పరంపర కొనసాగుతూనే ఉంటుంది. సమాధానం చెప్పటం చేతకానప్పుడో లేక ఆ ప్రశ్న మన నమ్మకాలను కూల్చి కుప్ప వేస్తుందని అనిపించినప్పుడో - బలవంతాన నోరు మూయించే ప్రయత్నం మొదలవుతుంది. ఎందుకంటే కొంతమందికి సత్యాన్ని అన్వేషించటం కన్నా- ఏర్పర్చుకున్న నమ్మకాల ప్రపంచంలోనే కొనసాగడం మహా సుఖంగా అనిపిస్తుంది. ఆ సుఖసూత్రాన్ని అనేకమంది అమాయక త్వంతో ఆచరిస్తుంటే- దానిని స్వార్థ ప్రయోజనాలకోసం వ్యూహాత్మక ంగా వాడుకోవటం కొంతమందికి అలవాటు. వ్యాపారాల్లోనూ, రాజకీయాల్లోనూ ఇలాంటి గూడుపుఠాణీ చాలా కాలంగా వర్థిల్లుతూనే ఉంది.
    జనం నమ్మకాల జాతర తమకు అధికార పీఠాలను అలవోకగా అందిస్తుందని భావించినప్పుడు కొందరు ఆ నమ్మకాలకు మరింత మూఢత్వం జోడిస్తారు. దాన్నొక గుంపు స్వభావంగా, ఉన్మాదంగా మార్చేసి.. తమకిష్టమొచ్చినట్టు ఆడిస్తారు. ప్రధాన సమస్యల నుంచి, ప్రశ్నల నుంచి జనం మెదళ్లను పక్కదారి పట్టించటానికి ఇలాంటి గారడీలు తాత్కాలికంగా ఉపయోగపడతాయి. కానీ, నమ్మకాలు అనేవి చిరకాలం ఒకేలా కొనసాగవు. వైజ్ఞానిక నిరూపణలో వాస్తవాలు తేటతెల్లమైనప్పుడు ఎన్నేళ్ల నమ్మకాలైనా ఒక్క పట్టాన కుప్పకూలి పోతాయి. భూమి బల్లబరుపుగా ఉందని ప్రపంచంలోని అన్ని సమాజాలూ బలంగా నమ్మాయి ఒకప్పుడు. దానిచుట్టూ బోలెడన్ని తమాషా కథలనూ అల్లుకున్నాయి. భూమి గుండ్రంగా ఉందని పరిశోధకులు చెప్పినప్పుడు కొందరు తిట్టిపోశారు, దాడి చేశారు. కానీ, నిజం నిజమే కదా! మశూచి వంటి అంటురోగాలకు అమ్మవార్ల ఆగ్రహాలే కారణమని ఒకప్పుడు జనాలు రాతిబొమ్మల ముందు వజవజా వణికిపోయారు. అదొక వైరస్‌ కారక రోగమని నిర్ధారించి, దానిపై అనేక పరిశోధనలు చేసి, టీకా అస్త్రాన్ని అత్యద్భుతంగా ప్రయోగించింది విజ్ఞానశాస్త్రం. లక్షల మందిని పొట్టన పెట్టుకొన్న అలాంటి ప్రాణాంతక రోగాలను ఆదిలోనే అంతం చేసే ఆధునిక వైద్య విజ్ఞానం నేడు అందుబాట్లో ఉంది. నమ్మకాల్లో పడి కొట్టుకుపోతే, అవే నిజమని నెత్తిన పెట్టుకొని సాగితే- సమాజం ఇంతగా అభివృద్ధి చెందేదే కాదు. దేవేంద్రుడి వజ్రాయుధం తళతళలే మేఘాల మెరుపులని, అర్జునుడి రథ అలజడులే పిడుగులని నమ్మి ఊరుకుంటే- ప్రపంచాన్ని సమూలంగా మార్చేసిన విద్యుత్తు సదుపాయం సమకూరి ఉండేది కాదు. శాస్త్ర సాంకేతిక సమాచార వ్యవస్థలు ఇంతగా విస్తరించి ఉండేవి కావు! అలాగే జ్ఞానం అనేది స్థిరబిందువు కాదు; అస్పష్టత నుంచి స్పష్టత వైపు సాగే నిరంతర అన్వేషణ. ప్రశ్నించటం, తర్కించటం అనేవి ఈ అన్వేషణా రథానికి రెండు చక్రాలు.
   ఇప్పటికన్నా మరింత ఉన్నతంగా, ఉత్తమంగా సమాజం పరిఢవిల్లటానికి ప్రశ్నల ప్రవాహం నిరంతరంగా, నిర్విరామంగా కొనసాగాలి. ప్రశ్న ప్రగతికి పునాది. అజ్ఞానానికి, అహంకారానికి పరమ విరోధి. నడిచిన చరిత్ర నిండా ఎన్నెన్నో ఆటంకాలను, అవమానాలను, దాడులను, దౌర్జన్యాలను అధిగమిస్తూ సాగింది. విజ్ఞానశాస్త్రం అనేక రంగాల్లో సాధించిన ప్రగతికి ఆ ప్రశ్నే ఆలంబనగా నిలబడింది. తనను ఎవరు ఎలా ఆక్షేపించినా, ఎంతగా అవహేళన చేసినా, ఎన్ని ఆరోపణలు గుప్పించినా, వీరావేశంతో విరుచుకుపడినా సత్యాన్వేషకులు అదరరు, బెదరరు, భయపడరు. నిజ నిరూపణ కోసం నిరంతరంగా కృషి చేస్తూనే ఉంటారు. నమ్మకం అనేది ఒక్కోసారి నమ్మినవారిని సైతం నట్టేట ముంచొచ్చు కానీ, ప్రశ్న అలా చేయదు. విజ్ఞానం అలా వంచించదు. విబేధించిన వారికి సైతం తన ప్రయోజన ఫలాలను అందిస్తుంది. ఎందుకంటే ప్రశ్న సకల జన హితాన్ని కోరుతుంది కనుక. విజ్ఞానం విశ్వ శ్రేయస్సును అభిలషిస్తుంది కనుక !