నగరాలు, పట్టణాల్లో ఆస్తి విలువ ఆధారిత ప్రాపర్టీ ట్యాక్స్, చెత్త నిర్వహణ పన్నులు మోదాలన్న ప్రభుత్వ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజలకు శరాఘాతం. అసలే కరోనా తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభానికి జన జీవనం అతలాకుతలమై బతుకీడ్చేదెలాగో పాలుపోక మధన పడుతున్న తరుణంలో కొత్త తరహా పన్నులేసి అదనపు భారాలు మోపడం సర్కారు నిర్దయకు తార్కాణం. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను గతంలో యజమానులకు వచ్చే అద్దెలు, లీజుల ఆధారంగా వేసే పద్ధతి ఉంది. ఇప్పుడు ఆస్తి విలువ ఆధారంగా విధిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఆస్తి విలువ పెంచితే అప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుంది. ఆస్తి పన్ను పది పన్నెండు శాతానికంటే ఎక్కువ ఉండదంటూ చేస్తున్న సర్కారు వారి ఉటంకింపులకు ఏ మాత్రం భరోసా లేదు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఎప్పుడు ఖజానా నిండుకుంటే అప్పుడు లోటు పూడ్చుకునేందుకు ఆస్తి విలువ పెంచడం పరిపాటిగా మారింది. ఆ లెక్కన ప్రాపర్టీ ట్యాక్స్ ప్రజలకు తడిసి మోపెడవడం ఖాయం. ఖాళీ స్థలాలపై పన్నులు మరీ దారుణం. ఒక్క ఆస్తి పన్నుతోనే వదిలి పెట్టట్లేదు. పౌర సేవలన్నింటికీ పన్నులను, యూజర్ ఛార్జీలను బాదుతోంది ప్రభుత్వం. చెత్త నిర్వహణ పేరుతో వేస్తున్న పారిశుధ్య సేవా పన్ను మొదట్లో కొద్ది మొత్తంగానే కనబడుతున్నా పోయేకొద్ది గుది బండ అవుతుంది. దీనికి సీవరేజి పన్ను అదనం. మంచినీటి పంపులకు మీటర్లు బిగించి లీటర్ల లెక్కన కొలిచి విక్రయించే విధానం సరేసరి. ప్రభుత్వ ఈ చర్యల ద్వారా పౌరులకు ఏ సేవా ఏ సదుపాయం ఉచితం కాదన్న తత్వం బోధ పడుతుంది. ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి బాధ్యత వహించదని రూఢ అవుతుంది.
పన్నులు వడ్డించాలన్న రాష్ట్ర ప్రభుత్వ 'సిద్ధాంత' అసలు సృష్టికర్త కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం. సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడిచి రాష్ట్రాల హక్కులను బలవంతంగా లాక్కుని నిధులను, అధికారాలను గుప్పెట్లో పెట్టుకుంటోంది. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదలలో ఎక్సయిజ్ డ్యూటీకి బదులు సెస్‌లు వేసి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఆదాయాలకు గండి కొడుతోంది. కోవిడ్‌ను ఎదుర్కొనే చర్యలకు నిధులివ్వకుండా కేవలం నిబంధనల విడుదలకే పరిమితమైంది. రాష్ట్రాలకు జిఎస్‌టి పరిహారం చెల్లించకుండా అప్పులు చేయమంటోంది. అప్పులు చేయడానికి షరతులు పెడుతోంది. కేంద్రం నుండి రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగా రావాల్సిన ఆదాయ వాటాలు, నిధులపై నిలదీయకుండా, కేంద్రం విధించిన షరతుల అమలును భుజానికెత్తుకుంది మన రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం విధించిన షరతుల్లోనివే ఆస్తి విలువ ఆధారిత ప్రాపర్టీ ట్యాక్స్‌్, 'చెత్త' పన్ను వగైరా వగైరా. స్థానిక సంస్థల్లో పన్నుల నిర్ణయం ప్రజలు ఎన్నుకున్న స్థానిక పాలక మండళ్ల అధికారం. 73, 74 రాజ్యాంగ సవరణలు స్థానిక సంస్థలకు ఆ అధికారం కట్టబెట్టాయి. కాగా స్థానిక సంస్థల్లో ఏ పన్నులు ఎంత వేయాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధం. కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై రాష్ట్రం నిలదీసి సాధించకుండా స్థానిక సంస్థలను ఎండబెట్టడం, వాటి నిధులను అవే సమకూర్చుకోవాలనడం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం.
ప్రభుత్వాలు ప్రజలకు అందించే సమస్త సేవలను ప్రైవేటీకరించాలన్న లక్ష్యం ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ ఆదేశిత సరళీకరణ విధానాల నుండి పుట్టుకొచ్చింది. రక్షిత మంచినీరు, పారిశుధ్యం, ప్రజారోగ్యం, వంటి కనీస సేవలను సైతం ప్రజలు కొనుక్కోవాలని, వాటి కల్పనకు అయ్యే పూర్తి ఖర్చును వినియోగదారుల నుండి వసూలు చేయాలని ఆ విధానాలు శాసిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కార్పొరేట్లు లాభపడతాయి. ప్రజలపై అదనపు భారాలు పడతాయి. ఆ విధానాలను దూకుడుగా అమలు చేసేందుకు ఉపక్రమించిన కేంద్రం, రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తోంది. ఆస్తి పన్ను, చెత్త పన్నులపై ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఆగ్రహం పెల్లుబుకుతోంది. పన్నుల రద్దు డిమాండ్‌పై ఉద్యమించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 250 పట్టణ పౌర సంఘాల ఐక్య వేదిక ఏర్పాటై తన కార్యాచరణను ప్రకటించింది. ప్రజల అసమ్మతిని అర్ధం చేసుకొని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పన్నుల విధింపుపై పునరాలోచించి వెనక్కి రావాలి. రాష్ట్ర ప్రజల తరఫున నిలిచి కేంద్రంతో పోరాడే బదులు ఆ కేంద్ర విధానాలను నెత్తికెత్తుకొని ప్రజలపై భారాలు మోపితే ప్రతిఘటన తప్పదు.










