Jun 01,2021 07:14

   నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య మందు కరోనాను తగ్గిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సిసిఆర్‌ఎఎస్‌) తేల్చిన దరిమిలా ఆనందయ్య మందుపై పది రోజులుగా నెలకొన్న అలజడికి తెర పడింది. శాస్త్రీయ కోణంలో ప్రజాశక్తి వెలుగులోకి తెచ్చిన వాస్తవాలే ఆచరణాత్మకం అయ్యాయి. ఆనందయ్య మందు ప్రమోషన్‌ కోసం ఇంతకాలం చిలవలు పలవలుగా ప్రచారం చేసిన వ్యూహాత్మక ప్రచారకర్తల గొంతులో సిసిఆర్‌ఎఎస్‌ నిర్ధారణతో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. సందు దొరికినప్పుడల్లా సనాతన ధర్మం, ప్రాచీనత, భారతీయత అంటూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే మూకలకు సిసిఆర్‌ఎఎస్‌ నివేదిక చెంపపెట్టు. కరోనా రెండవ దశ ఉధృతంగా ప్రబలి ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క ఆక్సిజన్‌ అందక వేలాది మంది ఊపిరాడని స్థితిలో భయాందోళనలలో ఉన్న సమయంలో కరోనాను తగ్గించే మందును ఆనందయ్య ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్న వార్త దావానలంగా వ్యాపించడంతో వేలాది మంది కృష్ణపట్నానికి చేరారు. కోవిడ్‌ ఉధృతి, శాంతి భద్రతల రీత్యా ప్రభుత్వం మందు పంపిణీని తాత్కాలికంగా నిలిపేసి, శాస్త్రీయత నిర్ధారణ అయ్యే వరకు ఆగాలంది. అంతే.. గంగవెర్రులెత్తిన ఆనందయ్య మందు ప్రచారకర్తలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఆధునిక వైద్యానికి, ఆయుర్వేదానికి పోటీ పెట్టి విపరీతార్ధాలు తీశారు. వేదాల్లో ఆనందయ్య ఆయుర్వేదం నిక్షిప్తమైందంటూ దాని శాస్త్రీయతను ప్రశ్నించిన, సందేహించిన వారిని జాతి, దేశ ద్రోహులంటూ శివాలెత్తారు. తీరా మోడీ ప్రభుత్వ ఆధ్వర్యాన నడిచే ఆయుష్‌ డిపార్టుమెంట్‌ పరిధిలోని పరిశోధనా సంస్థే ఆనందయ్య మందుకు శాస్త్రీయత లేదన్నాక సదరు ప్రచార గణాలు తోక ముడవడం తప్ప చేసేదేముంది ?
   ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది కనుక ఆనందయ్య విజయం సాధించారనే వాదనలు బయలుదేరతీశారు. చట్ట ప్రకారం స్థానికంగా సంప్రదాయంగా వచ్చే నాటు మందులపై ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. హానికరం కాకపోతే ఇష్టమైన వారు వాడుకోవచ్చు. అదే సిసిఆర్‌ఎఎస్‌ ఉదహరించింది. మందులు తయారు చేసే వారు తమది ఆయుర్వేదమనో, మరేదనో చెప్పి పర్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే అప్పుడు క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపి శాస్త్రీయత నిర్ధారించాల్సి ఉంది. ఆనందయ్య అలాంటి అర్జీ ఏమీ పెట్టుకోలేదు. అయినప్పటికీ విస్తృత ప్రజా ప్రయోజనాల రీత్యా, కంటిలో వేసే చుక్కల మందుపై నివేదికలు రానందున, కె-అనే మందును నిపుణుల ముందు ఆనందయ్య ప్రదర్శించనందున, ఆ రెంటికీ అనుమతులివ్వలేదు. తతిమ్మా మందులు హానికరం కాదని తేలినందున సంప్రదాయ మందుగా వాడుకోమంది. కోవిడ్‌ పేషెంట్లు వెళ్లకుండా బంధువులను పంపాలనడం, కోవిడ్‌ నిబంధనలు పాటించాలనడం వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికే.
   ఆనందయ్య మందుపై పనిగట్టుకొని నిర్వహించిన ప్రమోషన్‌ వర్క్‌ వలన అమాయక ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటికే నెల్లూరు జిజిహెచ్‌లో ఆరుగురు మరణించగా, 130 మంది ప్రాణాపాయంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆనందయ్య మందుకు విపరీత ప్రచారం కల్పించడానికి రిటైర్డ్‌ హెడ్‌ మాస్టర్‌ కోటయ్యను వాడుకున్నారు. ఆయన ఈ రోజు చనిపోయారు. కరోనాకు పనికొస్తుందో లేదో నిర్ధారణ కాకుండా ప్రజల్లో మూఢ విశ్వాసానికి కారణమైన వారే ఈ వైపరీత్యాలకు బాధ్యత వహించాలి. జనం గుమిగూడుతుండటంతో కృష్ణపట్నంలో ఆనందయ్య శిష్యులకు, గ్రామస్థులకు కరోనా సోకుతున్నదని పరీక్షల్లో నిర్ధారణయింది. దీనికి ఆనందయ్య, ఆయనకు వత్తాసుపలికే వారు ఏం సమాధానం చెబుతారు? ఆనందయ్య వంటి ఉదంతాలొచ్చినప్పుడల్లా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, పరివారం ఉన్మాదాన్ని నూరిపోయడం వాటి అసలు సిసలు నైజం. తాడూ బొంగరం లేని ఆనందయ్య మందుపై వైసిపి, టిడిపి రాజకీయాలు కార్పొరేట్‌ దోపిడీపై ప్రజలను తప్పుదారి పట్టించడానికే పనికొస్తాయి. ఆధునిక శాస్త్ర కృషి నుండే కరోనాను గుర్తించడం, దాని జన్యు పటాన్ని ఆవిష్కరించడం, ఏ విధంగా వ్యాపిస్తున్నదో నిర్ధారించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిర్దేశించడం, వ్యాక్సిన్లను కనుగొనడం జరిగింది. ఈ కృషి ద్వారా ఆధునిక శాస్త్ర విజ్ఞానం, అల్లోపతిక్‌ వైద్య పరిశోధనలు కరోనాకు శాశ్వత చికిత్సను కూడా తప్పకుండా సాధిస్తాయి. మరే తక్కిన ప్రత్యామ్నాయాలు, వైద్య పద్ధతులు ఆ విధమైన పురోగతిని కరోనా కట్టడిలో చూపించలేకపోయాయన్నది చేదు నిజం. ఇటువంటి సమయంలో ఆధునిక శాస్త్రీయ వైద్య విధానం మీద విమర్శలు ఎక్కుపెట్టడం అంటే మన వేలితో మన కన్ను పోడుచుకోవడమే.