Jun 08,2021 07:03

    'ఏమీ తెలియని వారికి నచ్చ చెప్పవచ్చు, సగం తెలిసిన వారిని ఒప్పించవచ్చు, మూర్ఖుల మనసు మార్చలేం' అనే లోకోక్తి కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వానికి బాగా నప్పుతుంది. కాకపోతే, బిజెపి సర్కారుది వ్యూహాత్మక మూర్ఖత్వం. ఏకరూప సిద్ధాంతానికి పదునుపెట్టే, కార్పొరేట్లకు ఎడాపెడా దోచిపెట్టే నైజం. రెండో మారు మోడీ సర్కారొచ్చి సరిగ్గా రెండేళ్లు. మొత్తంగా ప్రభుత్వ వయసు నిండు ఏడేళ్లు. ఈ కాలంలో సర్కారుది అన్నింటా వైఫల్యాలే. గుణపాఠాలు నేర్చుకొని విధానాలను, ధోరణిని మార్చుకోవడం అటుంచి, ఎత్తి చూపిన వారిపై ఎదురుదాడి, అక్రమ కేసులు, ఆనక వైఫల్యాలకు మసి పూసి మారేడుకాయ చేసే అభూత కల్పనల ప్రచారం బిజెపి సొంతం. కరోనా మహమ్మారినే తీసుకుంటే, కేంద్ర అలసత్వం కారణంగా సెకండ్‌ వేవ్‌ విజృంభించింది. ఇప్పటికి మూడు కోట్లకు సమీపంలో పాజిటివ్‌ కేసులు, మూడున్నర లక్షల మరణాలు నమోదయ్యాయి. ఇంకా రోజుకు రెండు లక్షల్లోపు కేసులు, మూడు వేలకుపైన మృతులు కొనసాగుతున్నాయి. ఈ గణాంకాలు అధికారికాలు. వాస్తవంలో ఇంతకంటే కనీసం మూడు రెట్లు ఉంటాయని సర్వేలు చెబుతున్నాయి. మరిన్ని వేవ్‌ల ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిరోధానికి వ్యాక్సినేషన్‌ తప్ప వేరే మార్గం లేదనీ స్పష్టీకరిస్తున్నారు. టీకా విధానంలో పలు విన్యాసాల నడుమ ఇప్పటికి ఎంత మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ అందిందో పెద్ద పజిల్‌. నేడు జాతినుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలోనే 22 కోట్ల డోసుల ఉత్పత్తి జరిగిందని సెలవిచ్చారు. అంటే, సగటున 11 కోట్ల మందికే రెండు డోసుల టీకా దొరికినట్లు. మరి 130 కోట్ల మందికి ఎప్పటికి టీకా అందుతుంది?
    ప్రజలందరికీ ఉచితంగా టీకా అందించే బాధ్యతను కేంద్రం తీసుకోవాలని, ప్రభుత్వ రంగంలో టీకాల ఉత్పత్తి పెంచాలని, ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలు, నిపుణులు నెత్తీనోరు మొత్తుకుంటున్నా ప్రభుత్వం లక్ష్య పెట్టట్లేదు. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు దేశాన్ని ఎగబాకిస్తామనగా, 2020-21లో స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేని విధంగా ప్రతికూల వృద్ధిరేటు (-7.3 శాతం) నమోదైంది. స్థూల తలసరి ఆదాయం పడిపోయింది. ఇదే సమయంలో ధరలతో బీద, బిక్కి, సామాన్య, జనం బతుకు సాగించలేకున్నారు. ఉద్యోగ, ఉపాధి క్షీణిస్తోంది. సుస్థిరాభివృద్ధిలో మన దేశం 115 నుండి 117 స్థానానికి దిగజారిందని 'ద స్టేట్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎన్విరాన్‌మెంట్‌ రిపోర్టు' వెల్లడించింది. ఎడ్యుకేషన్‌ పెర్ఫార్మెన్స్‌లో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, పలు బిజెపి రాష్ట్రాలు అథమ స్థానంలో ఉన్నాయి. ఈ మధ్యనే ఆకలి సూచిలో భారత్‌ స్థానం దిగజారిందని ఒక స్టడీ తేల్చింది. చివరికి ప్రజాస్వామ్యం అమలులోనూ మన దేశం ర్యాంక్‌ దిగజారిందని ఇటీవలే స్వీడన్‌ సంస్థ వెల్లడించింది. కోవిడ్‌ రెండో దశ కట్టడిలో మోడీ సర్కారు విఫలమైందని ప్రఖ్యాత 'లాన్సెట్‌' మేగ్జయిన్‌ పేర్కొంది. చెప్పుకుంటూ పోతే మోడీ సర్కారు వైఫల్యాల చిట్టా చాలానే ఉంది. ఎవరు ఏం చెప్పినా ఆలకించే సోయి ప్రభుత్వానికి లేక పోయింది.
    ప్రభుత్వ వైఫల్యాలపై ఆత్మవిమర్శకు బదులు సమర్ధనలు, విమర్శలు, ఖండనలకే బిజెపి తన శక్తినంతా వినియోగిస్తోందనడానికి బోలెడు ఉదంతాలున్నాయి. కొత్త ఐ.టి రూల్స్‌ పేరిట పౌరులకు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను సర్కారు హరిస్తోందన్న భయాందోళనలు వ్యక్తమవుతుండగా, సంబంధిత మంత్రి తమ చర్యను ఏకపక్షంగా సమర్ధించుకోవడమే కాకుండా సోషల్‌ మీడియా యూజర్ల భద్రత కోసమేనని తప్పుదారి పట్టిస్తున్నారు. సోషల్‌ మీడియాపై ఆధారపడి అధికారంలోకొచ్చిన మోడీ సర్కారు, అదే సోషల్‌ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేసరికి తట్టుకోలేక ఐ.టి రూల్స్‌ తెచ్చిందన్నది దాచినా దాగని సత్యం. కరోనా సమయంలో ప్రజల ఉపాధి ప్రమాదంలో పడగా, ఇప్పుడే 44 కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన నాలుగు కోడ్స్‌ అమలుకు రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది. లేబర్‌ కోడ్స్‌ అమల్లోకొస్తే ఉద్యోగుల జీతాలకు కోత పడుతుంది. సామాజిక, ఉద్యోగ భద్రతకు ఇప్పుడున్న సదుపాయాలు సైతం కుంచించుకుపోతాయి. కరోనా నియంత్రణలో ఘోర వైఫల్యం చెందిన ఉత్తరప్రదేశ్‌ సి.ఎం యోగి ఆదిత్యనాథ్‌కు బిజెపి జాతీయ నాయకత్వం 'గుడ్‌ కాండక్ట్‌' సర్టిఫికెట్‌ ఇవ్వడం వైఫల్యానికి కితాబు ఇవ్వడమే. పలు బిజెపి రాష్ట్రాల పట్ల కేంద్రం ఇలానే వ్యవహరిస్తోంది. తమ వైఫల్యాల, విధానాల పట్ల ప్రజలను ఏమార్చే ప్రయత్నాలు ఎంతోకాలం సాగవు. ప్రజలు తప్పక గుర్తించి బుద్ధి చెబుతారు.