
ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, వ్యాట్ పన్నులు తగ్గించాలని కోరితే కొన్ని రాష్ట్రాలు తగ్గించగా ఇంకొన్ని అలా చేయలేదని ప్రధాని మోడీ బిజెపి యేతర పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఎదురుదాడికి పూనుకోవడం గర్హనీయం. దేశంలో కోవిడ్ పరిస్థితిపై బుధవారంనాడు ముఖ్యమంత్రులతో సమీక్ష సమావేశంలో ప్రధాని ఇంధన ధరలు, పన్నుల గురించి మాట్లాడడం సందర్భ శుద్ధి అనిపించుకోదు. 'ఎదురుదాడి చేయడమే ఆత్మరక్షణకు ఉత్తమ మార్గం (అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ వే ఫర్ డిఫెన్స్) అన్న నానుడిని ప్రధాని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. 2014లో నరేంద్ర మోడీ అధికారానికి వచ్చినప్పటి నుండి పెట్రోల్, డీజిల్, వంటగ్యాసు, సహజవాయువు...ఇలా అన్ని పెట్రోలియం ఉత్పత్తుల ధరలూ ఏడాదికేడాది ఎగబాకుతూ వచ్చాయి. ఇదేమిటంటే అంతర్జాతీయ ధరలు పెరిగాయని కమలనాథులు బుకాయించేవారు. నిజానికి గత ఏడెనిమిది మాసాలు తప్ప మోడీ పాలనా కాలమంతటా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తక్కువగానే ఉన్నా భారతీయ వినియోగదార్లకు మాత్రం ధరలు తగ్గలేదు సరికదా పెరిగాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపున కోవిడ్ అనంతర ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ప్రజానీకంలో మోయలేని భారంగావున్న పెట్రో ధరలపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రజాగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై మళ్లించి, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నించడం ప్రధాని మోడీకి తగదు.
పెట్రో ఉత్పత్తుల ధర పెంపు కోసం ఎక్సైజు సుంకాన్ని తొలుత పెంచుతూ వచ్చిన మోడీ సర్కారు ఆ తరువాత సుంకాన్ని తగ్గించి, ఆ మేరకు సెస్సులను వేసి ఖజానాను నింపుకొంది. తమ జేబులోంచి పోయాక అది సెస్సయినా సుంకమైనా ఏముందిలే అని జనం అనుకున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు కన్నం పెట్టే మోడీ సర్కారు దుష్ట తలంపు గమనించలేదు. కేంద్రం విధించే పన్ను ఎక్సైజు సుంకంగానే అయితే, అందులో వాటా రాష్ట్రాలకు బదిలీ అవుతుంది కానీ బిజెపి సర్కారు వివిధ సెస్సులు, ప్రతేక అదనపు సుంకం పేరిట విధించడంతో అదంతా కేంద్ర ఖజానా లోనే ఉండిపోతోంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై అదనపు ఎక్సైజు సుంకం రూ. 11, రోడ్ సెస్ రూ. 13గా ఉన్నాయి. అంటే కేంద్ర ఖజానాకు నేరుగా రూ.24 జమయిపోతోంది. ఎక్సైజు సుంకంలో రాష్ట్రాలకు సుమారు నాలుగు రూపాయలు, కేంద్ర ఖజానాకు ఆరు రూపాయలు వెళ్తాయి. అంటే ప్రతి లీటరు పెట్రోలుకు కేంద్రానికి కనీసం రూ.30 పోగా అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సైతం పన్నుగా వచ్చేది రూ.28. మోడీ గద్దెనెక్కాక ఈ ఎనిమిదేళ్లలో పెెట్రోల్‌పై 531 శాతం, డీజిల్‌పై 206 శాతం ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన కేంద్రానికి పెట్రో ఉత్పత్తుల ద్వారా రూ. 26 లక్షలు అదనంగా పోగు పడిందంటే నిలువు దోపిడీ ఎలా వున్నదో స్పష్టమవుతోంది. ఈ మర్మాన్ని చెప్పకుండా ప్రధాని కేంద్రానికి వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కుతుందని పేర్కొనడం మరో మోసం.
కేరళలో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అధికారానికి వచ్చాక 2018లో పెట్రోల్‌పై ఒక శాతం, డీజిల్‌పై రెండు శాతం వ్యాట్ తగ్గించి దేశానికి మార్గం చూపింది. దానివల్ల ఏటా రూ. 1500 కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్టు చెప్పిన ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బాలగోపాల్ ఇంకా వ్యాట్ తగ్గించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులూ కేంద్రం వివక్ష చూపుతున్నదనీ, ఇంధన ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు కారణం కాదనీ స్పష్టం చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో ఎపి లోనే వ్యాట్ శాతం ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ ను తగ్గించడమో లేక ప్రధాని వ్యాఖ్యలపై స్పందించడమో అవసరం. జిఎస్‌టి విధానం వచ్చాక రాష్ట్రాలకు పన్ను విధించే అవకాశం పోయింది. జిఎస్‌టి లోటును పూడ్చడంలో సైతం కేంద్రం ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై సెస్సులను తొలగించి, ప్రజలకు ఉపశమనం కలిగించాలి. ఆ పని చేయడం మాని, రాష్ట్రాలపై నెపం మోపడం ప్రధానికి తగదు.