ప్రజాశక్తి-గుంటూరు : 'తాడికొండ మండలంలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్‌జిటి ఉపాధ్యాయులు (భార్యా, భర్త) ఇటీవల జరిగిన బదిలీల్లో పెదకాకాని మండలానికి వెళ్లారు. అయితే రెండు నెలలుగా వీరికి జీతాలు విడుదల కావట్లేదు. హౌసింగ్ లోన్ తీసుకొని ఇల్లు నిర్మించుకున్న వీరు బ్యాంకుకు ప్రతినెలా 5వ తేదీన ఇఎంఐ చెల్లించాల్సి ఉంది. కానీ జీతాలు రాకపోవటంతో ఇఎంఐలు కట్టడానికి అప్పులు చేస్తున్నారు. ఇంట్లో ఇద్దరికీ జీతాలు రాకపోవటంతో ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉందని వాపోతున్నారు. మరోవైపు తాజాగా విద్యాశాఖ చేపట్టిన పనిసర్దుబాటు వీరి పేర్లు కూడా ఉండటంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా ఉంది వీరి పరిస్థితి. జిల్లాలో బదిలీలు పొందిన ఉపాధ్యాయులందరి పరిస్థితి దాదాపుగా ఇదే విధంగా ఉంది.'
జిల్లాలో బదిలీలు, ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు లేవు. బదిలీలు పొందిన కొత్త స్టేషన్లలో వీరి పేర్లు సిఎఫ్‌ఎంఎస్‌లో నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాకపోవటంతో సెప్టెంబర్ 1న జీతాలు వస్తాయనే నమ్మకం లేదు. దీంతో వివిధ అవసరాల కోసం రుణాలు పొందిన వారు, ఇంట్లో అవసరాలకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ఇటీవల సుమారు 4వేల మంది ఎస్‌జిటి, స్కూల్ అసిస్టెంట్ కేడర్ ఉపాధ్యాయులు బదిలీలు పొందారు. అలాగే ఐదారు వందల మంది ప్రమోషన్లు పొందారు. వీరిలో ఒకే మండల పరిధిలో బదిలీలు పొందిన వారు, ఇంకా కొద్ది మందికే జీతాలు వస్తున్నారు. సుమారు 3 వేల మందికిపైగా ఉపాధ్యాయులకు జూన్, జులై జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీరు అప్పటి దాకా పనిచేసిన పాత స్టేషన్‌లో వేతన బిల్లులు వేసే డిడిఒ లాగిన్ నుండి బదిలీ పొందిన ఉపాధ్యాయుని పేరును తొలగించాల్సి ఉంటుంది. కొత్తగా బదిలీ పొందిన స్టేషన్ డిడిఒ సదరు ఉపాధ్యాయుని పేరును తన పరిధిలో నమోదు చేసి, సిఎఫ్‌ఎంఎస్‌కు అప్రూవల్ కోసం పంపించాలి. సిఎఫ్‌ఎంఎస్ అప్రవల్ రాగానే కొత్త ప్రాంతాల్లోని డిడిఒలు వేతన బిల్లులు వేయటానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు.
ప్రతి నెలా 25వ తేదీలోగా ఉద్యోగుల వేతన బిల్లులు వేయాల్సి ఉంటుంది. కానీ బదిలీ, ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయుల పేర్లు కొత్త డిడిల పరిధిలోనే నమోదు కాలేదు. ఒక వేళ ఎంత వేగంగా చేసిన కనీసం పది పదిహేను రోజులు పడుతుందని అంటున్నారు. దీంతో ఆగస్టు నెల జీతం సెప్టెంబర్ 1న కూడా వేతనం జమ కాదని స్పష్టం అవుతుంది. దీంతో ఆయా ఉపాధ్యాయుల తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయులంతా వ్యక్తిగత లోన్లు, వాహన లోన్లు, హౌసింగ్ వంటి అనేక రుణాలు తీసుకొని ప్రతినెలా ఇఎంఐలు చెల్లించాల్సి ఉంది. సకాలంలో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు లేక, పెనాల్టీలు కట్టాల్సి వస్తోదని వాపోతున్నారు. కాగా సిఎఫ్‌ఎంఎస్ ధ్రువీకరణకు పంపించాల్సిన అవసరం లేకుండానే డిడిఒలే ధ్రువీకరించే విధంగా వారం క్రితం ఉత్తర్వులు విడుదల అయినా సాంకేతిక సమస్యలు ఎదురతున్నాయని, దీంతో మళ్లీ సిఎఫ్‌ఎంఎస్ వారికే పంపించాల్సి వస్తుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా విద్యార్థుల సంఖ్యకు అనుగునంగా విద్యాశాఖ పని సర్దుబాటు ప్రక్రియ చేపట్టింది. దీంట్లో రెండు నెలల క్రితం బదిలీ అయిన వారూ ఉండటం గమనార్హం. ఇప్పటికే ఒక చోట నుండి మరొక చోటుకి బదిలీ అయిన వారు ఇప్పుడు ఇంకో పాఠశాలకు వెళ్లాల్సి రావటంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేస్తుందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి.
ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి మానుకోవాలి
ఎం.కళాధర్, యుటిఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి.
ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి మానుకోవాలి. గత పిఆర్‌సి ఉద్యమ సమయంలో బలవతంగా, తమకు అంగీకారం, ప్రమేయం లేకపోయినా సవరించిన జీతాలు ఒక్కరోజులోనే ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వటానికి సాంకేతిక సమస్యలని సాగు చెబుతున్నారు. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో అవసరాలు, వైద్య ఖర్చులకు కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నెలా అప్పులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించి, సెప్టెంబర్ 1న జీతాలు జమయ్యేలా చర్యలు తీసుకోవాలి.










