Dec 09,2022 00:04

తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-సీలేరు
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకపక్క మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవాలు, మరోపక్క ఎదురు కాల్పులతో స్థానిక ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యాన సాయుధ పోలీసు బలగాలును మొహరించి అణువణువునా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్లలో సిఆర్పిఎఫ్‌ పోలీసు బలగాలను మోహరించి జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల నుంచి వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి విడిచిపెట్టారు. మావోయిస్టుల కదిరిగులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక జల విద్యుత్‌ కేంద్రం, రిజర్వాయర్లకు మావోయిస్టు నుంచి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా పగడ్బందీ చర్యలు చేపట్టారు. ఎదురు కాల్పుల నేపథ్యంలో గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కంటిమీద కునుకు లేకుండా తీవ్రభయంతో గురై కాలం వెలదీస్తున్నారు.