Aug 22,2021 12:57

ఆ రక్త సంబంధపు
పసిడి పాదాలను స్పృశించాలని
ఆ చిన్ని అడుగుల
మువ్వల సవ్వడులను ఆస్వాదించాలని
ఆనాటి పాలుపంచుకున్న
మమతల హృదయాన్ని హత్తుకోవాలని
ఆత్రంగా ఎదురుచూస్తున్నది ఆ.. గడప !

గిలిగజ్జాల చిలిపి అల్లరిని
నెమరేసుకుంటూ
కాకెంగిలి ఆత్మీయతలను పలవరించుకుంటూ
అమ్మ లాలనను పంచే మహాలక్ష్మి రాకకై
వేవేల నయనాలతో
ఎదురుచూస్తున్నది ఆ.. గడప!

నాన్నలా అభయం నేనంటూ
తోడు నీడయ్యే బంధం నాదంటూ
కలకాలం ప్రేమనల్లుకున్న
పచ్చని పందిరిగా మారి..
సోదరి ఆగమనానికై
తరగని అనురాగంతో
ఎదురుచూస్తున్నది ఆ.. గడప !

ఆ..అమృత హస్తాలలో పునీతమై
మణికట్టుపై విరిసే అమూల్య రాఖీకై
జన్మజన్మల అనుబంధమైన తోబుట్టువులకు
స్వాగత తోరణాలను కట్టి
ఎదురుచూస్తున్నది ఆ.. గడప !

అయిత అనిత
89853 48424