May 20,2023 22:47

నేర వివరాలు వివరిస్తున్న ఎస్‌పి సతీష్‌కుమార్‌


రూ.17.5 లక్షల విలువైన 12 మోటార్‌ సైకిళ్లు, 30 లారీ బ్యాటరీలు స్వాధీనం
ప్రజాశక్తి - కాకినాడ క్రైమ్‌
ఎవరైనా దొంగ సరుకు కొనుగోలు చేసినట్లయితే దొంగతనం చేసిన నేరస్థులతో పాటు కొనుగోలు చేసిన వ్యక్తి కూడా సమాన శిక్షార్హుడు అవుతాడని ఎస్‌పి ఎస్‌.సతీష్‌ హెచ్చరించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌పి సతీష్‌ కుమార్‌ చోరీకి సంబంధించి వివరాలను వెల్లడించారు. కాకినాడ నగరంలో మోటార్‌ సైకిల్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నేరస్తులను అదుపులోకి తీసుకుని వారు వద్ద నుండి 15 లక్షల విలువైన 12 మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.కాకినాడ సంజరు నగర్‌కు చెందిన దమ్ము శివప్రసాద్‌ (శివ), ములపర్తి కిషోర్‌ (బాబీ), గుండారపు శివరాం (సాయి)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. అలాగే రోడ్డు పక్కన నిలుపుదల చేసిన లారీల నుండి బ్యాటరీలను చోరీ చేస్తున్న మరో ముఠాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి వద్ద నుండి రెండు లక్షల 50 వేలు విలువైన 30 బ్యాటరీలను స్వాధీనం చేసుకుని వాటిని దొంగిలించిన స్థానిక దుమ్ముల పేటకు చెందిన కోమటి నూకరాజు, వంక ప్రేమ్‌ కుమార్‌లను అరెస్టు చేసినట్లు ఎస్‌ఫి సతీష్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దొంగతనం చేసి తెచ్చిన బైకులు, బంగారం, వగైరా వస్తువులు ఎవరూ కూడా కొనుగోలు చేయవద్దని ఆయన సూచించారు. దొంగ వస్తువులు కొనుగోలు చేసినా, కలిగి ఉన్నా నేరస్థుడిగానే పరిగణించి జైలుకు పంపి స్తామని హెచ్చరించారు. దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తుల సమాచారాన్ని ప్రజలు పోలీసులకు అందించాలని తెలిపారు. తమ మోటారు సైకిళ్లకు ప్రతి ఒక్కరూ వీల్‌ లాక్కుని వేసుకోవాలని, జిపిఎస్‌ను కూడా ఏర్పాటు చేసుకోవాలని ఎస్‌పి సూచించారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో విశేష కృషి కనబరిచిన క్రైమ్‌ సిబ్బందికి ఎస్‌పిఅభినందనలు తెలిపారు. సమావేశంలో ఎఎస్‌పి పి.శ్రీనివాస్‌, క్రైమ్‌ డిఎస్‌పి ఎస్‌.రాంబాబు పాల్గొన్నారు.