ప్రజాశక్తి-గుంటూరు : పిల్లలలో రక్తహీనతకు ప్రధాన కారణమవుతున్న నులిపురుగులు పూర్తి స్థాయిలో నిర్మూలనకు ఒకే రోజు పిల్లందరితో ఆల్బెన్డజోల్ మాత్రలు మింగించటం అతి ముఖ్యమైన కార్యక్రమని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ అన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పిల్లలతో ఆల్బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమం గురువారం సంగడిగుంటలోని సాదు చలమయ్య పాఠశాలలో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జె.నివాస్ మాట్లాడుతూ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రాష్ట్రం మొత్తం దాదాపు 5.20 కోట్ల మంది జనభా ఉండగా వారిలో 19 ఏళ్లలోపు వయస్సు ఉన్న సుమారు 1.10 కోట్ల మందికి మాత్రలు వేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అందరికీ ఒకేరోజు మాత్రలు వేయడం వల్ల నులిపురుగుల జీవిత చక్రం బ్రేక్ అవుతుందన్నారు. బహిరంగ మల విసర్జన, చేతులు శుభ్రం చేసుకోకపోవటం వలన పిల్లలు నులిపురుగుల బారిన పడుతున్నారని, విద్యార్థులందరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, చేతులు శుభ్రపరుచుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నులిపురుగుల కారణంగా పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగదల లోపించి చదువుపై శ్రద్ధ లేకపోవటం, చిరాకు, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు.10-19 ఏళ్ల బాలికల్లో రక్తహీనత, ఇతర ఆనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. ఏడాదికి రెండు సార్లు తప్పనిసరిగా పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీల, కార్పొరేటర్ ఎస్.శ్రీనివాసరావు, డైరక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ వి.రామిరెడ్డి, ఆర్‌బిఎస్‌కె స్టేట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఇ.ప్రశాంత్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏ.శ్రావణ్‌బాబు, డీఈవో శైలజ, డీపీఎం డాక్టర్ సిహెచ్.రత్నమన్మోహన్, చలమయ్య విద్యాసంస్థల కరస్పాడెంట్ రామకృష్ణ ప్రభు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి.శోభారాణి అధ్యక్షత వహించగా కలెక్టర్ లోతేటి శివశంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత వ్యక్తిగత పరిశుభ్రత, దంత సందరక్షణ, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సి జాగ్రత్లపై విద్యార్థులకు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులతో ఒక వాచి, అట్లాస్, ఒక స్పోర్ట్స్ షూను తల్లిదండ్రులను అడిగి కొనిపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌బిఎస్‌కె నోడల్ ఆఫీసర్, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ జి.చంద్రశేఖర్, కె.సాంబశివరావు, సిబ్బంది పాల్గొన్నారు.










