
ప్రజాశక్తి - ఆచంట
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మండలంలో బుధవారం ఎడతెరిపిలేకుండా వర్షం పడింది. దీంతో పలు కాలనీలు, పల్లపు ప్రాంతాలు, పంట పొలాలు నీటమునిగాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఆచంట, ఆచంట వేమవరం, పెనుమంచిలి, భీమలాపురం, కరుగోరుమిల్లి, కొడమంచిలి పంచాయతీ పరిధిలోని కాలనీలు ముంపు బారిన పడ్డాయి. ముఖ్యంగా కొడమంచిలి పంచాయతీ పరిధి టి.మెరక, చిన్నపేట, వల్లూరు పంచాయతీ పరిధి ఇందిరమ్మ కాలనీ, గెద్దాడవారిపాలెం, ఆచంట వేమవరం పంచాయతీ పరిధి పెద్దపేట, హరిజన పేట, కరుగోరు మిల్లి, పంచాయతీ పరిధి అంబేద్కర్ కాలనీ, పంచాయతీ కాలనీ, తదితర కాలనీలో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. దీనికితోడు రోడ్లు అధ్వానంగా ఉండడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముంపు లోనే పంట పొలాలు..
మండలంలోని ఆచంట, ఆచంట వేమవరం, కొడమంచిలి, కోడేరు, కందరవల్లి, కరుగోరుమిల్లి, పెనుమంచిలి, వల్లూరు శేషమ్మ చెరువు, తదితర గ్రామాల్లో ముందుగా నాట్లు పడిన వరిచేలు పూర్తిగా నీట మునిగాయి. నారుమడులు కూడా నీటిలోనే కొనసాగుతున్నాయి. ముంపు బారిన పడిన పంట పొలాలను ఎఇఒ నాగరాజు పరిశీలించారు.
పెనుగొండ : బుధవారం మండలంలో ఎడతెరిపి లేని వర్షం పడింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మొగల్తూరు : బుధవారం ఉదయం నుంచి సాయంకాలం వరకూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. వ్యవసాయం ఇతర పనులకు వెళ్లే కార్మికులు ఉపాధి కోల్పోయారు. మొగల్తూరు - వెంప, పేరుపాలెం - కెపిపాలెం, కాళీపట్నం - భీమవరం, ముత్యాలపల్లి - పేరుపాలెం, వాలతిప్ప - వెంప తదితర రహదారులు ధ్వంసమయ్యాయి. గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
పోడూరు : మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెనుమదం, పోడూరు, కవిటం, గుమ్మలూరు, పండితవిల్లూరు గ్రామాల్లోని కాలనీ జలమయం అయ్యాయి. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి. శివారు ప్రాంతాల్లో డ్రెయినేజీ వ్యవస్థ లేక పోవడంతో రోడ్లపై వర్షపు నిలిచిపోయి ప్రజలు నానా అవస్థలు పడ్డారు.
పాలకొల్లు రూరల్ : కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు బురదమయం అయ్యాయి. రోజువారీ కూలి పనుల నిమిత్తం వెళ్లేవారు నానా అవస్థలు పడుతున్నారు. వీధి వ్యాపారులు వ్యాపారం లేక ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు.
నిండా మునిగిన జగనన్న కాలనీ
ఆకివీడు : జగనన్న కాలనీ మొత్తం నీటిమయంగా మారింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీలో సుమారు రెండు అడుగుల నుంచి నాలుగు అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయింది. రెండు రోజులుగా జగనన్న కాలనీవాసులు నీళ్లల్లో నానుతున్నారు
ఉండి : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పలు రహదారులు, సిమెంటు రోడ్లు జలమయమయ్యాయి. డ్రెయినేజీలోని మురుగునీరు రోడ్లపైకి వచ్చి దుర్గంధం వెదజల్లుతోంది. ఉండి గోరింతోటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణ మొత్తం వర్షం నీటితో నిండిపోయి తరగతి గదిలోకి నీరు ప్రవేశించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని కాంతమ్మ మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీరు పాఠశాలలోకి చేరుతోందని, సమస్యను ఉన్నతాధికారులకు, నాయకులకు తెలిపామని తెలిపారు.
పాలకొల్లు: పాలకొల్లులో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కనీసం ప్రజలు పాల ప్యాకెట్లు తెచ్చుకోవడానికి వీల్లేకుండా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని డ్రెయిన్లు, రోడ్లు ఏకమై మురుగు ప్రవహిస్తోంది. దీంతో మురుగులోనే ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి. బస్టాండ్ ఆవరణ అంతా వర్షపు నీటితో నిండిపోయింది.