May 18,2022 06:50

     కాంగ్రెస్‌ పార్టీ మహామహులంతా రాజస్థాన్‌ లోని ఉదయపూర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన 'నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌' పార్టీ పరాజయానికి కారణమైన విధానాల్లో ఎలాంటి నిర్దిష్ట మార్పులను తీసుకురాలేకపోయింది. సంస్థాగతంగా కొన్ని మార్పులను ప్రకటించి, అదే గొప్ప అన్నట్లుగా కాంగ్రెస్‌ నాయకత్వం పోజు పెడుతున్నది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కాంగ్రెస్‌ మళ్లీ ఎక్కడా పుంజుకున్న దాఖలాలు లేవు. చివరికి పంజాబ్‌లో సైతం అధికారం పోగొట్టుకుంది. వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీకి చెందిన నాయకులు బిజెపిలోకి ఫిరాయిస్తుండడంతో ప్రస్తుతం అది ఒక సంక్షోభం తరువాత మరో సంక్షోభంలో చిక్కుకుంటున్నది. నూట ముప్పయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ నేడు ఎదుర్కొంటున్న ఈ దుస్థితికి మూలం అది అనుసరిస్తున్న విధానాల్లో ఉంది. చింతన్‌ శిబిర్‌లో దీనిపై చర్చ లోతుగా జరుగుతుందని ఆశించినవారికి నిరాశే మిగిలింది. మూడు దశాబ్దాల నయా ఉదారవాద ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ధ్వంసం చేస్తున్నదీ, ఆర్థిక అసమానతలు, ధరల పెరుగుదలకు ఎలా ఆజ్యం పోస్తున్నదీ కళ్లెదుట కనబడుతున్నా వీటిపై కాంగ్రెస్‌లో కించిత్‌ కూడా పశ్చాత్తాపం లేదు. ఆర్థిక విధానాలను సరి చేయాల్సిన అవసరం ఉందంటూనే. నయా ఉదారవాద విధానాలను వెనక్కి తీసుకునేది లేదని ముక్తాయింపు ఇస్తారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదని ఒక వైపు చెప్తూనే డెబ్బయ్యేళ్లుగా కష్టపడి నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి ప్రైవేట్‌ పరం చేస్తోందని అంటారు. ఇది ఆ పార్టీ వర్గ నైజాన్ని తెలియజేస్తోంది. బడా బూర్జువాల నేతృత్వంలోని బూర్జువా, భూస్వామ్య వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌, తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవే విధానాలను అమలు చేస్తున్నది. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక అధిక ధరలు, నిరుద్యోగం, ప్రజలపై భారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన ఆ విధానాలనే బిజెపి ప్రభుత్వం మరింత దూకుడుగా అమలు చేస్తోంది. దీనికి తోడు హిందూత్వ మతతత్వ ఎజెండాను ముందుకు తెచ్చి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు అది ప్రయత్నిస్తున్నది. దేశ లౌకికత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు బిజెపి ముందుకు తెస్తున్న మతతత్వ ఎజెండాను ఎదుర్కోవడానికి బదులు కాంగ్రెస్‌ మృదు హిందూత్వను అనుసరిస్తోంది. ఉదరుపూర్‌ చింతన్‌ శిబిర్‌లో రాహుల్‌ బ్రిగేడ్‌ మతం, కులం, ఇతర అస్తిత్వవాద శక్తులతో రాజీ పడే వైఖరిని అవలంబించాలని వాదిస్తే, ఓ చిన్న సెక్షన్‌ మాత్రమే లౌకిక వాదానికి కట్టుబడి ఉండాలని వాదించింది. ఆ పార్టీ నాయకుడు రాహుల్‌ బయటకు వచ్చి లౌకికవాదం, జాతీయవాదం, ప్రజాస్వామ్యం పరిరక్షణకు భావ సారూప్యత కలిగిన పార్టీలన్నీ తమతో కలసిరావాలని పిలుపునిస్తారు. కాంగ్రెస్‌ ఏ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నదో ఆ పాలక వర్గాలు మతతత్వంతో రాజీ పడాలని కోరుకుంటాయి. స్వాతంత్య్రోద్యమంలో లౌకికత్వ విలువలకు కాంగ్రెస్‌ కొంతవరకు కట్టుబడి ఉంది. స్వాతంత్య్రానంతర కాంగ్రెస్‌ పార్టీ చరిత్రను చూస్తే నెహ్రూ కాలంలో తప్ప మిగతా కాలమంతా లౌకికత్వానికి పరీక్ష ఎదురైనప్పుడల్లా అది రాజీ వైఖరినే అనుసరించింది. చింతన్‌ శిబిర్‌లో మూడు రోజుల పాటు జరిగిన చర్చల సరళి చూసినా, ఆ పార్టీ నేతల ప్రసంగాలు కానీ, చివరిలో విడుదలజేసిన ఉదయపూర్‌ రాజకీయ డిక్లరేషన్‌ చూసినా బిజెపిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయ విధానాలు లేవని స్పష్టమవుతుంది. ఈ స్థితిలో ప్రతిపక్షాలన్నిటినీ సమీకరించగల స్థితి ఆ పార్టీకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్సీ ఎస్టీ బిసిలకు ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలన్న చర్చ వచ్చినా రాజకీయ డిక్లరేషన్‌లో ఆ ఊసే ఎక్కడా లేదు. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి బీహార్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉనికిని చాటుకుంటున్న విషయం మరచిపోయి ఆ ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి సిద్ధాంతమూ లేదని రాహుల్‌ చేసిన విమర్శలు బెడిసికొట్టాయి. స్పష్టమైన విధానాలు కానీ, పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కానీ లేకుండా ప్రజలతో సంబంధాలు తెగిపోయాయని గుండెలు బాదుకోవడం వల్ల ప్రయోజనమేమీ ఉండదు.