నగరంలో సామాన్య పౌరులకు కనీస సౌకర్యాలు కల్పించడం కూడా పెద్ద సవాలుగా మారిన వేళ కుక్కల కోసం ప్రత్యేకంగా పార్కు నిర్మించాలని విశాఖ నగరపాలక సంస్థ నిర్ణయించడం విస్మయం కలిగిస్తోంది. కౌన్సిల్‌లో స్పష్టమైన ఆధిక్యతలో ఉన్న వైసిపి ప్రతిపక్షాల అభ్యంతరాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈ నిర్ణయం తీసుకుంది. కౌన్సిల్‌లో తీర్మానం చేయడంతో పాటు చెన్నైలోని ఒక సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. దీంతోపాటు మరో మూడు థీమ్ పార్కుల నిర్మాణానికి 12.7 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయించింది. ప్రజలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలను విస్మరించి ప్రాధాన్యత లేని అంశాలే సర్వస్వమన్నట్లు వ్యవహరించడమన్నది సరళీకృత ఆర్థిక విధానాల పర్యవసానమే. అమెరికా వంటి దేశాల్లో ఈ తరహా పార్కులు ఉన్నమాట నిజం! యజమానులు తమ పెంపుడు కుక్కలను కాసేపు తిప్పడానికి, వాటి అవసరాలు తీర్చుకోవడానికి ఈ పార్కులు అక్కడ ఉపయోగపడుతున్నాయి. సరళీకరణ విధానాల ద్వారా లబ్ధి పొంది ఎగువ మధ్యతరగతి, ఇంకా ఆపై స్థాయికి ఎగబాకిన నయా సంపన్న వర్గాల ప్రజలకు ఈ తరహా కోరికలు ఉండవచ్చు. అమెరికాలో మాదిరిగా రోడ్లు ఇక్కడ కూడా ఉండాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఆటోమొబైల్స్, ఫర్నిచర్, టూరిస్టు సౌకర్యాలు, విలాసవంతమైన హోటళ్ల వంటివి ఇక్కడ కూడా ఉండాలని ఈ తరగతి ప్రజలకు ఉంటుంది. ఐతే నగరాల్లో అత్యధికంగా ఉన్న జనాభా సామాన్య ప్రజలు. అందువల్ల పురపాలకులకు స్పష్టమైన ప్రాధాన్యతలు ఉండాలి.
నగర పాలక సంస్థ లెక్కల ప్రకారమే విశాఖలో 2.5 లక్షల కుటుంబాలు పేదరికపు రేఖకు దిగువన ఉన్నాయి. వీరందరికి మూడు రకాల చెత్తబుట్టలు సరఫరా చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. చెత్తబుట్టల సంగతి అలా ఉంచితే, వీరి నివాస ప్రాంతాల్లో కనీస వసతులు ఉన్నాయా? ఈ కుటుంబాల్లోని పిల్లల చదువు, ఆరోగ్య పరిరక్షణ ఎలా? వీరి జీవన ప్రమాణాల మెరుగుదలకు ఇప్పటిదాకా ఏం చేశారు? ఇంకా ఏం చేయాలి? పట్టణీకరణ వేగంగా జరుగుతున్న ప్రస్తుత సమయంలో రోజురోజుకీ పెరిగే వలసదారుల కనీస అవసరాలు ఎలా తీర్చాలి? హుదూద్ వంటి తుపాన్‌లు విరుచుకుపడితే ప్రజల రక్షణ సంగతేంటి? ఇటీవల తీసిన లెక్కల ప్రకారం తల దాచుకోవడానికి ఇంత గూడు లేక బస్డాండ్లు, రైల్వే స్టేషన్లు, ఫుట్‌పాత్‌లు ఆశ్రయించి నాలుగు వేల మంది బతుకులీడుస్తున్నారు. వీరందరికి షెల్టర్ గృహాలు నిర్మించాలన్న ప్రతిపాదన అసంపూర్తిగానే మిగిలింది. మరోవైపు వీరి సంఖ్యా పెరిగింది. ఈ సమస్యను పరిష్కరిచడం ఎలా? రోజురోజుకీ పెరుగుతున్న నగర అవసరాలకు తగ్గట్టుగా రోడ్ల నిర్మాణం, రక్షిత మంచి నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలు ఇవ్వన్నీ వదిలేసి కుక్కల పార్కు నిర్మాణం కోసం తహతహలాడటం ఏమిటి? అమెరికా దేశ భూభాగం మన భూభాగానికి 6 రెట్లు. అక్కడి జనాభా మన జనాభాలో ఐదవ వంతు. అంటే, ఇక్కడి సగటు పౌరుడి కన్నా అమెరికాలో సగటు పౌరుడికి 30 రెట్లు ఎక్కువ భూ వసతి ఉంది. రోడ్లకు, పార్కులకు, పౌర సౌకర్యాలు కల్పించడానికి ఉన్న అవకాశాలు ఆ దేశంలో ఎక్కువ. పైగా అందుకు కావాల్సిన ఆర్థిక వనరులూ ఉన్నాయి. దానికి భిన్నంగా పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించడానికి సైతం డబ్బులు లేని స్థితి విశాఖ కార్పొరేషన్‌ది. కాంట్రాక్టర్లకు బిల్లులు ఏళ్ల తరబడి బకాయి పడ్డారు. ఇంత తేడా ఉన్న స్థితిలో కొత్తగా అధికారంలోకి వచ్చిన పాలకవర్గ ప్రాధాన్యతలు చూస్తుంటే ఇసుమంతైనా ఔచిత్యం కానరావడంలేదు.
ఫ్రాన్స్‌లో ప్రజానీకం ఒకప్పుడు కడుపు నింపుకోవడానికి రొట్టెముక్కలు కావాలని ఆందోళన చేస్తుంటే ఆ దేశ రాణి రొట్టెల కోసం రోడ్డెక్కడం దేనికి? కేకు ముక్కలు తినవచ్చు కదా..అని అన్నారట! కనీస అవసరాలు తీరక విశాఖ ప్రజానీకం సతమతమౌతుంటే నగరపాలక సంస్థ తీసుకున్న నిర్ణయం వారిని వెక్కిరించేలా ఉంది. పాలకవర్గం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రజల వాస్తవ సమస్యలపై దృష్టి సారించాలి. తమను విస్మరించారన్న ఆగ్రహం కలిగితే ఆ ప్రజానీకం చెప్పే గుణపాఠాన్ని పాలకులు తట్టుకోగలరా?










