అవతలి వారికి ఏది అవసరమో దానిని ఎలాంటి ప్రతిఫలమూ ఆశించకుండా ఇచ్చేది దానం. దానం ఇవ్వడం చాలా గొప్పని, ఆ దానాల్లోనూ మళ్లీ గొప్ప గొప్పవి, మహా గొప్పవి ఉన్నాయని గొప్పగా ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే, 'మహా' అనేది ఎక్కడా స్థిరంగా ఉండదు. ఎక్కడ ఏది గొప్పని భావిస్తే అది అక్కడ మహా గొప్ప దానంగా ప్రాశస్త్యం పొందుతుంది. అన్నదానం, విద్యాదానం, అవయవదానం వంటివి ఆయా సందర్భాలకు అవే మహాదానాలు. భూదానం, గోదానం, కన్యాదానం వంటివి ఉండనే ఉన్నాయి. ఆవులూ భూములూ, మేకలూ మేడలూ సరే సరి... కన్యలు కూడా ఇవ్వబడేవారు, తీసుకోబడేవారేనా? వాళ్లకో హృదయం, ఆలోచన, అంగీకారం వంటివి ఉంటాయని ఈ పురుష మహా దానకర్తలు ఎందుకు గుర్తించరు అని చలం వంటి స్త్రీ జన శ్రేయోభిలాషులు ఎప్పుడో ప్రశ్నించారు. కానీ, పురుషాధిక్య భావ దారిద్య్రం భాషా నిఘంటువుల్లో, మంత్రాల వివాహ తంతుల్లో ఇంకా ఘీంకరిస్తూనే ఉంది.
దానమిచ్చువాడు దాత అయితే, లెక్కకు మిక్కిలిగా పెక్కు దానాలిచ్చువాడు మహాదాత. ఇలాంటి మహా దాతృత్వాలు పురాణాల్లో, చరిత్రలో, శిలాశాసనాల్లో కోకొల్లలుగా కనిపిస్తాయి. ప్రజాస్వామ్య యుగంలోనూ తరచూ పత్రికల పతాక శీర్షికలకెక్కుతాయి. బిల్‌గేట్స్, జుకర్‌బర్గ్, ప్రేమ్ జీ, రతన్ టాటా వంటివారు జనసంక్షేమం కోసం నిధులివ్వడం చాలాసార్లు చూశాం. భూరి విరాళాల పేరిట వారికి భారీ ప్రచారం లభిస్తుంది. ప్రశంసలూ, పన్ను రాయితీలూ ఉంటాయి. ఇచ్చినవాడి గురించి ఎంత టముకు వేస్తే మాత్రం నష్టం ఏమిటని సామాన్య జనం కూడా భావిస్తారు. మరి ఈ ఇచ్చువారికి అంతంత సంపదను సమకూర్చి పెట్టిన వారెవరు? ఎన్ని రెక్కల కష్టం, ఎన్ని మెదళ్ల శక్తి ఒక్క దగ్గర కూడబెడితే అంత కలిమి చేకూరింది? ఇలాంటి ప్రశ్నలకు జవాబు వెతుక్కుంటూ వెళితే- మళ్లీ ఏ చేతులైతే సాయం కోసం దేవుల్లాడుతున్నాయో ఆ చేతుల దగ్గరే ఆగుతాయి. ఏ కాళ్లయితే కూసింత ఆసరా కోసం వంగి వంగి పరుగులు తీస్తున్నాయో ఆ పాదాల చెంతకే చేరతాయి. ఎక్కడ శ్రమ చేస్తారో అక్కడ సంపద సృష్టి జరుగుతుంది. అయితే, ఆ సంపద పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీ సూత్రాలననుసరించి, యజమాని వద్దకు చేరుతుంది. అతడే అప్పుడప్పుడు దాతగా అవతరిస్తాడు. తద్వారా పేరు ప్రఖ్యాతులను, ప్రభుత్వ రాయితీలను సంపాదించటం మాత్రమే కాదు; దోపిడీ సూత్రాలకు సామాజిక బాధ్యతనే అంగీకృత ముసుగును కూడా విజయవంతంగా తొడగగలుగుతాడు.
ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు, ప్రతికూల పరిస్థితులు పొటమరించినప్పుడూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటానికి అనేక సామాన్య హస్తాలు సైతం ముందుకొస్తాయి. కొంత కొంతగా సహాయాన్ని కూడగట్టి కొండంత అండగా నిలుస్తాయి. తోటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సాటి మనిషి స్పందించటం సహజమైన మానవత్వం. వాస్తవానికి అది భూరి, భారీ విరాళాలకు మించిన గొప్ప మానవీయ స్పందన. కుటుంబ అవసరాల కోసం తినీతినక దాచుకున్న డబ్బును, కాయకష్టంతో సమకూర్చుకున్న సొమ్మును ఆపదలో ఉదారంగా ఇవ్వగలగటం మామూలు విషయం కాదు. ''మీ పాట్లు మీరే పడండి.. మీకు కేంద్రం నుంచి వ్యాక్సిన్లు ఇవ్వబోం.'' అని ఓ వదరబోతు బిజెపి నేత అహంకరించినప్పుడు- ''ఆరు నూరైనా ప్రజలందరికీ ఉచితంగానే టీకాలు ఇచ్చి తీరుతాం'' అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ భరోసా ఇచ్చినప్పుడు- ఆ రాష్ట్రంలో సామాన్యులు స్పందించిన తీరు గొప్ప మానవ హృదయానికి సంకేతం! 35 ఏళ్ల పాటు బీడీలు చుట్టి కూడబెట్టిన రూ. 2 లక్షల జీవిత కాలపు పొదుపు మొత్తాన్ని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి నిధికి తరలించాడు జనార్దన్. తన వద్ద ఉన్న రెండు మేకలను అమ్మి ఆ సొమ్మును ముఖ్యమంత్రికి పంపింది చిన్న టీ దుకాణం నడిపే సుబేదమ్మ. లక్షల కోట్ల సంపదలోంచి రవ్వంత మొత్తాన్ని సమాజానికిచ్చే శత కోటీశ్వరుల దాతృత్వం కన్నా- రేపటి తిండి కోసం వెతుకులాడాల్సిన పరిస్థితిలో చేతిలో ఉన్న మొత్తాన్ని ప్రజల కోసం వినియోగించిన ఈ సామాన్యుల విశాలత్వం చాలా చాలా గొప్పది. అలాంటి సామాన్యుల అభిమానం చూరగొన్న కేరళ వామపక్ష ప్రభుత్వం తన ప్రమాణ స్వీకారోత్సవానికి జనార్దన్‌నీ, సుబేదమ్మనీ ముఖ్య అతిథులుగా ఆహ్వానించటం ఎంతైనా సముచితం.










