Jan 17,2021 13:31

    బాల్యం అంటే ఒకరు ఇస్తే తీసుకోవడం తప్ప.. ఇవ్వడం తెలియని వయస్సు... ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికి సాయం చేయాలనే ఆలోచన రావడం అభినందించదగ్గ విషయం. అదీ.. ఏడేళ్ల వయస్సులో. సరిగ్గా ఇలాంటి ఘటనే మదురైలో ప్రజల హృదయాలను ఆలోచింపజేసేలా చేసింది. ఛారిటీ కోసం తాను వేసుకున్న పెయింటింగ్స్‌ విక్రయించి, అందరినీ ఔరా అనిపించాడు. అంతేకాకుండా అంత చిన్న వయస్సులో పెయింటింగ్స్‌పై, వాటిలోని విభిన్న షేడ్స్‌పై అతనికున్న అభిరుచితో అందరినీ అబ్బురపరిచాడు. పెయింటింగ్స్‌ అమ్మగా వచ్చిన రూ.50,000 లను ఛారిటీకి విరాళంగా ఇచ్చాడు.
    మదురైకు చెందిన ఏడేళ్ల రితున్‌ కునాల్‌ తాను వేసిన చిత్రాలను పుట్టినరోజు సందర్భంగా అమ్మకానికి పెట్టాడు. తద్వారా వచ్చిన నగదును ఛారిటీస్‌ కోసం విరాళంగా ఇచ్చాడు. డిసెంబర్‌ 27న కునాల్‌ ఏడో పుట్టినరోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అతిథులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఎనిమిది నెలల్లో తాను గీసిన 50 చిత్రాలను తల్లిదండ్రుల సహకారంతో గ్యాలరీగా ఏర్పాటు చేసి, అమ్మకానికి పెట్టాడు. చిత్రాలకు వీక్షకులు కట్టిన వెలకు ఆశ్చర్యపోయాడు. అంతేకాదు గ్యాలరీ ఏర్పాటు చేసిన నాలుగు గంటల్లోపే 50 చిత్రాలు రూ.50,000 కు అమ్ముడుపోయాయి.
    చిన్నతనంలోనే కునాల్‌కు పెయింటింగ్‌ పట్ల, రంగుల పట్ల ఉన్న ఆసక్తి, అభిరుచిని గుర్తించిన అతని తల్లి ప్రీతికాగాంధీ రెండున్నర సంవత్సరాల వయస్సు నుంచే బ్రష్‌ చేతబట్టిన కునాల్‌ను ప్రోత్సహిస్తూ వచ్చారు. 'ఈ వయస్సులో చిత్రాలు గీయడానికి కళాత్మక నైపుణ్యంతో పనిలేదు. కానీ వాటికి సంబంధించిన విభిన్నమైన షేడ్స్‌, ప్యాట్రన్స్‌, వాటికి రంగులు అద్దే విధానం ఆ వయస్సుకు అర్థం కావడం చాలా ఆశ్చర్యం కలిగించింది' అని ప్రీతికా తెలిపారు.
    లాక్‌డౌన్‌ సమయంలో గాడ్జెట్‌లకు బానిస కాకుండా తనలోని కళా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించడం ప్రీతికాకు సంతోషాన్ని కలిగించింది. మార్చి, నవంబర్‌ మధ్య, కునాల్‌ తన కాన్వాసులు, రంగులతో సుమారు 200 గంటలు గడిపాడు. అతని పట్టుదల చప్పట్లు కొట్టాలనిపించేలా చేసిందని తల్లిదండ్రులు తెలిపారు.
   ఇందులో భాగంగానే కళాకృతుల అమ్మకం-కమ్‌- ఎగ్జిబిషన్‌ను యక్రిలిక్‌లో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వీటిలో రెండింటినీ ఒక్కో పెయింటింగ్‌ రూ.2,000కు అమ్ముడుపోవడం ఆశ్చర్యం కలిగించింది. బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ సందర్శకుడు రంగురంగుల డూడుల్‌తో ప్రేమలో పడ్డాడు. అతనితో పాటు నగరానికి చెందిన ఓ వైద్యుడిని అసాధారణ రంగులతో వేసిన రెండు జిరాఫీల పెయింటింగ్‌ ఎంతగానో ఆకర్షించింది. దీంతో ఆ ఇద్దరూ వాటిని ఎంచుకున్నారు. తద్వారా వచ్చిన నగదును ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యంగల పిల్లల చదువుకు విరాళం ఇచ్చే అవకాశం ఏర్పడింది.
    'కాన్వాస్‌ పరిమాణం, వాటిని పూర్తి చేయడానికి కేటాయించిన సమయాన్ని బట్టి నేను పెయింటింగ్స్‌కు యాధృచ్ఛికంగా ధర నిర్ణయించాను' అని అరవింద్‌ ఐ హాస్పిటల్‌లోని నేత్ర వైద్య నిపుణుడు ప్రీతికాకు తెలిపారు. పెయింటింగ్స్‌ అన్నీ అమ్ముడుపోతాయని తాను ఊహించలేదని ప్రీతికా తెలిపారు.
విలువైన సమయాన్ని ఇంట్లో ఎలా గడపాలో తెలిపేందుకు ఈ ప్రదర్శన తోడ్పడుతుంది. నిరంతరం కునాల్‌కు కళను ప్రోత్సహించేదానినని ప్రీతికా తెలిపారు. కునాల్‌ చిత్ర ప్రదర్శనకు హాజరైన రెండో తరగతి విద్యార్థిని ఇష్టమైన చిత్రం గురించి అడగ్గా.. 'కరోనా మహమ్మారిపై గీసిన కాన్వాస్‌ నచ్చింది. ఈ కాన్వాస్‌లో సగం చీకటికి.. సగం ప్రకాశవంతమైన సూర్యుడుకి.. మధ్యలో సజీవంగా ఉన్న పచ్చదనం.. వైరస్‌ ప్రభావంతో చనిపోయిన వృక్షాలు ప్రస్తుత పరిస్థితులకు అద్దంపట్టేలా ఉంది!' అని వివరించింది.
    ఇది కునాల్‌ చిత్రాల వెనుకున్న అర్థవంతమైన ఆలోచనను తెలియజేస్తే.. ఆ చిత్రాన్ని అర్థం చేసుకుని, వివరించడం సున్నితమైన ఆ చిన్నారి ఆలోచనా ప్రక్రియను ప్రతిబింబిస్తోంది.